జెడ్పీ... కిస్‌కా కుర్చీ...!
జెడ్పీ... కిస్‌కా కుర్చీ...!
Published Mon, May 22 2017 11:09 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
- టీడీపీలో వీడని ముసలం
- సందిగ్ధంలోనే ‘నామన’ భవితవ్యం
- నేడు ప్రత్తిపాడులో మినీ మహానాడు
- జెడ్పీటీసీల మూకుమ్మడి రాజీనామాల అస్త్రం
- నవీన్‌కు పీఠం దక్కకూడదనే ఎత్తుగడ
- తెరవెనుక యనమల వర్గం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కష్టపడి పనిచేసిన వారిని కరివేపాకులా వాడుకొని వదిలేయడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడికి వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్యనే ఇప్పుడు జెడ్పీపై ప్రయోగించనున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు జెడ్పీ పీఠం పునాదులే కదిలిపోయేలా కనిపిస్తున్నాయి. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబును పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్టు ప్రకటించినప్పుడే జెడ్పీ పీఠం నుంచి దింపేయడం ఖాయమైపోయిది. అయితే పార్టీ పరిశీలకుడు కిమిడి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఈ విషయాన్ని దాచిపెట్టి నామనతో పార్టీ అధ్యక్ష బాధ్యతలకు అంగీకరింపజేసే ఎత్తుగడ వేశారు. అవసరమైతే పార్టీ ధిక్కారానికి సైతం వెనుకాడేది లేదంటూ ఎదురు తిగరడంతో గడచిన రెండు రోజులుగా దఫదఫాలుగా ముఖ్యనేతలు చేస్తున్న బుజ్జగించే ప్రయత్నాలు బెడిసికొట్టడంతో డోలాయమానంలో పడ్డారు. నామనను తప్పించి వైఎస్సార్ నుంచి టీడీపీకి ఫిరాయించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌కు కట్టబెట్టాలని గత కొంత కాలంగా పార్టీ వ్యూహకర్తలు గట్టి ప్రయత్నాల్లో ఉన్న విషయం విదితమే.
వేడుకున్నా ససేమిరా...
ఈ క్రమంలోనే నామనకు టీడీపీ పగ్గాలు అప్పగించడం, జెడ్పీ పీఠం నుంచి తప్పించడం, ఆ తరువాత నవీన్‌కు అందలమెక్కించాలనేది పార్టీ అధిష్టాన వ్యూహం. రాంబాబుకు పార్టీ జిల్లా పగ్గాలు ప్రకటించిన 24 గంటలు కూడా తిరగకుండానే ఎదురు దెబ్బ తగిలింది. ఆ పగ్గాలు చేపట్టేది లేదని నామన తెగేసి చెప్పారని సమాచారం. జిల్లా టీడీపీ చరిత్రలో పార్టీ పగ్గాలు ప్రకటించాక స్వీకరించేది లేదని ధిక్కార స్వరాన్ని వినిపించడం ఇదే తొలిసారి. నామనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నట్టు మినీ మహానాడులో నిర్ణయం వెలువడిన మరుక్షణమే రాజీనామా పత్రాలను మూకుమ్మడిగా అందజేసి ధిక్కార గళాన్ని వినిపించేందుకు జెడ్పీటీసీలు సమాలోచనల్లో ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళ్లిన నామన సోమవారం కాకినాడలో పార్టీ నేతలకు చెప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధిష్ఠాన నిర్ణయంలో మార్పు లేకుంటే మంగళవారం ప్రత్తిపాడు మినీ మహానాడుకు వెళ్లకుండా తమతోపాటు పార్టీకి రాజీనామా చేయాలని జెడ్పీటీసీలు నామనకు సూచించారు.
రాజీనామాల వైపు జెడ్పీటీసీల అడుగులు...
చినరాజప్ప, ఇన్‌ఛార్జి మంత్రి కళా వెంకట్రావు కాకినాడలో మరోమారు సమావేశమై నామనను రాజీనామా చేయాలని కోరినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. అధిష్టానం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడమే జెడ్పీటీసీలకు ఎంతమాత్రం రుచించడం లేదు. మాట మాత్రమైనా చెప్పకపోవడం, పార్టీ ఫిరాయింపుదారులకు అందలం ఎక్కించే ప్రయత్నం చేయడంతో ఒకే గొడుకు కిందకు రావడానికి కారణమైంది. అయినా అధిష్టానం దిగి రాకుంటే జెడ్పీటీసీలు రాజీనామా చేయడానికి కూడా వెనుకాడకూడదనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. న్యాయమైన డిమాండ్ కోసం జెడ్పీటీసీలు సంతకాల సేకరణ ఉద్యమాన్ని ఇప్పటికే చేపట్టారు. ఇందులో 22 మంది సభ్యులు పార్టీని ధిక్కరించేందుకైనా సిద్ధమేనంటున్నారు. ఈ పరిణామాలు చివరకు జిల్లా పరిషత్ చైర్మన్ గిరీకి ఎసరు పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. జెడ్పీలో 60 జెడ్పీటీసీ సభ్యుల్లో ప్రతిపక్ష వైస్సార్‌సీపీ జెడ్పీటీసీలు 14మంది ఉన్నారు. మిగిలిన 46 మంది పార్టీ జెడ్పీటీసీల్లో 22 మంది రాజీనామాకు సిద్ధపడితే ఎదురయ్యే పరిణామాలు చైర్మన్ పీఠానికే ఎసరుపెట్టడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే 25 మందితో కోరం లేకుండా చేసి చైర్మన్ ఎన్నిక అడ్డుకోవాలనేది వీరి వ్యూహం. కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటింగ్ ఉందనే ధీమాతో అధిష్టానం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ వైఎస్సార్‌సీపీ నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై, ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించిన నవీన్‌ను చైర్మన్ పీఠంపై కూర్చోబెడితే న్యాయస్థానంలో నిలుస్తుందా అనేది కూడా చర్చనీయాంశమైంది. చివరకు ఏమి జరిగినా అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకత ఉందనే విషయంపై కళ్లుతెరిపించాలనేది వీరి వ్యూహంగా కనిపిస్తోంది.
యనమల హస్తం...?
నామన. అతనికి మద్ధతుగా అంత మంది జెడ్పీటీసీలు నిలవడం, అవసరమైతే అధిష్టానాన్ని కూడా ధిక్కరించే తెగువ ప్రదర్శించడం వెనుక బలమైన రాజకీయ కారణమేదో ఒకటి ఉండే ఉంటుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. జ్యోతులకు ఆది నుంచి రాజకీయంగా బద్ధ విరోధి అయిన మంత్రి యనమల రామకృష్ణుడు వర్గం తెర వెనుక ఈ ఆట ఆడిస్తుందనే అనుమానం కలుగుతోందని పార్టీలో చర్చ నడుస్తోంది. నెహ్రూ తనయుడు నవీన్‌కు చైర్మన్ పీఠం దక్కకుండా చేయాలనే పట్టుదలతో ఆ వర్గం చేయని ప్రయత్నమంటూ లేదని, ఇందుకు నామన వ్యవహారాన్ని వినియోగించుకుంటోందనే వాదన కూడా పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారం మంగళవారం జరిగే మినీ మహానాడు తరువాత టీడీపీని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement