ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టు
ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టు
Published Thu, Aug 3 2017 11:10 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
జెడ్పీ చైర్మన్ ఎన్నికపై వైఎస్సార్ సీపీ ఆగ్రహం
కలెక్టరేట్ ఎదుట కదంతొక్కిన పార్టీ శ్రేణులు
కాకినాడ : డబ్బు, పదవులను ఎరవేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోన్న తీరు ప్రజాస్వామ్య మనుగడకే గొడ్డలిపెట్టుగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. జెడ్పీ చైర్మన్‌గా జ్యోతుల నవీన్‌ను ఎన్నుకున్న విధానాన్ని నిరసిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపు మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట కదం తొక్కారు. వందలాది మందితో ధర్నా చేశారు. ఫిరాయింపుల చట్టాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయవద్దంటూ వారు నినాదాలు చేశారు. పార్టీ శ్రేణులనుద్దేశించి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి ప్రజాసమస్యలను గాలికి వదలి వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి దుర్దినంగా పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాల్సిన కొందరు ప్రజాప్రతినిధులు పదవులకు, సొమ్ములకు ఆశపడి విలవలకు తిలోదకాలిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ గతంలో తాను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న సమయంలో విలువలకు ప్రాధాన్యతనిచ్చే వైఎస్ తనను రాజీనామా చేసి పార్టీలోకి రావాలని సూచించడంతో ఆరు నెలల ముందే పదవిని వదులుకున్నాన్నారు. జగ్గంపేట కో–ఆర్డినేటర్ ముత్యాల సతీష్ మాట్లాడుతూ తక్షణమే జ్యోతుల నవీన్ వైఎస్సార్‌సీపీ ద్వారా వచ్చిన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ గిరజాల బాబు మాట్లాడుతూ ప్రజల తిరస్కారానికి గురైన టీడీపీ కార్యకర్తలను జన్మభూమి కమిటీ సభ్యులుగా నియమించి పెత్తనం చెలాయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ముమ్మిడివరం కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై కొరవడిందంటూ టీడీపీ తీరుపై మండిపడ్డారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలతో తమకు అనుకూలంగా మల్చుకోవాలనుకుంటే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధం ఉండదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన స్థాయిని మరిచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.జితేంద్రను కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం చాప్టర్–5, 73 క్లాజ్‌ప్రకారం జ్యోతుల నవీన్ జెడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, రావులపాలెం ఎంపీపీ కోట చల్లయ్య, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, సంగిశెట్టి అశోక్, కర్రి నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, ముమ్మిడివరం ఫ్లోర్‌లీడర్ కాశి మునికుమారి, జిల్లాపార్టీ అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శులు అల్లి రాజబాబు, పాలెపు ధర్మారావు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి ఒమ్మి రఘురామ్, రాష్ట్ర ఎస్సీసెల్ సహాయ కార్యదర్శి మోకా సూరిబాబు, వరసాల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు వి.సూర్యప్రకాష్, రాయప్రోలు కృష్ణమూర్తి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement