PDCCB issue
-
పీడీసీసీబీని వెంటాడుతున్న మొండి బకాయిలు
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (పీడీసీసీబీ)నష్టాల్లోనే కొనసాగుతోంది. పీడీసీసీబీని తమ సొంత జేబు సంస్థగా చేసుకున్న కొందరు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించకపోవటంతో మొండి బకాయిలు పీడలా బ్యాంకును వెంటాడుతున్నాయి. గత మూడు, నాలుగేళ్లుగా బ్యాంకు పాలక మండలి విషయంలో తీవ్ర సంక్షోభంలో ఉండిపోయింది. మూడేళ్ల క్రితం బ్యాంకులో కుదువ పెట్టిన బంగారు ఆభరణాల కుంభకోణం బ్యాంకును ఒక కుదుపు కుదిపింది. కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని బ్యాంకు సిబ్బంది, బ్యాంకు అప్రైజర్లు కొందరు బంగారాన్ని కుదువ పెట్టిన రుణగ్రస్తులు కలిసి బ్యాంకును మోసం చేశారు. అప్పట్లో బ్యాంకు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేశారు. కొందరిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. దీంతో పాటు వరుసగా బ్యాంకు చైర్మన్లు మారటం, కోర్టులకు ఎక్కడం ఇలా బ్యాంకు పాలకమండలి పరిపాలన అస్తవ్యస్తంగా మారిందనటంలో సందేహం లేదు. దీనికి తోడు బ్యాంకును తమ సొంత జేబు సంస్థలా వాడుకున్న కొందరు రూ.కోట్ల కొద్దీ తీసుకున్న రుణాలు తిరిగి వసూలు చేయటంలో బ్యాంకు యాజమాన్యం మెతక వైఖరి అవలంభించిందనే చెల్పాలి. బ్యాంకుకు ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఉన్నప్పటికీ గతంలో పనిచేసిన కలెక్టర్లు బ్యాంకు అభివృద్దిపై పూర్తిగా దృష్టి సారించకపోవటం కూడా బ్యాంకు నష్టాల్లోకి వెళ్లటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి.. ఇవన్నీ ఒక ఎత్తయితే గత ఐదేళ్లుగా వరుస కరువుతో జిల్లా రైతాంగం అతలాకుతలం అయ్యారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వేయలేకపోవటం, ఒక వేళ పంటలు వేసినా దిగుబడి రాకపోవటం, లేకుంటే వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర రాకపోవటంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతులు తీసుకున్న పంట రుణాలు కూడా సక్రమంగా చెల్లించలేకపోయిన మాట వాస్తవమే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రస్తుత కలెక్టర్ పోలా భాస్కర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బ్యాంకు వ్యవహారంలో ప్రత్యేక దృష్టి సారించారు. అయినా పాత బకాయిలు బ్యాంకుకు గుది బండలా మారటంతో జిల్లా కలెక్టర్ అందుకు సంబంధించిన వ్యవహారంపై దృష్టి సారిస్తున్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆడిట్ ఇటీవలే పూర్తయింది. ఆడిట్లో కొన్ని బ్యాంకు సిబ్బంది సాంకేతిక పరంగా చేసిన కొన్ని పొరపాట్లు కూడా బ్యాంకు అభివృద్ధికి కొంత ఆటంకంగా మారింది. బకాయిల వసూళ్లలో కనిపించని పురోగతి.. ఆడిట్ ప్రకారం 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.3.11 కోట్లు నష్టం వచ్చినట్లు తేలింది. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే కొంత మేర తగ్గింది. గత సంవత్సరం రూ.3.28 కోట్ల మేర నష్టం వచ్చినట్లు తేల్చారు. దీంతో 2017–18తో పోలిస్తే ఆడిట్ నిర్వహించిన ఏడాదికి గాను రూ.17 లక్షలు నష్టం తగ్గినట్లు తేలింది. ఇకపోతే బ్యాంకును పీడిస్తున్న మొండి బకాయిలు విషయంలో మాత్రం కొంత పురోగతి కనిపించింది. ఆప్కాబ్ నుంచి డిప్యూటేషన్‌పై బ్యాంకు సీఈఓగా వచ్చిన జి.జయ శంకర్ ఆధ్వర్యంలో బ్యాంకు బృందం మొండి బకాయీల విషయంలో చేసిన కసరత్తు కొంతమేర ఫలించింది. గత సంవత్సరంతో పోలిస్తే రూ.4.50 కోట్లు తగ్గింది. 2017–18 సంవత్సరానికి గాను మొండి బకాయీలు రూ.38.50 కోట్లు ఉండగా 2018–19 సంవత్సరానికి అదికాస్తా రూ.34 కోట్లకు తగ్గింది. అధికారులకు తలనొప్పిగా మారిన రీ ఎంట్రీలు.. ఇదిలా ఉంటే బ్యాంకు కమ్యూనికేషన్ వ్వవస్థకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో లోపాలు తలెత్తాయి. ఆ లోపాల వల్ల కొంత అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడింది. కంప్యూటర్లలో నిక్షప్తం అయిన సమాచారం ప్రకారం లోపాలను సరిదిద్దటంతో రూ.8.04 కోట్లు రీ ఎంట్రీలు వేయాల్సిన పరిస్థితి నెలకొని ఆడిట్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. వాటితో పాటు నిరర్ధక ఆస్తులు రూ.1.74 కోట్లు ఉన్నట్లు తేల్చారు. లాంగ్ టర్మ్ రుణాల వడ్డీల్లో వచ్చిన తేడాల వల్ల రిసీవబుల్స్ కింద రూ.60 లక్షలు తేడా ఉన్నట్లు తేల్చారు. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు 2018–19లో ఇచ్చిన రుణాల రికవరీలో కొంతమేర పురోగతి ఉండటంతో నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్స్(ఎన్పీఏ)ల పరిస్థితి 3 శాతంగా నమోదు అయింది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం ఎన్పీఏ 5 శాతం దాటితే బ్యాంకు దివాలా పరిస్థితిని ఎదుర్కొనేది. అలాంటిది 3 శాతం కావటంతో ఆ ప్రమాదం నుంచి బయట పడినట్లు అయింది. మొత్తం మీద 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,100 కోట్లు వివిధ రకాల రుణాలుగా అందజేశారు. అయితే బ్యాంకు మాత్రం డిపాజిట్లు సేకరించే లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. బ్యాంకు డిపాజిట్ల సేకరణ లక్ష్యం రూ.745 కోట్లు కాగా రూ.633 కోట్లు మాత్రమే సేకరించగలిగింది. దీంతో డిపాజిట్ల లోటు రూ.112 కోట్లు ఏర్పడినట్లయింది. జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు పరిధిలో మొత్తం జిల్లాలో 29 బ్రాంచ్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో 169 పిఏసిఎస్‌లు పనిచేస్తున్నాయి. వాటితో పాటు 7 సీడెడ్ సొసైటీలు ఉన్నాయి. -
టీడీపీ నేతల పాపాలు.. డెయిరీకి శా‘పాలు’
సాక్షి, ఒంగోలు సబర్బన్: సొంత ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించిన జిల్లా టీడీపీ నాయకులు సహకార రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. అభివృద్ధి చేస్తామని చెబితే నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారు. సహకార రంగం కుదేలవుతోందని సీఎం చంద్రబాబుకు తెలిసినా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పీడీసీసీబీ, డీసీఎంస్‌లో టీడీపీ నేతల పెత్తనం కారణంగా అవి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. జిల్లాలో సహకార వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. బాబు ఐదేళ్ల పాలనలో సహకార వ్యవస్థలో ఉన్న ప్రధానమైన సంస్థలన్నీ మూతపడే స్థితికి చేరాయి. సహకార సంఘాలు, సొసైటీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సహకార సంఘాలు బలోపేతమైతే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ అధికార టీడీపీ నాయకులు వారి వ్యాపారాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం సహకార వ్యవస్థను నాశనం చేశారు. కోలుకోలేని స్థితిలో ఒంగోలు డెయిరీ.. జిల్లాలో ప్రధానంగా సహకార రంగంలో ఉన్న ఒంగోలు డెయిరీని పాలక మండలి చైర్మన్‌గా వ్యవహరించిన టీడీపీ నేత చల్లా శ్రీనివాసరావు మ్యాక్స్ చట్టంలోకి మార్చి కంపెనీ యాక్టులోకి తీసుకెళ్లాడు. డెయిరీ సొమ్ము రూ.80 కోట్లు కాజేసి ఒట్టిపోయిన గేదెలా తయారు చేశాడు. దేశంలోనే ప్రకాశం జిల్లా పాలకు మంచి గిరాకీ ఉంది. దానికితోడు రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. రోజూ ఒంగోలు డెయిరీకి 2 లక్షల లీటర్ల పాలు వచ్చేవంటే జిల్లాలో పాడి పరిశ్రమ ఏ విధంగా అభివృద్ది చెందిందో అర్థమవుతుంది. అలాంటి డెయిరీని రూ.80 కోట్లకు పైగా అప్పుల్లోకి కూరుకుపోయేట్టు చేసింది టీడీపీ నాయకులతో కూడిన పాలకమండలి. సుదీర్ఘ కాలం చైర్మన్‌గా ఉన్న చల్లా శ్రీనివాసరావు తన సొంత నిధుల మాదిరిగా డెయిరీ డబ్బును ఖర్చు చేసి చివరకు మూతపడే స్థితికి తీసుకెళ్లాడు. పాలు పోసిన రైతులకు నేటికీ డబ్బు ఇవ్వలేదు. పాలు రవాణా చేసిన ట్రాన్స్పోర్ట్దారులకు కిరాయిలు ఎగ్గొట్టారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టలేదు. ఫెడరేషన్ నుంచి రూ.35 కోట్లు అప్పు తీసుకుని తిరగి గాడిలో పెడదామన్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఉద్యోగులకు వేతనం ఇవ్వకపోవడంతో డెయిరీ నిర్వహణే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అధికారులతో కూడిన పాలక మండలి కూడా డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆసక్తి చూపడం లేదు. రైతులకు ఉపయోగపడని పీడీసీసీబీ ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(పీడీసీసీబీ) పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగ పడే పరిస్థితిలో లేకుండా పోయింది. ఈ బ్యాంకు పరిధిలో 169 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. అవన్నీ ఉత్సవ విగ్రహాల్లా ఉండిపోయాయి తప్పితే వ్యవసాయ రుణాలు ఇచ్చే పరిస్థితిలో లేవు. అసలే ఐదేళ్లుగా వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్నా కనీసం ఆరుతడి పంటలకు కూడా పంట రుణాలు ఇచ్చే పరిస్థితి పీడీసీసీ బ్యాంకుకు లేదు. ఎందుకంటే ప్రభుత్వం బ్యాంకుకు సంబంధించిన నిధులు బడా బాబులకు అప్పనంగా ఇచ్చి బ్యాంకును నష్టాల్లోకి నెట్టారు. ♦ పీడీసీసీ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల క్రితం స్వయానా ప్రభుత్వమే హామీగా ఉండి ఇంకొల్లు స్పిన్నింగ్ మిల్లుకు కోట్లాది రూపాయలు అప్పుగా ఇప్పించింది. తర్వాత కాలంలో చంద్రబాబునాయుడి దెబ్బకు స్పిన్నింగ్ మిల్లు మూత పడింది. అయితే ఇచ్చిన అప్పును తిరిగి పీడీసీసీ బ్యాంకుకు ఇప్పించాల్సిన ప్రభుత్వం నేటికీ దాని ఊసే పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బ్యాంకుకు దాదాపు రూ.11 కోట్లు మొండి బకాయి కింద ఉండిపోయింది. ♦ అదే విధంగా ముఖ్యమంత్రి సామాజికవర్గానికే చెందిన పీడీసీసీ బ్యాంక్ పాలక మండలి మాజీ చైర్మన్ తన కుటుంబ సభ్యుల పేరుతో, తారకరామ డెయిరీ పేరుతో రూ.4 కోట్లు రుణం తీసుకున్నాడు. అది కాస్తా వడ్డీ పెరిగి రూ.7 కోట్లు అయింది. ఆ బాకీ వసూలు ఊసే లేదు. ♦ బ్యాంకులో నకిలీ ఆభరణాలు పెట్టి రూ.2.50 కోట్లు రుణంగా తీసుకున్నారు. రెండేళ్ల క్రితం ఆ కుంభకోణం కేసులో కొందరిపై చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. 4,500 పేజీల నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఆ కుంభకోణం తాలూకు నిధులు ఇప్పటికీ రికవరీ కాలేదు. ♦ జిల్లాలో 169 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) నుంచి రైతులు ప్రయోజనం పొందాల్సి ఉంటే వాటి ఊసే లేదు. కానీ వారోత్సవాల పేరిట రోజుకు రెండు పీఏసీఎస్‌లలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. వాటి వల్ల రైతులకు ఒరగింది మాత్రం శూన్యం. అప్పుల కుప్ప డీసీఎంఎస్ జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పరిస్థితి కూడా అంతే. రైతులకు సంబంధించిన వ్యాపారాలు చేసి తద్వారా వచ్చే లాభాలను రైతు ప్రయోజనాలకు వినియోగించాల్సిన డీసీఎంఎస్ అందుకు భిన్నంగా వ్యవహరించింది పాలకమండలి తీరుతో డీసీఎంఎస్ అప్పుల ఊబిలోకి వెళ్లిపోయింది. పాలక మండలి సభ్యులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, విలాసవంతమైన జీవితం గడపడం కోసం రూ.13 కోట్లకు పైగా వెచ్చించి సినిమా వ్యాపారం చేశారు. లాభం వచ్చినా కూడా నష్టాలొచ్చాయని చెప్పి చివరకు అప్పు చూపించారు. ఈ నిర్వాకానికి కారణం గతంలో డీసీఎంఎస్ చైర్మన్‌గా ఉన్న చిడిపోతు సుబ్బారావు. ఈయన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుకు సమీప బంధువు. అతని స్వార్థానికి డీసీఎంఎస్ నిలువునా బలైపోయింది. ఈ తతంగమంతా జిల్లా సహకార శాఖ అధికారులకు తెలిసినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే అధికారులను కూడా వారి విధులు వారు నిర్వర్తించకుండా టీడీపీ నేతలు పెత్తనం చేశారు. -
పీడీసీసీబీ చైర్మన్ ఎన్నికకు మినిస్టర్ స్టే..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (పీడీసీసీబీ) చైర్మన్ ఎంపిక వ్యవహారంలో ఇరుకునపడ్డ అధికార పార్టీ దాన్నుంచి తప్పించుకునేందుకు సరికొత్త వ్యూహానికి తెరలేపింది. తొలుత పాలకవర్గాన్ని రద్దు చేయించి ప్రత్యేకాధికారిని నియమించాలనుకున్న అధికార పార్టీ నేతలు ఈ మేరకు సహకార శాఖ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు సహకార శాఖ రిజిస్ట్రార్ (ఆర్సీఎస్) మురళీ ససేమిరా అనడంతో అధికార పార్టీ నేతలు వ్యూహం మార్చారు. శాంతిభద్రతల సాకు చూపి మినిస్టర్ స్టే ద్వారా ఈ నెల 5న జరిగే చైర్మన్ ఎన్నికను అడ్డుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా శనివారం సమావేశమైన మంత్రులు శిద్దా రాఘవరావు, పి.నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌లు మినిస్టర్ స్టే వ్యవహారంపై చర్చించినట్లు తెలుస్తోంది. చైర్మన్ ఎన్నిక తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఇదే మార్గాన్ని అనుసరించాలని వారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఆర్డీఓలతో చర్చించిన నేతలు శాంతిభద్రతల సాకు చూపి ఎన్నికను నిలిపివేయడం మినహా వేరే దారి లేదని భావించినట్లు తెలుస్తోంది. హుటాహుటిన శాంతిభద్రతల సమస్యపై నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్, ఎస్పీలతో పాటు ఆర్డీఓను కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఆర్డీఓ ద్వారా శనివారం సాయంత్రానికే సహకార శాఖకు నివేదిక పంపినట్లు సమాచారం. ఈ నెల 5న జరిగే చైర్మన్ ఎన్నికకు శాంతిభద్రతల సమస్య ఉందని పలువురు నేతలు పోటీ పడుతున్నందున గొడవ జరిగే అవకాశం ఉందని దీంతో ఎన్నిక జరగకుండా స్టే ఇవ్వాలని నివేదికలో కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం లేదా సోమవారం నాటికి పీడీసీసీబీ చైర్మన్ ఎన్నిక జరగకుండా సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ద్వారా స్టే ఇప్పించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం. చైర్మన్ గిరీ కోసం మూడు గ్రూపుల పట్టు.. పాత చైర్మన్ ఈదర మోహన్ రాజీనామాతో కొత్త చైర్మన్ ఎంపికను పార్టీ అధిష్టానం మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నెల 5న చైర్మన్ ఎంపికకు సంబంధించి సహకార శాఖ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ఈదర మోహన్‌ను పదవి నుంచి దించడంలో కీలక భూమిక పోషించిన మస్తానయ్య చైర్మన్ పదవిని తనకే ఇవ్వాలంటూ పట్టుపడుతున్నారు. మెజార్టీ డైరెక్టర్ల మద్ధతు ఆయనకే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తొలుత ఎమ్మెల్యే జనార్దన్ సైతం మస్తానయ్యకే మద్ధతు పలికారు. మరోవైపు తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్న కండె శ్రీనివాసులు సైతం తనకే చైర్మన్ పదవి కావాలంటూ పట్టుపడుతున్నారు. ఇదిలా ఉండగా జనార్దన్ చిన్నాన్న దామచర్ల పూర్ణచంద్రరావు చైర్మన్ పదవి కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కుమారుడు దామచర్ల సత్య సైతం తండ్రికే చైర్మన్ పదవి ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. దీంతో చైర్మన్ ఎంపిక మంత్రులతో పాటు జనార్దన్‌కు తలనొప్పిగా పరిణమించింది. ఏ ఒక్కరికి చైర్మన్‌గిరి ఇచ్చినా మిగిలిన వారు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా చైర్మన్ ఎంపికను నిలిపివేయాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. తొలుత పాలకవర్గాన్ని రద్దు చేసి ప్రత్యేకాధికారి ద్వారా పీడీసీసీబీని నడిపించాలని నిర్ణయించినా ఆర్సీఎస్ వ్యతిరేకించటం ఇది వీలు కాలేదు. ఇప్పుడు శాంతిభద్రతల సాకు చూపి మినిస్టర్ స్టే ద్వారా చైర్మన్ ఎంపికను నిలిపివేయాలని అధికార పార్టీ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పీడీసీసీబీ అధికార పార్టీకి అనుకూలంగా ఉంది. దాదాపు డైరెక్టర్లందరూ అధికార పార్టీ మద్ధతుదారులుగానే ఉన్నారు. వారు గొడవ చేసే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతిభద్రతల సాకు చూపి ఎన్నికలను నిలిపివేయాలనుకోవడంపై అధికార పార్టీలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.. మెజార్టీ డైరెక్టర్లు, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు భిన్నంగా కొత్త చైర్మన్ ఎన్నికను నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 19 మందితో జరిగే ఎన్నికకే రక్షణ కల్పించలేమని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టిస్తున్నారని, ఇది కేవలం కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వేసిన ఎత్తుగడ అని ఆరోపిస్తూ శనివారం రాత్రి డైరక్టర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నిక వాయిదా వేస్తే ప్రజాక్షేత్రంలో పోరాటానికి తాము సిద్ధమని ప్రకటించారు. -
సై అంటే సై
కొద్దిరోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇరువురు నేతలు కుర్చీలు తీసుకొని పరస్పరం దాడికి తెగబడ్డారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ బాహాబాహీకి సిద్ధపడ్డారు. రాయలేని పదజాలంతో బండబూతులు తిట్టుకున్నారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ గొడవకు సాక్షాత్తూ రాజధాని అమరావతిలోని సచివాలయం వేదికైంది. మంత్రులు పరిటాల సునీత, పి.నారాయణ, శిద్దా రాఘవరావుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షీభూతులుగా నిలిచారు. జిల్లాలో అధికార పార్టీ గొడవలు పతాక స్థాయికి చేరాయనడానికి ఇదే ఉదాహరణ. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అమరావతిలోని సచివాలయంలో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మంత్రి శిద్దా రాఘవరావు ఛాంబర్లో ప్రకాశం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి శిద్దాతో పాటు ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జి మంత్రులు నారాయణ, పరిటాల సునీతలు ఈ సమావేశానికి హాజరుకాగా టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీలు కరణం బలరాం, పోతుల సునీత, ఎమ్మెల్యేలు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, డోలా బాలవీరాంజనేయస్వామి, పోతుల రామారా>వు, కదిరి బాబూరావు, నియోజకవర్గ ఇన్చార్జులు కందుల నారాయణరెడ్డి, దివి శివరాం తదితరులు హాజరయ్యారు. జిల్లాలో అధికార పార్టీకి తలనొప్పిగా పరిణమించిన పీడీసీసీబీ, ఒంగోలు డెయిరీతో పాటు పలు సమస్యలను చర్చించేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో జిల్లాలో మార్కెట్ కమిటీల నియామకాలను పూర్తి చేయటం లేదని మార్టూరు మార్కెట్ కమిటీకి సంబంధించి పేర్లు ఇచ్చి చాలా కాలమైన ఎందుకు భర్తీ చేయలేదంటూ తొలుత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమావేశంలో లేవనెత్తారు. దీంతో ఒక్కసారిగా స్పందించిన ఎమ్మెల్సీ కరణం బలరాం.. ‘ఏం ఫైనల్ అయితది... పార్టీలోకి కొత్తగా వచ్చినోళ్లు కామ్‌గా కూర్చుంటే కదా..’ అన్ని కెలుకుతున్నారు. ఏ పని కానివ్వటం లేదు. పార్టీని నమ్ముకొని 30 ఏళ్లుగా ఉన్న వాళ్లేమో నష్టపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతిగా ఎమ్మెల్యే రవికుమార్ సైతం తానేమీ అడ్డుకోవడం లేదంటూ ఎదురుదాడికి దిగారు. గొట్టిపాటి ఒక్కసారిగా ఆగ్రహంగా లేచి బలరాం మాటలకు అడ్డుతగిలారు. ఎవరు అడ్డుకుంటున్నారంటూ ప్రతి సమాధానమిచ్చారు. శింగరకొండ దేవస్థానం కమిటీని మొదలుకొని అద్దంకి, సంతమాగులూరు మార్కెట్ కమిటీ పదవులు భర్తీ కాకుండా అడ్డుకుంటున్నావంటూ కరణం బలరాం రవికుమార్‌పై మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. పింఛన్లు, పక్కా గృహాలు సైతం పాత కార్యకర్తలకు అందకుండా చేస్తున్నావంటూ విరుచుకుపడ్డారు. రవికుమార్ కూడా అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఇరువురు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటు ఎమ్మెల్సీ కరణం.. కుర్చీ తీసుకొని గొట్టిపాటి వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. గొట్టిపాటి కూడా బలరాంపై కుర్చీ ఎత్తారు. నువ్వెంతంటే... నువ్వెంత అంటూ సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకున్నారు. పత్రికల్లో రాయలేని పదజాలంతో బూతులు తిట్టుకున్నారు. ఇరువురు కుర్చీలతో కొట్టుకునే ప్రయత్నానికి దిగడంతో బెంబేలెత్తిన మంత్రులు శిద్దా, నారాయణ, పరిటాల సునీతలతో పాటు ఎమ్మెల్యేలు మధ్యన దూరి ఇరువురిని పక్కకు నెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపు దూరంగా తీసుకెళ్లి శాంతింపజేశారు. 15 నిమిషాల తర్వాత తిరిగి సభను ప్రారంభించారు. పీడీసీసీబీ పంచాయితీ సీఎం వద్దకు... పీడీసీసీబీ చైర్మన్ ఎంపిక విషయం చర్చకు వచ్చింది. అందరూ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి నివేదించామని, ఇక ముఖ్యమంత్రే చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉందని మంత్రులు అభ్యర్థులకు చెప్పారు. అనంతరం ఒంగోలు డెయిరీపై వాడివేడిగా చర్చ సాగింది. ఒంగోలు డెయిరీని మూడేళ్లల్లోనే పాలకవర్గం కోట్లాది రూపాయలు అప్పుల్లోకి నెట్టిందని అసలు అంత అప్పు ఎందుకయిందో చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మంత్రుల ముందు వాదించారు. ఏ గ్రామానికి వెళ్లినా పాల డబ్బులివ్వలేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. వాస్తవాలు ముఖ్యమంత్రికి చెప్పకుండా కొందరు నేతలు పాలకవర్గానికి మద్ధతుగా నిలవడం సరికాదని శివరాం విమర్శించారు. ఇప్పటికైనా సీఎంకు వాస్తవాలు చెప్పాలన్నారు. డెయిరీ డబ్బులను అధికార పార్టీ కోసమే ఖర్చు చేశానంటూ పాలకవర్గం బయట ప్రచారం చేస్తుందని, ఈ విషయం బయట పత్రికల్లో సైతం వస్తుందని కరణం మంత్రుల దృష్టికి తెచ్చారు. అసలు పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టారు.. డెయిరీ అప్పెంత అన్న విషయం తేల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలను సీఎం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. ఆ తర్వాత 7.30 గంటలకు సమావేశం ముగించుకొని నేతలు వెళ్లిపోయారు. -
రాజీనా.. రాజీనామానా..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (పీడీసీసీబీ) రగడ పతాకస్థాయికి చేరింది. ప్రకాశం కేంద్ర సహకార బ్యాంకులో రూ.25 కోట్ల మేర కుంభకోణం జరిగిందని, బోర్డు సభ్యులను వంచించి చైర్మన్, సీఈఓ కొందరు అక్రమాలకు పాల్పడ్డారని 14 మంది పీడీసీసీబీ డైరెక్టర్లు ఆరోపించారు. ఈ మేరకు సహకార శాఖ మంత్రి, కమీషనర్, జిల్లా ఎస్పీతో పాటు, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. చైర్మన్ ఈదరను పదవీచుతుడ్ని చేయాలని మెజార్టీ డైరెక్టర్లు పట్టుపట్టారు. ఆయనపై బహిరంగ విమర్శలకు దిగారు. అధికార టీడీపీ మద్ధతుదారుగా ఉన్న డీసీసీబీ చైర్మన్‌ను దింపేందుకు సొంత పార్టీకి చెందిన మెజార్టీ డైరెక్టర్లు పట్టుపట్టడం ఆ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో ఈదర మోహన్‌కు సత్సంబంధాల్లేవు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. డీసీసీబీ వ్యవహారాన్ని బుధవారం రాత్రి ఎమ్మెల్యే జనార్దన్‌తో పాటు మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పంచాయితీ తెంచాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో జనార్దన్ శుక్రవారం డీసీసీబీ వివాదంపై విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ ఈదర మోహన్ ఎట్టి పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని గతంలో వైస్ చైర్మన్‌గా ఉన్న మస్తానయ్యతో పాటు 15 మంది డైరెక్టర్లు పట్టుపడుతున్నారు. ఎవరెన్ని చెప్పిన చైర్మన్‌గా ఈదరను అంగీకరించేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. శుక్రవారం దామచర్ల వద్ద జరిగే పంచాయితీలోనూ ఇదే చెబుతామని పలువురు డైరెక్టర్లు సాక్షితో చెప్పారు. ఈదర మోహన్ అధికార పార్టీ మద్ధతుదారుడిగానే కొనసాగుతున్నందున డైరెక్టర్లను ఒప్పించి చైర్మన్‌గా ఈదరను కొనసాగించేలా రాజీ ప్రయత్నాలు జరుగుతాయన్న ప్రచారమూ ఉంది. ఈదరకు పదవి గండం..? డైరెక్టర్లలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచరులున్నారు. అయితే 20 మంది డైరెక్టర్లలో దాదాపు 17 మంది డైరెక్టర్లు ఈదరను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆయన్ను పదవి నుంచి దించేందుకు పట్టుపడుతున్నారు. టీడీపీ అధిష్టానం ఈదరనే చైర్మన్‌గా కొనసాగించే పక్షంలో ఎమ్మెల్యేల ద్వారా డైరెక్టర్లపై ఒత్తిడి పెంచి సమస్యను సర్దుమణిగేలా చేసే అవకాశం ఉంది. అలా కాకుండా డైరెక్టర్ల అభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తే పదవి నుంచి తప్పుకోవాలని సూచించే అవకాశం ఉంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో ఈదర మోహన్‌కు విభేదాలున్న నేపథ్యంలో చివరకు ఏం జరుగుతున్నది ప్రశ్నార్థకంగా మారింది. డైరెక్టర్ల అభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చే పక్షంలో ఈదర పదవి నుంచి తప్పుకోవడం మినహా గత్యంతరం లేదు. అదే జరిగితే శుక్రవారం సాయంత్రానికి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది. -
ప్రకాశంలో తమ్ముళ్ల కుమ్ములాట..
అన్ని పార్టీల నేతలను టీడీపీ గొడుగు కిందకు చేర్చాలన్న చంద్రబాబు ప్రయత్నం వికటించింది. అందరూ కలవడం సంగతి దేవుడెరుగు. పాత, కొత్త నేతల మధ్య వైరం మరింత పెంచింది. తమ్ముళ్ల మధ్య మాటల యుద్ధం ముగిసి, తన్నులాట షురూ అయింది. గిద్దలూరులో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు పరస్పరం భౌతిక దాడులకు తెగబడగా అవిశ్వాసంపై స్టే ఇచ్చినప్పటికీ పీడీసీసీబీ చైర్మన్ ఈదర శుక్రవారం ఏకంగా బ్యాంకు కార్యాలయంలోనే వైఎస్ చైర్మన్‌పై మాక్ అవిశ్వాసం నిర్వహించి పచ్చ నేతలకు ఝలక్ ఇచ్చారు. ఒంగోలు: గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. కొత్తగా అధికార పార్టీలో చేరిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, పాత నేత అన్నా రాంబాబు వర్గాలు కుమ్ములాటకు దిగాయి. గిద్దలూరు మండలం వెల్లుపల్లికి చెందిన జన్మభూమి కమిటీ సభ్యుడు గర్రె శ్రీనాథ్‌పై అశోక్‌రెడ్డి వర్గీయులు కంకర వెంకటరెడ్డి దాడి దిగారు. రాయి తీసుకొని శ్రీనాథ్ తలపై మోదాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అశోక్‌రెడ్డి అధికార పార్టీలో చేరడంతో ఈ ఘర్షణ తలెత్తింది. ఈ నెల 1న ముత్తుముల ముఖ్యమంత్రి