బాబుల బంతాట! | clashes between tdp leaders in ongole district | Sakshi
Sakshi News home page

బాబుల బంతాట!

Published Sun, Jul 3 2016 10:29 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

clashes between tdp leaders in ongole district

  • జిల్లా నేతలతో అధిష్టానం గేమ్ షో   
  • ఫిరాయింపు నేతల వైపు చినబాబు లోకేష్
  • పాత నేతలకు మద్దతుగా సీఎం చంద్రబాబు  
  • ఒక రోజు బదిలీ.. మరుసటి రోజుకు రద్దు
  • ఎటూ తేల్చక ఆటాడుకుంటున్న అధిష్టానం  
  • సీఐల బదిలీల్లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
  • పైచేయి ఎవరిదనే అంశంపై పార్టీ కేడర్‌లో ఉత్కంఠ..
  • ఆధిపత్యం కోసం పోరాడుతున్న టీడీపీ జిల్లా నేతలతో బాబూ కొడుకులు బంతాట ఆడుతున్నారా..? ఒక వర్గానికి చంద్రబాబు, మరో వర్గానికి చినబాబు మద్దతుగా నిలిచి నాటకం రక్తికట్టిస్తున్నారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరువురు కర్ర విరగ కూడదు.. పాము చావకూడదు అన్నట్లు వ్యవహరిస్తుండటంతో జిల్లాకు చెందిన ఇరువర్గాల నేతలు లోలోన రగిలిపోతున్నారు. వీరి ఆధిపత్య పోరులో చివరకు ఏ వర్గం పైచేయి సాధిస్తుందో తెలియని పరిస్థితి ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
     
    ఒంగోలు : జిల్లాలోని అధికార పార్టీ పాత నేతలు, ఇటీవల అధికార పార్టీలో చేరిన కొత్త ఎమ్మెల్యేలతో అధిష్టానం ఆడుకుంటోంది. గొట్టిపాటి నేతృత్వంలోని ఫిరాయింపు నేతలతో కూడిన త్రిసభ్య కమిటీ(గొట్టిపాటి, ముత్తుముల, పోతుల)కి చినబాబు లోకేష్ మద్ధతు పలుకుతుండగా, కరణం నేతృత్వంలోని పాత నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలు అందిస్తున్నట్లు సమాచారం.

    దీంతో ఇరువర్గాల నేతలు పైచేయి సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక వర్గం అధికారులను బదిలీ చేయిస్తే.. మరొక వర్గం దాన్ని అడ్డుకుంటోంది. ఏ వర్గాన్ని నిరుత్సాహపడనీయకుండా అదే సమయంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించకుండా ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ అటు చంద్రబాబు, ఇటు చినబాబు బంతాట ఆడుకుంటున్నారు.
     
    ఎవరి ధీమా వారిదే..
    అద్దంకి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంతో పాటు ఆయా నియోజకవర్గాల టీడీపీ కేడర్ వ్యతిరేకించినా... చంద్రబాబు, చినబాబు  లు ఆయా నియోజకవర్గాలకు చెందిన  ప్రస్తుత ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావులను పార్టీలో చేర్చుకున్నారు.

    రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఓడించటమే లక్ష్యంగా వారిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు ముఖ్యమంత్రి పాత నేతలకు చెప్పారు. పైగా ఎమ్మెల్యేలకు భారీ ప్యాకేజీలిచ్చి పార్టీలో చేర్చుకున్నారన్న ప్రచారంతో వారిని అంత వరకే పరిమితం చేస్తారని పాత నేతలు భావించారు. చంద్రబాబు స్వభావం తెలిసిన వారు కావడంతో ఎమ్మెల్యేలను రెంటికీ చెడ్డ రేవడిలా చేసేందుకేనన్న ధీమాతో ఉన్నారు. కొత్తగా పచ్చ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలు అధికారం కోసం తహతహలాడారు. దశాబ్దాలుగా జెండాలు మోసిన పాత నేతలను పక్కకు నెట్టి ఆధిపత్యం చలాయించేందుకు పావులు కదిపారు.
     
     ఫిర్యాదుల వెనుక జనార్దన్ వ్యూహం..
     గొట్టిపాటి సీఎంకు ఫిర్యాదు చేయడం వెనుక కరణంను వ్యతిరేకిస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యూహం ఉందన్న ప్రచారం ఉంది. గొట్టిపాటి సీఎంను కలిసిన నేపథ్యంలో రమణమూర్తి బదిలీ ఆగిపోయిందని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. మరుసటి రోజే రమణమూర్తి స్థానంలో కొత్త ఎస్‌ఈగా నెల్లూరు నుండి బదిలీ అయిన రెడ్డయ్య బాధ్యతలు స్వీకరించారు. దీంతో గొట్టిపాటి వర్గానికి భంగపాటు తప్పలేదు. దీన్ని బట్టి చూస్తే మరోమారు కరణంకే అధిష్టానం మద్దతు పలికినట్లు అయింది.
     
     ఇదిలా ఉండగా గొట్టిపాటి వర్గం అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌తో పాటు గిద్దలూరు, కందుకూరు, చీరాల, ఒంగోలు, కనిగిరి సీఐలను అటాచ్‌మెంట్ ద్వారా బదిలీ చేయించుకున్నారు. లోకేష్ ఆదేశాల మేరకే ఈ బదిలీలు జరిగినట్లు ప్రచారం జరిగింది. మరుసటి రోజుకే ఆరుగురు సీఐల బదిలీలు నిలిచిపోయాయి. సీనియర్ నేత కరణం ఏకంగా ముఖ్యమంత్రి, డీజీపీలతోనే మాట్లాడి బదిలీలు నిలిపివేయించారన్న ప్రచారం జరిగింది. దీంతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 2,500 చొప్పున పింఛన్లు మంజూరు చేయాలంటూ లోకేష్‌కు నెల క్రితమే జాబితా ఇచ్చినట్లు తెలుస్తోంది. కరణం ఆ జాబితాను కూడా నిలిపివేయాలంటూ ముఖ్యమంత్రి ద్వారా లోకేష్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో పింఛన్ల జాబితా సైతం రాత్రికి రాత్రే నిలిచిపోయింది.
     
     
     సత్తా చాటేందుకు ప్రయత్నాలు..
     వచ్చి రావడంతోనే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేయించి సత్తా చాటే ప్రయత్నం చేశారు. దీన్ని సహించని మొండిఘటం కరణం సాయంత్రానికే సీఐ బదిలీని నిలిపివేయించి పట్టు నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్‌ఈ రమణమూర్తిని కరణం బదిలీ చేయించారన్న ప్రచారం జరిగింది. దీంతో కరణం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు గొట్టిపాటి రంగంలోకి దిగారు. ఈ సారి తానొక్కడే కాకుండా త్రిసభ్య కమిటీ సభ్యులుగా ముద్ర వేసుకున్న అశోక్‌రెడ్డి, పోతుల రామారావులతో కలిసి ఎస్‌ఈ బదిలీని నిలపాలంటూ ఏకంగా ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కరణంపై పలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. గొట్టిపాటి వాదనకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు.
     
     నొప్పించక తానొవ్వక..
     గొట్టిపాటి నేతృత్వంలోని ఫిరాయింపు ఎమ్మెల్యేలు లోకేష్ ద్వారా తమ పనులు చక్కబెట్టుకునే ప్రయత్నానికి దిగుతుంటే... కరణం నేతృత్వంలోని పాత నేతల వర్గం ఏకంగా ముఖ్యమంత్రిపైనే ఒత్తిడి తెస్తూ దాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. కొత్త ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంతో లోకేష్ కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు తానిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఆయన కొత్త ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నట్లు పైకి కనబడుతుంది. అదే సమయంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు పాత నేతలను సైతం నొప్పించక ఎప్పటికప్పుడు కొత్త ఎమ్మెల్యేలకు అడ్డుకట్ట వేస్తున్నారు. మొత్తంగా కొత్త నేతలకు మద్ధతు పలుకుతున్నట్లు లోకేష్ నటిస్తుండగా, పాత నేతలకు మద్ధతు పలుకుతూ బాబు నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement