చైర్మన్ పీఠానికి ‘నామం’
చైర్మన్ పీఠానికి ‘నామం’
Published Wed, Apr 19 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
చైర్‌పై నెహ్రూ తనయుడు
- నామనకు పార్టీ జిల్లా పగ్గాలు
సాక్షిప్రతినిధి, కాకినాడ : ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే’ సామెత జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు విషయంలో నిజమవుతున్నట్టుగానే ఉంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి దక్కకపోవడంతో దాని ప్రభావం నామన పదవికి ఎసరుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కోనసీమలో పి.గన్నవరం నియోజకవర్గం మగటపల్లికి చెందిన నామన పార్టీ ఆవిర్భావం నుంచి వివాదరహితుడనే పేరుంది. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి హయాం నుంచి పార్టీలో పలు పదవులు నిర్వర్తించారు. ఈ కారణాలతోనే జెడ్పీ పీఠానికి నామనను అప్పట్లో ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. జెడ్పీ చైర్మన్‌గా మూడేళ్లు పూర్తి కావస్తోంది. మునుపటి చైర్మన్లు మాదిరిగా నిధులు, విధులు మాటెలా ఉన్నా కనీసం బుగ్గకారు, ప్రోటోకాల్, హోదా ఇటు పార్టీలోను, అటు అధికారికంగాను అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి వర్గ విస్తరణలో మెట్ట ప్రాంతానికి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మొండి చేయి ఎదురైనప్పుడే చర్చంతా జెడ్పీ పీఠంపైకి మళ్లింది. ఎందుకంటే నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయంగా అతని కుమారుడు, జగ్గంపేట జడ్పీటీసీ సభ్యుడు నవీన్‌కు జెడ్పీ పీఠాన్ని అçప్పగిస్తారని పార్టీలో విస్తృతమైన ప్రచారానికి తెరలేచింది. నెహ్రూ జీవితాశయం మంత్రి పదవి అధిష్టించడం. ఆ పదవితో పాటు మరికొన్ని ప్రలోభాల ఎరలోపడి చంద్రబాబు మాట నమ్మి నెహ్రూ టీడీపీలో తిరిగి చేరారని బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలోనే తాజా మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఖాయమని గంపెడాశతో నిరీక్షించిన నెహ్రూకు చివరకు రిక్తహస్తమే ఎదురైంది. ఈ పరిణామం అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు నామన పీఠానికి ఎసరుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని టీడీపీలో చర్చ నడుస్తోంది. మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడంతో అంతర్మథనం చెందుతున్న నెహ్రూకు గుడా (గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ లేదా, అతని తనయుడు నవీన్‌కు జెడ్పీ చైర్మన్ పీఠం రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఈ విషయాన్ని పార్టీ జిల్లా నేతలు మంత్రివర్గ విస్తరణ అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గుడా చైర్మన్ రేసులో ఇప్పటికే పార్టీ రాజమహేంద్రవరం నాయకుడు గన్ని కృష్ణ ఉన్నారు. అందునా నెహ్రూ కూడా గుడా చైర్మన్ గిరీని ఆమోదిస్తే తన స్థాయి తగ్గించుకోవడమే అవుతుందనే భావనలోనే ఉన్నారంటున్నారు. అటువంటి పరిస్థితి వస్తేగిస్తే అసలు ఏ పదవి వద్దనుకోవాలనే నిర్ణయంతో ఉన్నారని అనుచరవర్గం చెబుతోంది. జడ్పీ చైర్మన్ పీఠంపై కుమార్డు నవీన్‌ను కూర్చోపెట్టడానికి మాత్రం నెహ్రూ సుముఖంగానే ఉన్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మూడు దశాబ్థాల రాజకీయాల్లో నెహ్రూ జీవితాశయం మంత్రి పదవి ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
ద్రాక్ష అందలేదు అందుకే...
కనీసం తనయుడు నవీన్‌ను జెడ్పీ చైర్మన్‌గా చేస్తే రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసినట్టు అవుతుందనే ఆలోచనతో నెహ్రూ ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. అది జరగాలంటే ప్రస్తుత చైర్మన్ రాంబాబు చైర్మన్ పీఠం కదిలిపోవడం ఖాయమేనంటున్నారు. నవీన్‌కు చైర్మన్ పీఠం అప్పగించి రాంబాబుకు పార్టీ జిల్లా పగ్గాలతో సరిపెట్టాలనే ప్రతిపాదన తీసుకువచ్చారని తెలిసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు మృతి చెందిన దగ్గర నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం తనయుడు, మంత్రి లోకేష్ కాకినాడ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బసచేసిన సందర్భంలో ఈ అంశంపై కొద్దిసేపు జిల్లా టీడీపీలో ఇద్దరు ముఖ్యనేతల మధ్య చర్చ సీరియస్‌గా సాగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక్కడా యనమల పితలాటకమేనా...!
నెహ్రూతో మెట్ట ప్రాంతంలో రాజకీయంగా బద్ధ వైరం ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జెడ్పీ చైర్మన్ పీఠం నవీన్‌కు అప్పగించే విషయంలో ఏమంత సుముఖంగా లేరని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అలాగని ఎక్కడా పెదవి విప్పని యనమల వర్గీయులు నెహ్రూతో పడని నేతలను వ్యూహాత్మకంగా ఎగదోస్తున్నారని పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. పార్టీని కాలదన్ని వెళ్లిపోయి స్వార్థం కోసం నిన్నగాక మొన్న పార్టీలోకి తిరిగొచ్చిన వారికి అత్యున్నత పదవులు కట్టబెడితే పార్టీ శ్రేణులకు ఏ రకమైన సంకేతాలు వెళతాయని అనుమాన బీజాలు నాటుతున్నారు. ఈ అంశానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రచారం ముమ్మరం చేయించే పనిలో నెహ్రూ వైరివర్గం చాపకింద నీరులా గోతులు తవ్వేస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎటువైపు దారితీస్తాయోనని వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement