నో టిక్కెట్ ... ఓన్లీ బ్లాక్
Published Fri, Apr 28 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM
– యథేచ్ఛగా బ్లాక్ టిక్కెట్ల విక్రయం
– కౌంటర్‌లో ఒక్క టిక్కెట్ట అమ్మని థియేటర్లు
– ఆన్‌లైన్‌లోనూ దర్శనమివ్వని వైనం
– చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీసు విభాగాలు
– అమలాపురంలో బెనిఫిట్ షోపై వివాదం.. ఉద్రిక్తత
సాక్షి, రాజమహేంద్రవరం: బాహుబలి–2 సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మి సొమ్ముచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బాహుబలి బెనిఫిట్ షోను ప్రదర్శించారు. వాటి టిక్కెట్లను రూ.800 నుంచి రూ.2000 వరకు గురువారం ఉదయం నుంచే విక్రయించేశారు. శుక్రవారం సాధారణ షో టిక్కెట్లు కూడా బ్లాక్‌లో అమ్మడంతో సాధారణ ప్రేక్షకుడికి నిరాశే ఎదురైంది. సాధారణంగా ఇప్పటి వరకు »బెనిఫిట్ షోతోపాటు సాధారణ షోలకు కనీసం కొద్ది మొత్తంలోనైనా థియేటర్ కౌంటర్‌లో టిక్కెట్లు అమ్మేవారు. అయితే ఈ చిత్రానికి మాత్రం శుక్రవారం బ్లాక్‌లోనే అన్నీ విక్రయించేశారు.
ఆన్‌లైన్ టిక్కెట్లు నిల్...
గతంలోనూ కొత్త సినిమా లేదా పేరున్న హీరో సినిమా విడుదల అవుతుందంటే ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లన్నీ అయిపోయాయని థియేటర్ యాజమాన్యాలు, నిర్వాహకులు చెప్పేవారు. వాటిని వారి సిబ్బందితో థియేటర్ వద్దనే విక్రయించేవారు. అయితే బాహుబలి సినిమాకు మాత్రం ఆన్‌లైన్‌లో ఒక్క టిక్కెట్టు కూడా పెట్టలేదు. నిబంధనల ప్రకారం బాల్కనీ టిక్కెట్లలో 50 శాతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. మిగిలిన 50 శాతం టిక్కెట్లతోపాటు ఇతర క్లాస్ టిక్కెట్లు కౌంటర్‌లో విక్రయిచాలి. కానీ శుక్రవారం ఇలా జిల్లాలో ఎక్కడా జరుగలేదు.
నిమ్మకు నీరేత్తిన రెవెన్యూ, పోలీస్ విభాగాలు...
థియేటర్ల వద్ద బ్లాక్‌టిక్కెట్ల దందా ఇలా సాగుతుంటే జిల్లా రెవెన్యూ, పోలీసు విభాగాలు ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. నిబంధనల ప్రకారం కనీసం కౌంటర్‌లో, ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించేలా చూడాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకునీరేత్తినట్లుగా వ్యవహరిస్తోందని థియేటర్ల వద్ద ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు బ్లాక్ టిక్కెట్ల దందా అరికట్టడం తమ పని కాదన్నట్లు థియేటర్ల వద్ద చోద్యం చూశారు. టిక్కెట్ల కోసం గుంపులుగా నిరీక్షిస్తున్న ప్రేక్షకులపై తమ ప్రతాపం చూపారేగానీ బ్లాక్‌టిక్కెట్లు విక్రయిస్తున్న వారి వైపు కన్నెత్తి చూడలేదు.
అమలాపురంలో బెనిఫిట్‌షోపై ఉద్రిక్తత...
అమలాపురంలో బాహుబలి బెనిఫిట్ షో ప్రదర్శనపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఉత్కంఠ, ఉద్రిక్తత నెలకొంది. గతంలో కొంత మంది హీరోల సినిమాలకు బెనిఫిట్ షో అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే యంత్రాంగం బాహుబలి–2 చిత్రానికి ఇవ్వలేదు. కొంత మంది అభిమానులు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ఒక్కో టిక్కెట్టును రూ.1500 నుంచి రూ.2000 వరకు విక్రయించేశారు. ఈ నేపథ్యంలో ఇతర హీరోల అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు అనుకున్న సమయానికి సినిమా వేయలేదన్న కోపంతో టిక్కెట్లు కొన్నవారు వెంకట పద్మావతి మల్లి కాంప్లెక్స్ అద్దాలు, అక్కడ ఉన్న ఐదు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. సున్నితమైన అంశం కావడంతో అధికార యంత్రాంగం చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది.
Advertisement