అయోమయం
అయోమయం
Published Fri, May 26 2017 12:34 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
- తేలని టీడీపీ పార్టీ సారథి పంచాయతీ
- నవీన్‌కు ఖాయమైన జెడ్పీ పీఠం
- ‘దేశం’లో కొనసాగుతున్న ‘హై’డ్రామా
పార్టీయే సర్వస్వం అనుకున్నారు ... అంచలంచెలుగా ఎదిగి జెడ్పీ చైర్మెన్ పీఠంపై కూర్చొని ముచ్చటగా మూడేళ్లయింది ... అంతలోనే వలసలు వచ్చి ఎసరు పెట్టేయడంతో టీడీపీ రాజకీయ చక్రవ్యూహంలో చిక్కుకొని గిలగిల్లాడుతున్నారు నామన రాంబాబు. తన అనుచరులను కూడా బుజ్జగించి ఒంటరిని చేసేందుకు పార్టీ పెద్దలు పావులు కదుపుతుండడంతో ఏమి చేయాలో తెలియక అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రెండు కీలకమైన నియామకాలపై తెలుగుదేశం పార్టీలో హైడ్రామా నడుస్తోంది. పార్టీ పగ్గాలు, జెడ్పీ చైర్మన్ పీఠం రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వీటిని సమస్వయం చేసే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప భుజానకెత్తుకున్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుకు పార్టీ పగ్గాలు అప్పగించి ... జెడ్పీ చైర్మన్ పదవి నుంచి తప్పించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌కు అప్పగించాలనేది పార్టీ వ్యూహం. ఈ దిశగా అన్నీ తానై గడచిన వారం రోజులుగా రాజప్ప ప్రయత్నాలన్నీ తుస్సుమని బొమ్మ తిరిగి దిమ్మ చేతికొచ్చి పార్టీ రచ్చకెక్కిన విషయం తెలిసిందే. మొదట్లో దూకుడు ప్రదర్శించిన రాజప్ప చక్కదిద్దలేకపోగా పార్టీని బజారున పడేశారని కేడర్ మథనపడుతోంది. పార్టీ పగ్గాలు చేపడితే చైర్మన్ పీఠానికి ఎసరుపెడతారనే భయంతో ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నామనను పైకి బుజ్జగిస్తున్నట్టు ముఖ్యనేతలు కనిపించారు. తీరా తెరవెనుక మాత్రం అనుకున్న వ్యూహాన్ని పక్కాగా అమలుచేసే ఎత్తులు వేస్తూనే ఉన్నారు. మొదట నామనను బుజ్జగించేందుకు మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొండబాబు తదితరులను పంపించిన చినరాజప్ప అకస్మాత్తుగా వారికి కనీసం మాటమత్రమైనా చెప్పకుండా తరువాత రోజు నేతలను మార్చి పంపడంపై నేతలు గుర్రుగా ఉన్నారు. అక్కడికి తామేమీ చేయలేకపోయామని తెలియజెప్పాలని మంత్రుల ఉద్ధేశంగా కనిపిస్తుందంటున్నారు. ప్రత్తిపాడు మినీ మహానాడు వేదిక వరకూ తీసుకురాగలిగిన నేతలు అతనికేమైనా భరోసా ఇవ్వగలిగారా, పార్టీపరంగా జరిగిన నష్టాన్ని తొలగించగలిగారా అని కేడర్ ప్రశ్నిస్తోంది.
ఏకాకిని చేసేందుకు పావులు...
పార్టీ పగ్గాలు చేపట్టేలా చైర్మన్‌ను ఓ పక్క ఒప్పించే ప్రయత్నం చేస్తూ, మరోపక్క పార్టీలో అతన్ని ఏకాకిని చేసేందుకు ముఖ్యనేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే జరుగుతున్న పరిణామాలతో కలిగే నష్టాన్ని కుండబద్దలు కొట్టిన పేరాబత్తుల రాజశేఖర్, నాగిడి నాగేశ్వరరావు తదితర జెడ్పీటీసీలను అధిష్టానం వద్దకు పంపించి పార్టీకి కట్టుబడి ఉంటామని ఒప్పింపజేసి మౌనం వహించేలా చేస్తున్నారు. వాస్తవం చెప్పడమే నేరమన్నట్టు నామనకు మద్ధతుదారులనే ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అమాత్యుల ఎత్తుగడలతో నామనకు నైతికంగా మద్ధతు తెలియచేసిన వారంతా ఇప్పుడు దాదాపు దూరం చేయడంలో ముఖ్యనేతల వ్యూహం ఫలించినట్టయింది. ఇప్పుడు నామనకు రెండే రెండుదార్లు కనిపిస్తున్నాయి. ఒకటి పార్టీలో కొనసాగాలంటే పార్టీ పగ్గాలు చేపట్టడం, ఆ తరువాత చైర్మన్ గిరీకి రాజీనామా చేయడం. నేతలు నమ్మకద్రోహం చేశారని, మూడు దశాబ్థాల రాజకీయంలో ఇంతటి అవమానం ఎదురవలేదని భావిస్తే పార్టీకి దూరమవడం. వీటిలో నామన ఎటువైపు మొగ్గుతారనేది పార్టీలో చర్చనీయాంశమైంది. నామన కాదంటే ఆ తరువాత పార్టీ పగ్గాలు ఎవరిని ఎంపిక చేయాలనేది ఆలోచిస్తామని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.
పార్టీ అధిష్ఠానం మాట ప్రకారం నవీన్‌కు జెడ్పీ చైర్మన్ గిరీ అప్పగించడం ఖాయమైందని పార్టీలో విశ్వసనీయ సమాచారం. నామన అవునన్నా, కాదన్నా చైర్మన్ పదవిలో అతని స్థానే నవీన్ కూర్చోవడానికి పై స్థాయిలో లైన్ క్లియర్ అయిందనే చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే టీడీపీలో జరుగుతున్నది హైడ్రామా కాక మరేమిటని ఆ పార్టీ అనుచరులే బాహాటంగా విమర్శిస్తున్నారు.
Advertisement
Advertisement