ఐటీడీఏకు శాపం
- 14 నెలలుగా కానరాని పాలకవర్గ సమావేశం
- గత ఐదేళ్లలో నాలుగుసార్లే నిర్వహణ
- కొత్త పాలనలోను జాప్యమేనా?
- అధికారుల్లో ఏదీ జవాబుదారీతనం
పాడేరు: గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలపై 3 నెలలకు ఒకసారి నిర్వహించ వలసిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు సక్రమంగా జరగలేదు. ఐదేళ్లపాలనలో నాలుగు సార్లే సమావేశాలు నిర్వహించడం గమనార్హం. చివరిసారిగా 2013 మే 11వ తేదీన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు.
తరువాత ఇంత వరకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల జోలికి అధికారులు వెళ్లలేదు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత పాలకవర్గ సమావేశాలు జరుగుతాయని గిరిజనులు ఆశపడినప్పటికి ఫలితం లేకపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తున్నా పాలకవర్గ సమావేశం ఊసెత్తడం లేదు. జిల్లా కలెక్టరు, ఐటీడీఏ పీఓలు పాలకవర్గ సమావేశాన్ని 3 నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది.
గిరిజనాభివృద్ధికి కీలకమైన పాలకవర్గ సమావేశాన్ని నిర్లక్ష్యం చేయడంతో అభివృద్ధిపై చర్చించే పరిస్థితి ఉండడం లేదు. ఐటీడీఏకు వచ్చే నిధులు వాటిని గిరిజనాభివృద్ధికి ఉపయోగించేందుకు చేపట్టే చర్యలపై సమీక్ష జరపాల్సి ఉంది. గిరిజన ఉప ప్రణాళిక, ఐఏపీ, సమగ్ర కార్యచరణ ప్రణాళిక పథకాల ద్వారా ఐటీడీఏకు వచ్చే నిధులకు పాలకవర్గ సమావేశం లేక జవాబుదారీతనం కూడా లోపిస్తోంది. ఐటీడీఏ ద్వారా చేపట్టే కార్యక్రమాలన్నీ ఇష్టారాజ్యంగానే మారుతున్నాయనే ఆరోపణలు అధికంగా వినిసిస్తున్నాయి.
రాష్ట్రం లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికి పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఎమ్మెల్యేలు, అరకు పార్లమెంట్ సభ్యురాలంతా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన వారే. గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహించాలని వారంతా కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జోలికి అధికారులు వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను మూడు నెలలకు ఒకసారి నిర్వహించి తమ అభివృద్ధికి పాటుపడాలని గిరిజనులు కోరుతున్నారు.