అధికార మదం.. రౌడీ.. రాజకీయం
అధికార మదం.. రౌడీ.. రాజకీయం
Published Sun, Apr 9 2017 11:11 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
- ప్రజాపక్షాన నిలుస్తున్నవారిపై అక్రమ కేసులు
- భయభ్రాంతులకు గురి చేసేందుకు యత్నాలు
- వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యం
- ఆ పార్టీ నేతలు రౌడీషీటర్లట..!
- శ్రుతి మించుతున్న పాలకపక్ష అరాచకత్వం
ప్రభుత్వ విధానాలవల్ల అణచివేతకు, అన్యాయానికి గురయ్యేవారిపక్షాన నిలిచి, గొంతెత్తడం.. అవసరమైతే వారి తరఫున ఉద్యమించడం ప్రతిపక్షాల బాధ్యత. ప్రజలను వంచిస్తూ సాగే పాలకుల అవినీతి బాగోతాలను ఎండగట్టడం, అక్రమాలపై నిలదీయడం వాటి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడమే.. అధికార టీడీపీ నేతలకు కంటగింపవుతోంది. బడుగులకు అండగా నిలబడడాన్నే.. అధికార మదం తలకెక్కిన వేళ.. వారు పెద్ద నేరంగా పరిగణిస్తున్నారు. ప్రజాపక్షాన అలుపెరుగని సమరం చేస్తున్నవారిపై.. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ నేతలపై రౌడీ ముద్ర వేస్తూ.. సరికొత్త అరాచకీయానికి తెర తీస్తున్నారు. అక్రమ కేసులతో వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో వింత సంస్కృతికి తెలుగుదేశం పాలకులు తెర తీస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నమోదు చేసే రౌడీ షీట్లను.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాధ్యత కలిగిన నేతలపై అన్యాయంగా తెరుస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరిపైనా డజన్లకొద్దీ అక్రమ కేసులు పెట్టారు. రెండు లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న కనీస ఆలోచన కూడా మరిచి.. ఎమ్మెల్యేలపై సహితం కేసులు పెడుతున్నారు. శాసనసభలో ప్రతిపక్షం నోరు నొక్కేస్తున్నట్టే.. జిల్లాలో కూడా అధికార పార్టీ నేతల ఆదేశాలతో ప్రతిపక్ష నేతలపై కేసులపై కేసులు పెట్టేసి ఊపిరాడకుండా చేస్తున్న వైనం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.
చంద్రబాబు పునరాగమనం.. చరిత్ర పునరావృతం
రాజకీయంగా చైతన్యవంతమైన రాజమహేంద్రవరానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. జిల్లా కేంద్రం కాకినాడ అయినప్పటికీ ఒకప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగానే రాజకీయం నడిచేది. 2004కు ముందు చంద్రబాబు అధికారంలో ఉండగా.. ప్రతిపక్ష నేతగా ఉన్న అప్పటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కంపూడి రామ్మోహనరావు ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లు ఆయనకు నెలలో 15 రోజులు కేసులు, కోర్టులు, బెయిళ్లకే సరిపోయేది. అయినా ఆందోళనలకు వెనుకడుగువేయని రామ్మోహనరావుపై అప్పట్లో 70 పైగా కేసులు నమోదు చేశారు. చివరకు రౌడీ షీట్ తెరచిన పాలకపక్షం.. ఒక దశలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్‌కు కూడా వెనుకాడలేదు. చంద్రబాబు 2014లో తిరిగి అధికారంలోకి వచ్చాక గడచిన మూడేళ్లుగా దాదాపు అదే పంథాను కొనసాగిస్తున్నారు. ప్రజల తరఫున బలమైన వాణి వినిపిస్తున్న ప్రతిచోటా వైఎస్సార్ సీపీ నేతలను అక్రమ కేసులతో అణచివేస్తున్నారు. జిల్లాలో ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా అన్నిచోట్లా ప్రతిపక్ష పార్టీ నేతలపై లెక్కకు మిక్కిలిగా అక్రమ కేసులు నమోదయ్యాయి.
ఇవిగో ఉదాహరణలు
- గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని తుని నియోజకవర్గ ప్రజలు చావుదెబ్బ కొట్టారు. దానినుంచి కోలుకోలేని అధికార పార్టీ అక్కడి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సహా పార్టీ నేతలపై.. గడచిన మూడేళ్లుగా అక్రమ కేసులు పెడుతూనే ఉంది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే రాజా సహా పలువురిపై అత్యాచార కేసులు పెట్టారు. దీనినిబట్టి పాలకపక్షం ఏ రీతిన వ్యవహరిస్తోందో స్పష్టమవుతోంది.
- తుని మండలం టి.తిమ్మాపురానికి చెందిన పోల్నాటి ప్రసాద్‌పై రౌడీ షీట్ తెరిచారు.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణపై కపిలేశ్వరపురం మండలం అంగర పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ తెరిచారు. మండపేట రైతుబజార్‌లో షాపులను నిజమైన రైతులకు కాకుండా, బినామీ పేర్లతో అధికార పార్టీ నేతలకు అద్దెలకు కట్టబెట్టడం.. కపిలేశ్వరపురం ఇసుక ర్యాంపులో తెలుగు తమ్ముళ్ల అక్రమాలను నిలదీసి, ఇసుక లారీల అడ్డగించడం.. కోరుమిల్లిలో కూలీలకు, పావలా వడ్డీ కోసం ఉద్యమిస్తున్న మహిళలకు బాసటగా నిలవడం.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రవాణా చార్జీల రూపంలో అధికార పార్టీ నేతలు అడ్డదారిలో నొక్కేయడాన్ని నిలదీయడం.. రూరల్ మండలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఉద్యమించడం వంటి చర్యలతో లీలాకృష్ణ పాలకపక్షానికి కంటగింపుగా మారారు. పలువురిని ఇబ్బందిపెడుతూ, అలజడి సృíష్టిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనపై రౌడీ షీట్ తెరచినట్టు అక్కడి ఎస్సై వాసా పెద్దిరాజు ‘సాక్షి’కి చెప్పారు. అంతకంటే ముందు మూడు రోజుల వ్యవధిలో ఆరేడు సెక‌్షన్లతో నాలుగు కేసులు పెట్టినా పాలకపక్షం కోపం చల్లారకపోవడంతో ఇప్పుడు రౌడీషీట్ కూడా తెరిచారు.
- ఎక్కడైనా రాజకీయాలు వారసత్వంగా వస్తుంటాయి. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కేసులు, రౌడీషీట్‌లు కూడా వారసత్వంగా వస్తాయని రాజమహేంద్రవరం పోలీసులు నిరూపించారు. దివంగత జక్కంపూడి రామ్మోహనరావుకు రాజకీయ వారసుడిగా ఉన్న వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై పాలకపక్ష ఒత్తిడితో సుమారు 16 కేసులు పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తుంటే అడ్డుకున్న పోలీసులను ప్రశ్నించినందుకు ప్రకాష్‌నగర్ పోలీసు స్టేషన్‌లో రాజా, పార్టీ సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాజా సోదరుడు, యువజన నాయకుడు గణేష్‌పై రౌడీషీట్ తెరిచారు. ప్రజల తరఫున పోరాడటం, పాలకపక్ష అవినీతిని నిలదీయడమే రాజా చేసిన నేరంగా కనిపించింది.
- ఏజెన్సీలో అధికార పార్టీకి అడ్డుకట్ట వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌పై కూడా రౌడీషీట్ తెరిచారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏజెన్సీలో టీడీపీ అడ్రస్ కూడా లేకుండా చేసిన మన్యంవాసులు వైఎస్సార్ సీపీని అందలమెక్కించారు. ఇదే ఇందులో క్రియాశీలక పాత్ర పోషించడమే అనంతబాబు చేసిన తప్పయింది. వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత టీడీపీలోకి ఫిరాయించాక అనంతబాబుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసు పెట్టిన పోలీసులు.. తరువాత ప్రజల శాంతికి భంగం కలిగిస్తున్నారంటూ 2014 జూలైలో రౌడీ షీట్ తెరిచారు.
- అమలాపురంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి వాసంశెట్టి సుభాష్ సహా నాయకులు దొంగ శ్రీను, వాకపల్లి శ్రీనివాస్, కేతా భానుతేజ తదితరులపై రౌడీ షీట్‌లు తెరిచారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
Advertisement
Advertisement