సాక్షి, కర్నూలు: కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో త్వరలో పురపాలక, జిల్లా, మండల పరిషత్తుల పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలోనే ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు కూడా వెలువడినా ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వం విషయంలో నెలకొన్న సందిగ్ధంతో ప్రమాణ స్వీకారాలు జరగలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడంతో స్థానిక పురపాలక, జిల్లా, మండల పరిషత్తులకు ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా దీనికి సానుకూలంగా ఉండటంతో త్వరలోనే వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదా పు రెండేళ్లుగా కొనసాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడనుంది.
పరిషత్తులకూ:
పురపాలక పాలకమండళ్ల ప్రమాణస్వీకార ప్రక్రియ ముగిసిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కూడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. జిల్లాలో 53 మండలాల్లో 30 జెడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీకి అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏకపక్ష మెజార్టీ లభించింది. మండల పరిషత్ అధ్యక్ష పీఠాలూ ఎక్కువగానే వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరనున్నాయి.
పురపాలికల్లో:
జిల్లాలో కర్నూలు కార్పొరేషన్, బనగానపల్లె పురపాలక సంఘానికి తప్ప మిగిలిన నంద్యాల, నందికొట్కూరు, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలు ఉండగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం కోసం ఎదురుచూస్తున్నారు. పాలకమండళ్లు ఏర్పడ్డాక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే ఆయా ఖజానాలకు జమ కానుండగా, ఇదే సమయంలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంది.
త్వరితగతిన కౌన్సిల్ ఏర్పడితే కేంద్రనిధులు, స్థానిక బడ్జెట్ నిధులతో తమ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీరంతా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు. మరోపక్క కౌన్సిల్‌లో కీలకమైన ఎక్స్‌అఫిషియో సభ్యత్వంపై చర్చ సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే సంబంధిత పురపాలక సం ఘంలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వ్య వహరిస్తారు. ఎంపీలు కూడా వారి ని యోజకవర్గాల పరిధిలో తమకు నచ్చిన పురపాలికలో సభ్యత్వాన్ని పొందవచ్చు. చైర్మన్ ఎంపిక క్లిష్టతరమైనప్పుడు వీరి ఓటు కీలకమవుతుంది.
మార్గదర్శకాలు ఇలా:
= రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మేరకు తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక తేదీకి సంబంధించి ఈ నెల మూడో వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది.
= వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు గెజిటెడ్ హోదా గల అధికారి ప్రొసీడింగ్ అధికారిగా నియమిస్తారు.
=ఎన్నికల సంఘం ఖరారు చేసిన రోజున ఎన్నికైన వార్డు సభ్యులు హజరుకావాలని నోటీసులు జారీ చేస్తారు. మొత్తం సభ్యులలో సగం మంది తప్పనిసరిగా హాజరుకావాలి. లేనిపక్షంలో ఎన్నిక వాయిదా పడుతుంది.
=తొలుత వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికకు ఈసీ గుర్తింపు పొందిన పార్టీలకు విప్ జారీచేసే అధికారం ఉంది. ఆయా పార్టీలు ముందుగా తమ సభ్యులకు చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల్లో ఎవరిని బలపరచాలనే అంశంపై విప్ జారీ చేస్తాయి. విప్‌లో ఉన్న అంశాన్ని ముందుగా ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి తెలియజేయాలి. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రొసీడింగ్ అధికారికి తెలియపరిస్తే నమోదు చేసుకుంటారు.
= తర్వాత ఎన్నిక ప్రక్రియ చేతులు ఎత్తే పద్ధతిలో జరుగుతుంది. ఏదైనా కారణంతో చైర్మన్ ఎన్నిక జరగకపోతే వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగదు. ఏ సభ్యుడైనా పార్టీ విప్‌ను ధిక్కరించినా ఆ ఓటును చెల్లుబాటుగానే పరిగణిస్తారు. తర్వాత పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ వివరణ కోరుతూ ప్రొసీడింగ్ అధికారి ఆ వార్డు సభ్యునికి నోటీసు జారీ చేస్తారు. ఆయన సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా సభ్యుని పదవి రద్దు విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ సభ్యుడు పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది.
ప్రజాపాలనకు సన్నాహాలు
Published Mon, Jun 16 2014 1:49 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement