srinivasababu
-
జెడ్పీలో సమస్యల ‘కొలువు’
ఖాళీగా డెప్యూటీ సీఈవో, ఏవో పోస్టులు వరుస ఎన్నికలే భర్తీకి అడ్డంకి అదనపు బాధ్యతలతో సీఈవో సతమతం పాలకవర్గం నియామకం అనంతరమే భర్తీ భారీఎత్తున పైరవీలు ! కలెక్టరేట్(మచిలీపట్నం) : జిల్లా పరిషత్ కార్యాలయంలో సమస్యలు తిష్టవేశాయి. జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టులు భర్తీ చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మూడు సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న ఎంపీడీవోలను బదిలీ చేయాలనే ఆదేశాల నేపథ్యంలో ఫిబ్రవరి 25వ తేదీన ఎంపీడీవోలను బదిలీ చేయటంతో అప్పటి వరకు డెప్యూటీ సీఈవోగా ఉన్న జీవీ సూర్యనారాయణ, గణాంకాధికారిగా పనిచేస్తున్న అనూరాధ బదిలీ కావ డంతో అప్పటినుంచి ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 25వ తేదీన జిల్లా పరిషత్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన డి.సుదర్శనం వరుస ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో బిజీ అయ్యారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నియమితులు కావడంతో అక్కడే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం సీఈవో కుమారుడు వివాహం కోసం పది రోజులు సెలవుపై వెళ్లారు. తిరిగి బాధ్యతలు స్వీకరించిన సీఈవో నూతన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. నాలుగు నెలలుగా జెడ్పీ కార్యాలయంలో నెలకొన్న పలు సమస్యలపై దృష్టి సారించేందుకు సీఈవోకు ఖాళీ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైరవీలెన్నో... జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టుల కోసం కొంతమంది ఎంపీడీవోలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల నేపథ్యంలో బదిలీ అయిన ఎంపీడీవోలు తిరిగి జిల్లాలో అదే స్థానంలో రావటంతో డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇన్చార్జ్ సీఈవోగా పనిచేసిన చింతా కళావతి తానే అందరి కంటే సీనియర్ నంటూ ముందుగా ఆమె ప్రయత్నాలు ప్రారంభించారు. సంఘ నాయకుల ఆశీస్సులతో ఈ పోస్టును తానే దక్కించుకుంటానని బందరు ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో అందరికంటే డెరైక్ట్ ఎంపీడీవోలుగా బాధ్యతలు స్వీకరించామని తామే అందరి కంటే సీనియర్ ఎంపీడీవోలమని న్యాయపరమైన పోరాటం చేస్తున్న ఆర్వీఎం పీవో వి.జ్యోతిబసు, ఉయ్యూరు ఎంపీడీవో కృష్ణమోహన్ డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టు కోసం పోటీ పడుతున్నారు. పాలకవర్గం వచ్చిన తరువాతే పోస్టుల భర్తీ: జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రమాణస్వీకారం అనంతరం డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టులను భర్తీ చేస్తామని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి దాసరి సుదర్శనం ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులకు సంబంధించి పీఎఫ్ రుణ దరఖాస్తులు ఇప్పటి వరకు పెండింగ్ లేవని అన్నీ క్లియర్ చేశామని చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో ఉపాధ్యాయుల ఖాతాలకు రుణ మొత్తం జమ అవుతాయన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ ‘జంపాల’
వైస్ చైర్మన్‌గా తుమ్మల ఎంపీ, ఎమ్మెల్యే చర్చలు జయప్రదం తొలగిన ఉత్కంఠ ఉయ్యూరు : ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా జంపాన పూర్ణచంద్రరావు (పూల), వైస్ చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాసబాబు ఎన్నికవడంతో ఉయ్యూరు చైర్మన్ ఎవరనే విషయమై ఇప్పటివరకూ ఉన్న ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది. చైర్మన్గిరీకోసం టీడీపీలోని పలువురు పోటీపడడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ టీడీపీ కౌన్సిలర్లతో పలు దఫాలుగా జరిపిన చర్చలు జయప్రదం కావడంతో పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఐదేళ్లచైర్మన్ పదవీకాలాన్ని మూడు భాగాలుగా విభజించారు. తొలుత జంపాన పూర్ణచంద్రరావు, తరువాత అబ్దుల్ ఖుద్దూస్, షేక్ ఖలీల్ చైర్మన్లుగా కొనసాగేలా నేతలు నిర్ణయించారు. కౌన్సిలర్లుగా ప్రమాణం.. మున్సిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లకుగానూ ఓటింగ్‌కు 19 మంది మాత్రమే హాజరయ్యారు. 8 మంది వైఎస్సార్ సీపీ, 9 మంది టీడీపీ, ఇరువురు స్వతంత్రులు హాజరుకాగా 9వ వార్డు కౌన్సిలర్ తుంగల పద్మ (వైఎస్సార్ సీపీ) గైర్హాజరయ్యారు. సభ్యులందరితో ప్రత్యేక అధికారి పుష్పమణి ప్రమాణస్వీకారం చేయించారు. అడపా ఆదిలక్ష్మి, అబ్దుల్ ఖుద్దూస్, అబ్దుల్ రహీమ్, కోరాడ వెంకటలక్ష్మి, గుంజా రాంబాబు, జంపాన పూర్ణచంద్రరావు, జరీనా భేగం, తుమ్మల శ్రీనివాసబాబు, తోట జ్యోతి, నడిమింటి లక్ష్మి, పండ్రాజు సుధారాణి, పుట్టి రోజామణి, పెనుమూడి వాణి, బాణావత్తు కళ్యాణి, బొబ్బిలి నాగరాజు, వంగవీటి శ్రీనివాసప్రసాద్, షేక్ ఖలీల్, రజియా సుల్తానా, సోలే సురేష్‌బాబులు కౌన్సిలర్లుగా ప్రమాణం చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాజరయ్యారు. ఉత్కంఠకు తెరతీసిన ఛైర్మన్ ఎన్నిక.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగింది. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం పలుమార్లు ఎంపీ కొనకళ్ల, ఎమ్మెల్యే ప్రసాద్ కౌన్సిలర్లతో చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. చైర్మన్‌గా 16వ వార్డు కౌన్సిలర్ జంపాన పూర్ణచంద్రరావు (పూల), వైస్ చైర్మన్‌గా 11వ వార్డు కౌన్సిలర్ తుమ్మల శ్రీనివాసబాబు పేర్లను ఖరారు చేశారు. వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థిగా 18వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రహీమ్ పోటీలో నిలిచారు. పూలను ఎక్స్ అఫీషియో సభ్యులు, ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లతో కలిపి 13 మంది, వైస్ చైర్మన్ తుమ్మలను 12 మంది బలపర్చడంతో మెజార్టీని బట్టి వారిరువురినీ చైర్మన్, వైస్చైర్మన్లుగా ఎన్నికల అధికారి పుష్పమణి ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఉయ్యూరు మున్సిపల్ తొలి కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం ప్రైవేటు ప్రదేశంలో చేసుకోవాల్సి వచ్చింది. కౌన్సిల్ హాలు లేకపోవడంతో ఏజీఅండ్‌ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల హాస్టల్ భవనంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం,చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక జరిగింది. ఎన్నిక, ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపించారు.