- వైస్ చైర్మన్‌గా తుమ్మల
- ఎంపీ, ఎమ్మెల్యే చర్చలు జయప్రదం
- తొలగిన ఉత్కంఠ
ఉయ్యూరు : ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా జంపాన పూర్ణచంద్రరావు (పూల), వైస్ చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాసబాబు ఎన్నికవడంతో ఉయ్యూరు చైర్మన్ ఎవరనే విషయమై ఇప్పటివరకూ ఉన్న ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది. చైర్మన్‌గిరీకోసం టీడీపీలోని పలువురు పోటీపడడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ టీడీపీ కౌన్సిలర్లతో పలు దఫాలుగా జరిపిన చర్చలు జయప్రదం కావడంతో పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఐదేళ్లచైర్మన్ పదవీకాలాన్ని మూడు భాగాలుగా విభజించారు. తొలుత జంపాన పూర్ణచంద్రరావు, తరువాత అబ్దుల్ ఖుద్దూస్, షేక్ ఖలీల్ చైర్మన్లుగా కొనసాగేలా నేతలు నిర్ణయించారు.
కౌన్సిలర్లుగా ప్రమాణం..
మున్సిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లకుగానూ ఓటింగ్‌కు 19 మంది మాత్రమే హాజరయ్యారు. 8 మంది వైఎస్సార్ సీపీ, 9 మంది టీడీపీ, ఇరువురు స్వతంత్రులు హాజరుకాగా 9వ వార్డు కౌన్సిలర్ తుంగల పద్మ (వైఎస్సార్ సీపీ) గైర్హాజరయ్యారు. సభ్యులందరితో ప్రత్యేక అధికారి పుష్పమణి ప్రమాణస్వీకారం చేయించారు. అడపా ఆదిలక్ష్మి, అబ్దుల్ ఖుద్దూస్, అబ్దుల్ రహీమ్, కోరాడ వెంకటలక్ష్మి, గుంజా రాంబాబు, జంపాన పూర్ణచంద్రరావు, జరీనా భేగం, తుమ్మల శ్రీనివాసబాబు, తోట జ్యోతి, నడిమింటి లక్ష్మి, పండ్రాజు సుధారాణి, పుట్టి రోజామణి, పెనుమూడి వాణి, బాణావత్తు కళ్యాణి, బొబ్బిలి నాగరాజు, వంగవీటి శ్రీనివాసప్రసాద్, షేక్ ఖలీల్, రజియా సుల్తానా, సోలే సురేష్‌బాబులు కౌన్సిలర్లుగా ప్రమాణం చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాజరయ్యారు.
ఉత్కంఠకు తెరతీసిన ఛైర్మన్ ఎన్నిక..
చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగింది. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం పలుమార్లు ఎంపీ కొనకళ్ల, ఎమ్మెల్యే ప్రసాద్ కౌన్సిలర్లతో చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. చైర్మన్‌గా 16వ వార్డు కౌన్సిలర్ జంపాన పూర్ణచంద్రరావు (పూల), వైస్ చైర్మన్‌గా 11వ వార్డు కౌన్సిలర్ తుమ్మల శ్రీనివాసబాబు పేర్లను ఖరారు చేశారు. వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థిగా 18వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రహీమ్ పోటీలో నిలిచారు.
పూలను ఎక్స్ అఫీషియో సభ్యులు, ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లతో కలిపి 13 మంది, వైస్ చైర్మన్ తుమ్మలను 12 మంది బలపర్చడంతో మెజార్టీని బట్టి వారిరువురినీ చైర్మన్, వైస్‌చైర్మన్లుగా ఎన్నికల అధికారి పుష్పమణి ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఉయ్యూరు మున్సిపల్ తొలి కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం ప్రైవేటు ప్రదేశంలో చేసుకోవాల్సి వచ్చింది. కౌన్సిల్ హాలు లేకపోవడంతో ఏజీఅండ్‌ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల హాస్టల్ భవనంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం,చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక జరిగింది. ఎన్నిక, ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపించారు.