పీడీసీసీబీ చైర్మన్‌ ఎన్నికకు మినిస్టర్‌ స్టే..? | PCDC chairman election Minster Stay | Sakshi
Sakshi News home page

పీడీసీసీబీ చైర్మన్‌ ఎన్నికకు మినిస్టర్‌ స్టే..?

Published Sun, Dec 3 2017 11:02 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

PCDC chairman election Minster Stay - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (పీడీసీసీబీ) చైర్మన్‌ ఎంపిక వ్యవహారంలో ఇరుకునపడ్డ అధికార పార్టీ దాన్నుంచి తప్పించుకునేందుకు సరికొత్త వ్యూహానికి తెరలేపింది. తొలుత పాలకవర్గాన్ని రద్దు చేయించి ప్రత్యేకాధికారిని నియమించాలనుకున్న అధికార పార్టీ నేతలు ఈ మేరకు సహకార శాఖ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు సహకార శాఖ రిజిస్ట్రార్‌ (ఆర్‌సీఎస్‌) మురళీ ససేమిరా అనడంతో అధికార పార్టీ నేతలు వ్యూహం మార్చారు. శాంతిభద్రతల సాకు చూపి మినిస్టర్‌ స్టే ద్వారా ఈ నెల 5న జరిగే చైర్మన్‌ ఎన్నికను అడ్డుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా శనివారం సమావేశమైన మంత్రులు శిద్దా రాఘవరావు, పి.నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌లు మినిస్టర్‌ స్టే వ్యవహారంపై చర్చించినట్లు తెలుస్తోంది. 

చైర్మన్‌ ఎన్నిక తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఇదే మార్గాన్ని అనుసరించాలని వారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఆర్‌డీఓలతో చర్చించిన నేతలు శాంతిభద్రతల సాకు చూపి ఎన్నికను నిలిపివేయడం మినహా వేరే దారి లేదని భావించినట్లు తెలుస్తోంది. హుటాహుటిన శాంతిభద్రతల సమస్యపై నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్, ఎస్పీలతో పాటు ఆర్‌డీఓను కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఆర్‌డీఓ ద్వారా శనివారం సాయంత్రానికే సహకార శాఖకు నివేదిక పంపినట్లు సమాచారం. ఈ నెల 5న జరిగే చైర్మన్‌ ఎన్నికకు శాంతిభద్రతల సమస్య ఉందని పలువురు నేతలు పోటీ పడుతున్నందున గొడవ జరిగే అవకాశం ఉందని దీంతో ఎన్నిక జరగకుండా స్టే ఇవ్వాలని నివేదికలో కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం లేదా సోమవారం నాటికి పీడీసీసీబీ చైర్మన్‌ ఎన్నిక జరగకుండా సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ద్వారా స్టే ఇప్పించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం. 

చైర్మన్‌ గిరీ కోసం మూడు గ్రూపుల పట్టు..
పాత చైర్మన్‌ ఈదర మోహన్‌ రాజీనామాతో కొత్త చైర్మన్‌ ఎంపికను పార్టీ అధిష్టానం మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నెల 5న చైర్మన్‌ ఎంపికకు సంబంధించి సహకార శాఖ నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది. ఈదర మోహన్‌ను పదవి నుంచి దించడంలో కీలక భూమిక పోషించిన మస్తానయ్య చైర్మన్‌ పదవిని తనకే ఇవ్వాలంటూ పట్టుపడుతున్నారు. మెజార్టీ డైరెక్టర్ల మద్ధతు ఆయనకే ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక తొలుత ఎమ్మెల్యే జనార్దన్‌ సైతం మస్తానయ్యకే మద్ధతు పలికారు. మరోవైపు తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్న కండె శ్రీనివాసులు సైతం తనకే చైర్మన్‌ పదవి కావాలంటూ పట్టుపడుతున్నారు. ఇదిలా ఉండగా జనార్దన్‌ చిన్నాన్న దామచర్ల పూర్ణచంద్రరావు చైర్మన్‌ పదవి కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కుమారుడు దామచర్ల సత్య సైతం తండ్రికే చైర్మన్‌ పదవి ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. దీంతో చైర్మన్‌ ఎంపిక మంత్రులతో పాటు జనార్దన్‌కు తలనొప్పిగా పరిణమించింది. ఏ ఒక్కరికి చైర్మన్‌గిరి ఇచ్చినా మిగిలిన వారు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా చైర్మన్‌ ఎంపికను నిలిపివేయాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. తొలుత పాలకవర్గాన్ని రద్దు చేసి ప్రత్యేకాధికారి ద్వారా పీడీసీసీబీని నడిపించాలని నిర్ణయించినా ఆర్‌సీఎస్‌ వ్యతిరేకించటం ఇది వీలు కాలేదు. ఇప్పుడు శాంతిభద్రతల సాకు చూపి మినిస్టర్‌ స్టే ద్వారా చైర్మన్‌ ఎంపికను నిలిపివేయాలని అధికార పార్టీ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పీడీసీసీబీ అధికార పార్టీకి అనుకూలంగా ఉంది. దాదాపు డైరెక్టర్లందరూ అధికార పార్టీ మద్ధతుదారులుగానే ఉన్నారు. వారు గొడవ చేసే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతిభద్రతల సాకు చూపి ఎన్నికలను నిలిపివేయాలనుకోవడంపై అధికార పార్టీలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం..
మెజార్టీ డైరెక్టర్లు, ఎమ్మెల్యేల  అభిప్రాయాలకు భిన్నంగా కొత్త చైర్మన్‌ ఎన్నికను నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 19 మందితో జరిగే ఎన్నికకే రక్షణ కల్పించలేమని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టిస్తున్నారని, ఇది కేవలం కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వేసిన ఎత్తుగడ అని ఆరోపిస్తూ శనివారం రాత్రి  డైరక్టర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నిక వాయిదా వేస్తే ప్రజాక్షేత్రంలో పోరాటానికి తాము సిద్ధమని ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement