త్రిసభ్య కమిటీ సమావేశం రేపు
- ఎన్నికలపై వైఎస్సార్ సీపీ సమీక్ష
- నియోజకవర్గాల వారీ సమావేశం
మునగపాక, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షకు జూన్ ఒకటిన అనకాపల్లి న్యూకాలనీలోని రోటరీ కల్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ సమావేశమవుతున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మునగపాకలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రూరల్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల నాయకులతో సమీక్ష ఉంటుందన్నారు.
దీనికి పార్టీ సీనియన్ నేతలు, విశాఖ జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యులు ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, సాయిరాజ్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. నియోజకవర్గాల వారీ సమీక్ష అనంతరం నివేదికను జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పిస్తారన్నారు. ఇందులో భాగంగా ఒకటిన ఉదయం 9గంటలకు అనకాపల్లి , 9.30 గంటలకు చోడవరం, 10 గంటలకు పెందుర్తి, 10.30 గంటలకు యలమంచిలి, 11 గంటలకు పాయకరావుపేట, 11.30 గంటలకు నర్సీపట్నం, 12 గంటలకు మాడుగుల, 12.30 గంటలకు పాడేరు, ఒంటి గంటకు అరకు నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష ఉంటుందన్నారు.
ఆయా నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలని ప్రసాద్ కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మళ్ల సంజీవరావు,పీఏసీఎస్ అధ్యక్షుడు టెక్కలి కొండలరావు, పార్టీ నాయకుడు సూరిశెట్టి కన్నారావులు పాల్గొన్నారు.