ప్రకాశంలో తమ్ముళ్ల కుమ్ములాట..
అన్ని పార్టీల నేతలను టీడీపీ గొడుగు కిందకు చేర్చాలన్న చంద్రబాబు ప్రయత్నం వికటించింది. అందరూ కలవడం సంగతి దేవుడెరుగు. పాత, కొత్త నేతల మధ్య వైరం మరింత పెంచింది. తమ్ముళ్ల మధ్య మాటల యుద్ధం ముగిసి, తన్నులాట షురూ అయింది. గిద్దలూరులో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు పరస్పరం భౌతిక దాడులకు తెగబడగా అవిశ్వాసంపై స్టే ఇచ్చినప్పటికీ పీడీసీసీబీ చైర్మన్ ఈదర శుక్రవారం ఏకంగా బ్యాంకు కార్యాలయంలోనే వైఎస్ చైర్మన్‌పై మాక్ అవిశ్వాసం నిర్వహించి పచ్చ నేతలకు ఝలక్ ఇచ్చారు.
ఒంగోలు: గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. కొత్తగా అధికార పార్టీలో చేరిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, పాత నేత అన్నా రాంబాబు వర్గాలు కుమ్ములాటకు దిగాయి.
గిద్దలూరు మండలం వెల్లుపల్లికి చెందిన జన్మభూమి కమిటీ సభ్యుడు గర్రె శ్రీనాథ్‌పై అశోక్‌రెడ్డి వర్గీయులు కంకర వెంకటరెడ్డి దాడి దిగారు. రాయి తీసుకొని శ్రీనాథ్ తలపై మోదాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అశోక్‌రెడ్డి అధికార పార్టీలో చేరడంతో ఈ ఘర్షణ తలెత్తింది. ఈ నెల 1న ముత్తుముల ముఖ్యమంత్రి సమక్షంలో విజయవాడలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి వెల్లుపల్లికి చెందిన తన అనుచరులను విజయవాడకు తరలించారు. అయితే 1వ తేదీన గ్రామస్తులు ఉపాధి పనులకు రాకపోవడంతో ఫీల్డు అసిస్టెంట్‌గా ఉన్న శ్రీనాథ్ భార్య రోహిణి అందరికీ హాజరు వేయలేదు. దీంతో ఆగ్రహించిన వెంకటరెడ్డి తనకు బాకీ ఉన్న డబ్బులను చెల్లించాలంటూ శ్రీనాథ్‌తో గొడవ పెట్టుకొని కక్ష పూరితంగానే దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ నిమిషంలో ఏ గ్రామంలో గొడవ జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
ముత్తుములపై ఫిర్యాదుల వెల్లువ..
ఇప్పటికే కొత్తగా పార్టీలో చేరిన అశోక్‌రెడ్డి తమ వర్గీయులపై తప్పుడు కేసులు పెట్టించడమే కాక, ఆధిపత్యం చెలాయిస్తూ 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని అన్నా బహిరంగ విమర్శలకు దిగారు. జన్మభూమి కమిటీ సభ్యులను, ఫీల్డు అసిస్టెంట్లను తొలగించమని ముత్తుముల అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, నీరు–చెట్టు పనులు సైతం తన వర్గీయులకు ఇవ్వాలని ఆయన అధికారులను బెదిరిస్తున్నారని అన్నా ఇప్పటికే మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు అధికార పార్టీ జిల్లా, రాష్ట్ర నేతలు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. అన్నా వర్గీయుల దూకుడును తగ్గించేందుకు ముత్తుముల వర్గీయులు ఏకంగా భౌతికదాడులకు దిగినట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు అన్యాయం జరిగితే తాను పట్టుకొని కట్టె పట్టుకొని రోడ్డెక్కుతానంటూ అన్నా ప్రకటించిన నేపథ్యంలో పచ్చ నేతల మధ్య వైరం మరింత ముదిరింది. ఈ రగడ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
చైర్మన్ ఈదర మాక్ అవిశ్వాసం.
ప్రకాశం కేంద్ర సహకార బ్యాంకు రగడ అధికార పార్టీలో మరింత చిచ్చు రేపుతోంది. మంత్రితో పాటు అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకొని 10న జరగాల్సిన వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని మినిస్టర్ స్టే ద్వారా నిలుపుదల చేయించడంతో వివాదం పతాకస్థాయికి చేరింది. మంత్రితో పాటు ఒంగోలు ఎమ్మెల్యేతో పాటు ఏలూరి సాంబశివరావు, కరణం బలరాం తదితర అధికార పార్టీ నేతలు వైస్ చైర్మన్ మస్తానయ్యకు మద్ధతు పలకడాన్ని చైర్మన్ ఈదర మోహన్ జీర్ణించుకోలేకపోతున్నారు.
అధికార పార్టీ నేతలపై బహిరంగ విమర్శలకు దిగారు. మంత్రి స్టే ఇప్పించటం అనైతికమంటూ సొంత పార్టీ నేతలపై విమర్శన అస్త్రాలు సంధించారు. మస్తానయ్య కావాలో... తాము కావాలో... తేల్చుకోమంటూ అధికార పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం స్టే ఇవ్వడం అనైతికమంటూ బహిరంగ విమర్శలు చేయడమేకాక హైకోర్టులోనే తేల్చుకుంటామంటూ హెచ్చరించారు. చైర్మన్ ఈదర మోహన్‌బాబు అధికార పార్టీ నేతలపై బహిరంగ విమర్శలకు దిగటం శుక్రవారం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అంతటితో వదలక చైర్మన్ వినూత్నరీతిలో పచ్చ నేతలకు ఝలక్ ఇచ్చారు. బ్యాంకు కార్యాలయంలోనే మాక్ అవిశ్వాసాన్ని నిర్వహించారు. వైస్ చైర్మన్‌కు వ్యతిరేకంగా ఉన్న 17 మంది సభ్యులను సమావేశపరిచి ఓటింగ్ నిర్వహించారు. మస్తానయ్య ఓటమి చెందటంతో డైరెక్టర్ గంగవరపు మీరమ్మను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. న్యాయబద్ధంగా అవిశ్వాసం నిర్వహించే అవకాశం లేకుండా చేయడంతోనే ధర్మబద్ధంగా అవిశ్వాసాన్ని నిర్వహించినట్లు ఈదర మోహన్ ప్రకటించారు. అవిశ్వాసాన్ని అడ్డుకున్న మంత్రి, దేశం నాయకులపై అదే పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ వినూత్నరీతిలో నిరసన తెలపడం చర్చనీయాంశంగా మారింది.