పీడీసీసీబీని వెంటాడుతున్న మొండి బకాయిలు | Prakasam District Central Cooperative Bank Distressed | Sakshi
Sakshi News home page

పీడీసీసీబీని వెంటాడుతున్న మొండి బకాయిలు

Published Sat, Aug 3 2019 10:52 AM | Last Updated on Sat, Aug 3 2019 10:52 AM

Prakasam District Central Cooperative Bank Distressed - Sakshi

సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (పీడీసీసీబీ)నష్టాల్లోనే కొనసాగుతోంది. పీడీసీసీబీని తమ సొంత జేబు సంస్థగా చేసుకున్న కొందరు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించకపోవటంతో మొండి బకాయిలు పీడలా బ్యాంకును వెంటాడుతున్నాయి. గత మూడు, నాలుగేళ్లుగా బ్యాంకు పాలక మండలి విషయంలో తీవ్ర సంక్షోభంలో ఉండిపోయింది. మూడేళ్ల క్రితం బ్యాంకులో కుదువ పెట్టిన బంగారు ఆభరణాల కుంభకోణం బ్యాంకును ఒక కుదుపు కుదిపింది. కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని బ్యాంకు సిబ్బంది, బ్యాంకు అప్రైజర్లు కొందరు బంగారాన్ని కుదువ పెట్టిన రుణగ్రస్తులు కలిసి బ్యాంకును మోసం చేశారు. అప్పట్లో బ్యాంకు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేశారు. కొందరిని అరెస్ట్‌ చేసి జైలుకు కూడా పంపారు. దీంతో పాటు వరుసగా బ్యాంకు చైర్మన్లు మారటం, కోర్టులకు ఎక్కడం ఇలా బ్యాంకు పాలకమండలి పరిపాలన అస్తవ్యస్తంగా మారిందనటంలో సందేహం లేదు. దీనికి తోడు బ్యాంకును తమ సొంత జేబు సంస్థలా వాడుకున్న కొందరు రూ.కోట్ల కొద్దీ తీసుకున్న రుణాలు తిరిగి వసూలు చేయటంలో బ్యాంకు యాజమాన్యం మెతక వైఖరి అవలంభించిందనే చెల్పాలి. బ్యాంకుకు ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ ఉన్నప్పటికీ గతంలో పనిచేసిన కలెక్టర్లు బ్యాంకు అభివృద్దిపై పూర్తిగా దృష్టి సారించకపోవటం కూడా బ్యాంకు నష్టాల్లోకి వెళ్లటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. 

కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి..
ఇవన్నీ ఒక ఎత్తయితే గత ఐదేళ్లుగా వరుస కరువుతో జిల్లా రైతాంగం అతలాకుతలం అయ్యారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వేయలేకపోవటం, ఒక వేళ పంటలు వేసినా దిగుబడి రాకపోవటం, లేకుంటే వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర రాకపోవటంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతులు తీసుకున్న  పంట రుణాలు కూడా సక్రమంగా చెల్లించలేకపోయిన మాట వాస్తవమే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రస్తుత కలెక్టర్‌ పోలా భాస్కర్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బ్యాంకు వ్యవహారంలో ప్రత్యేక దృష్టి సారించారు. అయినా పాత బకాయిలు బ్యాంకుకు గుది బండలా మారటంతో జిల్లా కలెక్టర్‌ అందుకు సంబంధించిన వ్యవహారంపై దృష్టి సారిస్తున్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆడిట్‌ ఇటీవలే పూర్తయింది. ఆడిట్‌లో కొన్ని బ్యాంకు సిబ్బంది సాంకేతిక పరంగా చేసిన కొన్ని పొరపాట్లు కూడా బ్యాంకు అభివృద్ధికి కొంత ఆటంకంగా మారింది. 

బకాయిల వసూళ్లలో కనిపించని పురోగతి..
ఆడిట్‌ ప్రకారం 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.3.11 కోట్లు నష్టం వచ్చినట్లు తేలింది. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే కొంత మేర తగ్గింది. గత సంవత్సరం రూ.3.28 కోట్ల మేర నష్టం వచ్చినట్లు తేల్చారు. దీంతో 2017–18తో పోలిస్తే ఆడిట్‌ నిర్వహించిన ఏడాదికి గాను రూ.17 లక్షలు నష్టం తగ్గినట్లు తేలింది. ఇకపోతే బ్యాంకును పీడిస్తున్న మొండి బకాయిలు విషయంలో మాత్రం కొంత పురోగతి కనిపించింది. ఆప్కాబ్‌ నుంచి డిప్యూటేషన్‌పై బ్యాంకు సీఈఓగా వచ్చిన జి.జయ శంకర్‌ ఆధ్వర్యంలో బ్యాంకు బృందం మొండి బకాయీల విషయంలో చేసిన కసరత్తు కొంతమేర ఫలించింది. గత సంవత్సరంతో పోలిస్తే రూ.4.50 కోట్లు తగ్గింది. 2017–18 సంవత్సరానికి గాను మొండి బకాయీలు రూ.38.50 కోట్లు ఉండగా 2018–19 సంవత్సరానికి అదికాస్తా రూ.34 కోట్లకు తగ్గింది. 

అధికారులకు తలనొప్పిగా మారిన రీ ఎంట్రీలు..
ఇదిలా ఉంటే బ్యాంకు కమ్యూనికేషన్‌ వ్వవస్థకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో లోపాలు తలెత్తాయి. ఆ లోపాల వల్ల కొంత అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడింది. కంప్యూటర్లలో నిక్షప్తం అయిన సమాచారం ప్రకారం లోపాలను సరిదిద్దటంతో రూ.8.04 కోట్లు రీ ఎంట్రీలు వేయాల్సిన పరిస్థితి నెలకొని ఆడిట్‌ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. వాటితో పాటు నిరర్ధక ఆస్తులు రూ.1.74 కోట్లు ఉన్నట్లు తేల్చారు. లాంగ్‌ టర్మ్‌ రుణాల వడ్డీల్లో వచ్చిన తేడాల వల్ల రిసీవబుల్స్‌ కింద రూ.60 లక్షలు తేడా ఉన్నట్లు తేల్చారు. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు 2018–19లో ఇచ్చిన రుణాల రికవరీలో కొంతమేర పురోగతి ఉండటంతో నాన్‌ పర్‌ఫార్మెన్స్‌ అకౌంట్స్‌(ఎన్‌పీఏ)ల పరిస్థితి 3 శాతంగా నమోదు అయింది.

రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం ఎన్‌పీఏ 5 శాతం దాటితే బ్యాంకు దివాలా పరిస్థితిని ఎదుర్కొనేది. అలాంటిది 3 శాతం కావటంతో ఆ ప్రమాదం నుంచి బయట పడినట్లు అయింది. మొత్తం మీద 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,100 కోట్లు వివిధ రకాల రుణాలుగా అందజేశారు. అయితే బ్యాంకు మాత్రం డిపాజిట్లు సేకరించే లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. బ్యాంకు డిపాజిట్ల సేకరణ లక్ష్యం రూ.745 కోట్లు కాగా రూ.633 కోట్లు మాత్రమే సేకరించగలిగింది. దీంతో డిపాజిట్ల లోటు రూ.112 కోట్లు ఏర్పడినట్లయింది. జిల్లా కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు పరిధిలో మొత్తం జిల్లాలో 29 బ్రాంచ్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో 169 పిఏసిఎస్‌లు పనిచేస్తున్నాయి. వాటితో పాటు 7 సీడెడ్‌ సొసైటీలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement