అద్దంకి రక్తచరిత్రలో కొత్త కోణం
♦ వేమవరం జంట హత్యలకు ముందస్తు ప్రణాళిక
♦ అకస్మాత్తుగా స్పీడ్ బ్రేకర్ కూడా ఏర్పాటు
♦ ఆపై కళ్లలో కారం కొట్టిన మహిళ..అనంతరం దాడి
♦ హతులను ముందుగా వెంబడించి సమాచారం అందించిన ఓ వ్యక్తి
♦ హత్యకు వాడిన కత్తులు, కర్రలు, కారం డబ్బాలు స్వాధీనం
♦ కారుల్లో పరారైన 24 కుటుంబాలకు చెందిన నిందితులు
బల్లికురవ: ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అద్దంకి నియోజకవర్గంలో మళ్లీ ఫ్యాక్షన్ పంజా విసిరిందా? జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యలు ఈ సందేహానికి బలం చేకూర్చినట్లవుతోంది. ఇదిలా ఉంటే వేమవరంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ హత్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజుల ముందుగానే ప్లాన్ వేసి, ప్రత్యర్థులను అడ్డుకొనేందుకు వీలుగా స్పీడ్ బ్రేకరు వేయడంతోపాటు, పెళ్లికి వెళ్లిన వారిని ఒక వ్యక్తి వెంబడిస్తూ వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిందితులకు చేరవేసినట్లు తెలిసింది. పెళ్లి బృందం స్పీడు బ్రేకరు వద్దకు రాగానే ఒక మహిళ వారి కళ్లలో కారం కొట్టగా, మిగిలిన వారు కర్రలు కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది.
1989 నాటి దాడిలోనే పెద్ద అంజయ్యకు కత్తిపోట్లు..
పత్తిపాటి సాంబయ్య అనే వ్యక్తిని గొట్టిపాటి వర్గీయులు (గొట్టిపాటి హనుమంతరావు)1989లో హతమార్చారు. ఇదే దాడిలో పెద అంజయ్య కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడి 20 రోజులు గుంటూరు వైద్యశాలలో చికత్స పొందాడు. నాడు మరణించిన వ్యక్తి కూడా బలరాం వర్గీయుడే కావడం గమనార్హం.
24 కుటుంబాల్లో ఒక్కరూ లేరు..
నిందితులుగా భావిస్తున్న 24 మంది కుటుంబాల్లోని వారు ఒక్కరు కూడా ప్రస్తుతం గృహాల్లో లేరు. వీరంతా రెండు మూడు కార్లలో పరారయ్యారు. వీరిలో 20 కుటుంబాల వారు గొట్టిపాటి ఇంటి పేరిట వారని తెలుస్తోంది. గతంలో వేరే రాష్ట్రాలకు బతకడానికి వెళ్లిన కొంతమంది మళ్లీ గ్రామానికి చేరుకోవడం వల్లే ఇలాంటి సంఘటన జరుగుతున్నాయిన ప్రజలంటున్నారు.
మృతుల కుమారులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
మృతిచెందిన గోరంట్ల పెద అంజయ్యకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు సురేశ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా మరో కుమారుడు అనీల్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు.
మరో మృతుడు యేగినాటి కోటేశ్వరరావుకు భార్య ఉంది. కుమారుడు వెంకటేశ్వర్లు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మృతులది వ్యవసాయ నేపథ్యం.
గ్రామంలో భయాందోళనలు..
హత్యల నేపథ్యంలో గ్రామంలో ఆందోళన నెలకొంది. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.మృతుల ఇళ్ల వద్దకు అధిక సంఖ్యలో జనం చేరకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. గ్రామాన్ని కరణం బలరాం సందర్శించారు. కరణం వర్గానికి చెందిన ఐదు మండలాల నాయకులు కూడా క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లారు.
పోలీసు వలయంలో..
గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మృతులు, క్షతగాత్రుల ఇళ్ల వద్ద 50 మందితో పది పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు మూడు వ్యానుల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. శనివారం సంఘటనా స్థలాన్ని చీరాల డీఎస్పీ ప్రేమ కాజల్, బల్లికురవ డీటీ సింగయ్య పరిశీలించారు. హత్యా స్థలిలో దొరికన కర్రలు, కత్తులు, కారం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల నుంచి వివరాలను సేకరించారు.
ప్రధాన నిందితుల గుర్తింపు.. ఫొటోల విడుదల
- గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్
వేమవరంలో శుక్రవారం జరిగిన జంట హత్యల అనంతరం నియోజకవర్గంలో భారీబందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ వెల్లడించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్ సమావేశమందిరంలో శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. హత్యలు రాజకీయ కోణంలో జరిగాయా.. లేక పాత కక్షల నేపథ్యంలో జరిగాయా అని లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ దాడిలో 17 మందిపై కేసునమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుల ఫొటోలను విడుదల చేశారు. ఒకటో నిందితుడిగా మాలెంపాటి వెంకటేశ్వర్లు, రెండో నిందితుడిగా గొట్టిపాటి మారుతి, మూడో నిందితుడిగా మాలెంపాటి లక్ష్మీనారాయణలతో పాటు మరో 14 మంది నిందితులుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఆరు ప్లటూన్ల ప్రత్యేక పోలీస్ బలగాలతో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్కో మండలానికి ఒక్కో డీఎస్పీ చొప్పున శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గుంటూరు, చిలకలూరిపేట, నర్సరావుపేట ప్రాంతాల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
నిందితులకు ఆశ్రయం కల్పించినవారిపై ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. హత్యలకు సంబంధించి పోలీసుల వద్ద సమాచారం ఉన్నా పట్టించుకోలేదని, మైనింగ్‌కు సంబంధించి ఇరువర్గాల మధ్య ఇటీవల ఘర్షణలు జరుగుతున్న పట్టీపట్టన్నట్లు వ్యవహరించారని వెల్లడించారు. ప్రత్యేకంగా మైనింగ్ విషయంలో అధికార ఎమ్మెల్యేకు సంబంధించి.. హతమారుస్తామని బెదిరింపులు వచ్చాయన్నారు.