కొద్దిరోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇరువురు నేతలు కుర్చీలు తీసుకొని పరస్పరం దాడికి తెగబడ్డారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ బాహాబాహీకి సిద్ధపడ్డారు. రాయలేని పదజాలంతో బండబూతులు తిట్టుకున్నారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ గొడవకు సాక్షాత్తూ రాజధాని అమరావతిలోని సచివాలయం వేదికైంది. మంత్రులు పరిటాల సునీత, పి.నారాయణ, శిద్దా రాఘవరావుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షీభూతులుగా నిలిచారు. జిల్లాలో అధికార పార్టీ గొడవలు పతాక స్థాయికి చేరాయనడానికి ఇదే ఉదాహరణ.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అమరావతిలోని సచివాలయంలో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మంత్రి శిద్దా రాఘవరావు ఛాంబర్‌లో ప్రకాశం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి శిద్దాతో పాటు ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జి మంత్రులు నారాయణ, పరిటాల సునీతలు ఈ సమావేశానికి హాజరుకాగా టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీలు కరణం బలరాం, పోతుల సునీత, ఎమ్మెల్యేలు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, డోలా బాలవీరాంజనేయస్వామి, పోతుల రామారా>వు, కదిరి బాబూరావు, నియోజకవర్గ ఇన్‌చార్జులు కందుల నారాయణరెడ్డి, దివి శివరాం తదితరులు హాజరయ్యారు.
జిల్లాలో అధికార పార్టీకి తలనొప్పిగా పరిణమించిన పీడీసీసీబీ, ఒంగోలు డెయిరీతో పాటు పలు సమస్యలను చర్చించేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో జిల్లాలో మార్కెట్ కమిటీల నియామకాలను పూర్తి చేయటం లేదని మార్టూరు మార్కెట్ కమిటీకి సంబంధించి పేర్లు ఇచ్చి చాలా కాలమైన ఎందుకు భర్తీ చేయలేదంటూ తొలుత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమావేశంలో లేవనెత్తారు. దీంతో ఒక్కసారిగా స్పందించిన ఎమ్మెల్సీ కరణం బలరాం.. ‘ఏం ఫైనల్ అయితది... పార్టీలోకి కొత్తగా వచ్చినోళ్లు కామ్‌గా కూర్చుంటే కదా..’ అన్ని కెలుకుతున్నారు. ఏ పని కానివ్వటం లేదు. పార్టీని నమ్ముకొని 30 ఏళ్లుగా ఉన్న వాళ్లేమో నష్టపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతిగా ఎమ్మెల్యే రవికుమార్ సైతం తానేమీ అడ్డుకోవడం లేదంటూ ఎదురుదాడికి దిగారు. గొట్టిపాటి ఒక్కసారిగా ఆగ్రహంగా లేచి బలరాం మాటలకు అడ్డుతగిలారు. ఎవరు అడ్డుకుంటున్నారంటూ ప్రతి సమాధానమిచ్చారు.
శింగరకొండ దేవస్థానం కమిటీని మొదలుకొని అద్దంకి, సంతమాగులూరు మార్కెట్ కమిటీ పదవులు భర్తీ కాకుండా అడ్డుకుంటున్నావంటూ కరణం బలరాం రవికుమార్‌పై మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. పింఛన్లు, పక్కా గృహాలు సైతం పాత కార్యకర్తలకు అందకుండా చేస్తున్నావంటూ విరుచుకుపడ్డారు. రవికుమార్ కూడా అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఇరువురు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటు ఎమ్మెల్సీ కరణం.. కుర్చీ తీసుకొని గొట్టిపాటి వైపు వెళ్లే ప్రయత్నం చేశారు.
గొట్టిపాటి కూడా బలరాంపై కుర్చీ ఎత్తారు. నువ్వెంతంటే... నువ్వెంత అంటూ సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకున్నారు. పత్రికల్లో రాయలేని పదజాలంతో బూతులు తిట్టుకున్నారు. ఇరువురు కుర్చీలతో కొట్టుకునే ప్రయత్నానికి దిగడంతో బెంబేలెత్తిన మంత్రులు శిద్దా, నారాయణ, పరిటాల సునీతలతో పాటు ఎమ్మెల్యేలు మధ్యన దూరి ఇరువురిని పక్కకు నెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపు దూరంగా తీసుకెళ్లి శాంతింపజేశారు. 15 నిమిషాల తర్వాత తిరిగి సభను ప్రారంభించారు.
పీడీసీసీబీ పంచాయితీ సీఎం వద్దకు...
పీడీసీసీబీ చైర్మన్ ఎంపిక విషయం చర్చకు వచ్చింది. అందరూ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి నివేదించామని, ఇక ముఖ్యమంత్రే చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉందని మంత్రులు అభ్యర్థులకు చెప్పారు. అనంతరం ఒంగోలు డెయిరీపై వాడివేడిగా చర్చ సాగింది. ఒంగోలు డెయిరీని మూడేళ్లల్లోనే పాలకవర్గం కోట్లాది రూపాయలు అప్పుల్లోకి నెట్టిందని అసలు అంత అప్పు ఎందుకయిందో చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మంత్రుల ముందు వాదించారు. ఏ గ్రామానికి వెళ్లినా పాల డబ్బులివ్వలేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు.
వాస్తవాలు ముఖ్యమంత్రికి చెప్పకుండా కొందరు నేతలు పాలకవర్గానికి మద్ధతుగా నిలవడం సరికాదని శివరాం విమర్శించారు. ఇప్పటికైనా సీఎంకు వాస్తవాలు చెప్పాలన్నారు. డెయిరీ డబ్బులను అధికార పార్టీ కోసమే ఖర్చు చేశానంటూ పాలకవర్గం బయట ప్రచారం చేస్తుందని, ఈ విషయం బయట పత్రికల్లో సైతం వస్తుందని కరణం మంత్రుల దృష్టికి తెచ్చారు. అసలు పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టారు.. డెయిరీ అప్పెంత అన్న విషయం తేల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలను సీఎం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. ఆ తర్వాత 7.30 గంటలకు సమావేశం ముగించుకొని నేతలు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment