కాపులు, పోలీసుల మధ్య తోపులాట
కాపులు, పోలీసుల మధ్య తోపులాట
Published Thu, Aug 17 2017 10:50 PM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM
కంచాలతో రోడ్డేకేందుకు యత్నం
జగ్గంపేట : కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద కాపులు, పోలీసుల మధ్య గురువారం తోపులాట చోటుచేసుకుంది. కంచాలతో రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించిన కాపులను పోలీసులు అడ్డుకున్నారు. గత నెల 26న ముద్రగడ చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి లేదని అడ్డు చెప్పడంతో.. పోరు సీఎం వర్సెస్ ముద్రగడగా మారింది. ఓట్ల కోసం కాపు జాతికి రిజర్వేషన్లను ఎరవేసి వారి ఓట్లతో పీఠం ఎక్కిన చంద్రబాబుకు ఆ హామీని గుర్తు చేయడం రుచించడం లేదు. జాతి కోసం కుటుంబంతో పోరుబాట సాగిస్తున్న ముద్రగడ..తనకు కంటిలో నలుసుగా మారినట్టు భావిస్తున్న సీఎం.. ఆయనను అణచివేసి ఉద్యమం నీరుగార్చేందుకు దారుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జగ్గంపేట పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు.. తనకు ఎవరూ చెప్పాల్సిన పని లేదంటూ చేసిన వ్యాఖ్య.. ముద్రగడను ఉద్దేశించి చేసిందనంటూ పలువురు విశ్లేషిస్తున్నారు.
నిరవధిక పాదయాత్ర పేరిట ముద్రగడ రోజూ బయటకురావడం, ఆయనను పోలీసులతో నిలువరించడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం రోడ్కెక్కి నిరసనలు వ్యక్తం చేస్తుంటే పరిష్కారం చేయకుండా.. ముద్రగడను టార్గెట్‌గా చేయడాన్ని కాపు వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
కంచాలు మోగించి...
ముద్రగడ, కాపు జేఏసీ నాయకులు, మహిళలు గురువారం కంచాలు మోగించి నిరసన వ్యక్తం చేశారు. రోజుకో రకం నిరసనలు వ్యక్తం చేస్తోన్న కాపు జేఏసీ నాయకులు నల్ల చొక్కాలను ధరించారు. కంచాలతో నిరసన సందర్భంగా ముద్రగడ ఇంటి నుంచి ఒక్కసారి గేటు వరకు పెద్ద సంఖ్యలో వచ్చి రోడుపై ధర్నాకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాటకు దారితీసింది. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు వాసురెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, గౌతు స్వామి, ఆరేటి ప్రకాష్, చక్కపల్లి సత్తిబాబు, గుండా వెంకటరమణ, తుమ్మలపల్లి రమేష్, గోపు అచ్యుతరామయ్య, తదితరులు పాల్గొని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. తమకు సంకెళ్లు వేయండి.. కాపు జాతిపై కక్ష సాధింపు ఎన్ని రోజులని నిలదీశారు.
Advertisement
Advertisement