సమక్షంలో విజయవాడలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి వెల్లుపల్లికి చెందిన తన అనుచరులను విజయవాడకు తరలించారు. అయితే 1వ తేదీన గ్రామస్తులు ఉపాధి పనులకు రాకపోవడంతో ఫీల్డు అసిస్టెంట్‌గా ఉన్న శ్రీనాథ్ భార్య రోహిణి అందరికీ హాజరు వేయలేదు. దీంతో ఆగ్రహించిన వెంకటరెడ్డి తనకు బాకీ ఉన్న డబ్బులను చెల్లించాలంటూ శ్రీనాథ్‌తో గొడవ పెట్టుకొని కక్ష పూరితంగానే దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ నిమిషంలో ఏ గ్రామంలో గొడవ జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ముత్తుములపై ఫిర్యాదుల వెల్లువ.. ఇప్పటికే కొత్తగా పార్టీలో చేరిన అశోక్‌రెడ్డి తమ వర్గీయులపై తప్పుడు కేసులు పెట్టించడమే కాక, ఆధిపత్యం చెలాయిస్తూ 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని అన్నా బహిరంగ విమర్శలకు దిగారు. జన్మభూమి కమిటీ సభ్యులను, ఫీల్డు అసిస్టెంట్లను తొలగించమని ముత్తుముల అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, నీరు–చెట్టు పనులు సైతం తన వర్గీయులకు ఇవ్వాలని ఆయన అధికారులను బెదిరిస్తున్నారని అన్నా ఇప్పటికే మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు అధికార పార్టీ జిల్లా, రాష్ట్ర నేతలు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. అన్నా వర్గీయుల దూకుడును తగ్గించేందుకు ముత్తుముల వర్గీయులు ఏకంగా భౌతికదాడులకు దిగినట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు అన్యాయం జరిగితే తాను పట్టుకొని కట్టె పట్టుకొని రోడ్డెక్కుతానంటూ అన్నా ప్రకటించిన నేపథ్యంలో పచ్చ నేతల మధ్య వైరం మరింత ముదిరింది. ఈ రగడ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చైర్మన్ ఈదర మాక్ అవిశ్వాసం. ప్రకాశం కేంద్ర సహకార బ్యాంకు రగడ అధికార పార్టీలో మరింత చిచ్చు రేపుతోంది. మంత్రితో పాటు అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకొని 10న జరగాల్సిన వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని మినిస్టర్ స్టే ద్వారా నిలుపుదల చేయించడంతో వివాదం పతాకస్థాయికి చేరింది. మంత్రితో పాటు ఒంగోలు ఎమ్మెల్యేతో పాటు ఏలూరి సాంబశివరావు, కరణం బలరాం తదితర అధికార పార్టీ నేతలు వైస్ చైర్మన్ మస్తానయ్యకు మద్ధతు పలకడాన్ని చైర్మన్ ఈదర మోహన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అధికార పార్టీ నేతలపై బహిరంగ విమర్శలకు దిగారు. మంత్రి స్టే ఇప్పించటం అనైతికమంటూ సొంత పార్టీ నేతలపై విమర్శన అస్త్రాలు సంధించారు. మస్తానయ్య కావాలో... తాము కావాలో... తేల్చుకోమంటూ అధికార పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం స్టే ఇవ్వడం అనైతికమంటూ బహిరంగ విమర్శలు చేయడమేకాక హైకోర్టులోనే తేల్చుకుంటామంటూ హెచ్చరించారు. చైర్మన్ ఈదర మోహన్‌బాబు అధికార పార్టీ నేతలపై బహిరంగ విమర్శలకు దిగటం శుక్రవారం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతటితో వదలక చైర్మన్ వినూత్నరీతిలో పచ్చ నేతలకు ఝలక్ ఇచ్చారు. బ్యాంకు కార్యాలయంలోనే మాక్ అవిశ్వాసాన్ని నిర్వహించారు. వైస్ చైర్మన్‌కు వ్యతిరేకంగా ఉన్న 17 మంది సభ్యులను సమావేశపరిచి ఓటింగ్ నిర్వహించారు. మస్తానయ్య ఓటమి చెందటంతో డైరెక్టర్ గంగవరపు మీరమ్మను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. న్యాయబద్ధంగా అవిశ్వాసం నిర్వహించే అవకాశం లేకుండా చేయడంతోనే ధర్మబద్ధంగా అవిశ్వాసాన్ని నిర్వహించినట్లు ఈదర మోహన్ ప్రకటించారు. అవిశ్వాసాన్ని అడ్డుకున్న మంత్రి, దేశం నాయకులపై అదే పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ వినూత్నరీతిలో నిరసన తెలపడం చర్చనీయాంశంగా మారింది.