సాక్షి, ఖమ్మం : పుర పాలక వర్గం కొలువుదీరేందుకు అంతా సిద్ధమైంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు మున్సిపాలిటీల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక చైర్మన్ ‘పీఠ’ముడి ఉన్న మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. స్పష్టమైన మెజారిటీ రాని చోట చైర్మన్ పీఠానికి పోటీ పెరిగి రాజకీయం వేడెక్కింది. క్యాంపు రాజకీయంతో పుర పాలి‘టిక్స్’ జోరందుకుంది.
మున్సిపల్ ఎన్నికల అనంతరం మూడు నెలల తర్వాత పుర చైర్మన్లు కొలువుదీరబోతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటి నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల ఎప్పుడు జరుగుతాయోనని వేచిచూడసాగారు.
అయితే సార్వత్రిక ఎన్నికలు, నూతన ప్రభుత్వ ఏర్పాటుతో ఇంతకాలం వాయిదా పడిన ఈ ఎన్నికలకు ఎట్టకేలకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం గురువారం ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల నామినేషన్.. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించిన వారు వెంటనే ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది.
ఈ ఎన్నికలకు సంబంధించి కొత్తగూడెం మున్సిపాలిటీకి ఆర్డీఓ అమయ్‌కుమార్, ఇల్లెందుకు పాల్వంచ ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మధిరకు ఖమ్మం ఆర్డీఓ సంజీవరెడ్డి, సత్తుపల్లికి భద్రాచలం మొబైల్ కోర్టు జడ్జి వెంకటాచారి ప్రిసైడింగ్ అధికారులుగా నియమితులయ్యారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా తమ మున్సిపాలిటీల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కొత్తగూడెం, మధిరలో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. క్యాంపు రాజకీయాలు తారుమారైతే ఎమ్మెల్యేల ఓటుతో గట్టెక్కిన సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. ఇటు క్యాంపు రాజకీయంతో పాటు తమ ఓటు కూడా కీలకం కావడంతో స్థానిక ఎమ్మెల్యేలు పుర పీఠం దక్కించుకోవడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.
‘అవుటాఫ్’లో క్యాంపులు..
స్పష్టమైన మెజారిటీ రాని మున్సిపాలిటీల్లో చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు క్యాంపు రాజకీయం జోరందుకుంది. పీఠంపై ఎవరికి కూర్చోబెట్టాలనే విషయంలో స్థానికంగా ఉండే ప్రధాన నేతలతో ఎమ్మెల్యేలు మంతనాలు చేస్తున్నారు. క్యాంపులు కూడా వీరి పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. ఇల్లెందుకు చెందిన కాంగ్రెస్, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు హైదరాబాద్ క్యాంపులో ఉన్నారు.
అయితే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సూచనలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపులోనే చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే మధిరలో కాంగ్రెస్.. టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుంది. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ కూటమిగా పోటీ చేశాయి. అయితే ఇప్పుడు టీడీపీతో కాంగ్రెస్‌తో అనైతిక పొత్తు పెట్టుకోవడాన్ని కాంగ్రెస్‌తో పాటు సీపీఐకి చెందిన కొందరు కౌన్సిలర్లు కూడా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కాగా, స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తమ పార్టీ కౌన్సిలర్లు ‘చే’జారకుండా హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేశారు.
సత్తుపల్లి చైర్మన్ పీఠంపై ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు కన్నేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీరిని జిల్లా సరిహద్దులో క్యాంపునకు తరలించి సయోధ్య కుదిర్చే యత్నంలో మునిగారు. ఇక కొత్తగూడెంలో రాజకీయం రసకందాయంలో పడింది. అన్ని పార్టీల కౌన్సిలర్లు పట్టణంలోనే ఉండి ఎవరు తమకు ప్యాకేజీ ఎక్కువ ఇస్తే వారి వైపే మొగ్గు చూపాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. విప్ జారీ చేసినా ఇప్పట్లో అనర్హత వేటు ఉండదని, ఆలోపు పదవి కాలం పూర్తవుతుందనే భరోసాతో కొందరు కౌన్సిలర్లు తాయిలాలకు సై అంటున్నట్లు సమాచారం. కాగా, మున్సిపల్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ఎమవుతుందో కొద్ది గంటల్లో తేలనుంది.
నాలుగేళ్లకు మున్సిపల్ పాలకవర్గం..
గత ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేదు. దీంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు నూతన పాలక వర్గాలు కొలువుదీరుతున్నాయి. 2010 సెప్టెంబర్ 29న గత పాలక వర్గం పదవి కాలం పూర్తయింది. ఆ వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలం పట్టించుకునే వారు లేకోపవడంతో మున్సిపాలిటీల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. అధికారులే ప్రత్యేక అధికారులుగా ఉండి పాలనను కొనసాగించారు.
దీంతో ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఏళ్లుగా పైపులైన్లకు లీకేజీలకు మరమ్మతులు లేకపోవడంతో కాలుషిత నీటిని తాగి పుర ప్రజలు రోగాల బారిన పడ్డారు. ఇప్పుడు నూతనంగా పాలన పగ్గాలు చేపడుతున్న వారికి ఈ సమస్యలన్నీ తీర్చడం పెద్ద సవాలే. వచ్చిన నిధులన్నీ సకాలంలో ఖర్చు చేయక నిర్మాణ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నూతన పాలకవర్గం ఈ సమస్యలన్నింటిపై దృష్టి పెడితేనే కొంతమేరైనా పుర ప్రజల సమస్యలు తీరనున్నాయి.
పుర పీఠం కోసం రె‘ఢీ’
Published Thu, Jul 3 2014 2:22 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
Advertisement
Advertisement