‘గులాబీ' నగర్ | district zilla parishad chaiman post trs | Sakshi
Sakshi News home page

‘గులాబీ' నగర్

Published Mon, Jul 7 2014 2:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

‘గులాబీ' నగర్ - Sakshi

‘గులాబీ' నగర్

మారిన జిల్లా రాజకీయ ముఖచిత్రం
- కుదేలైన కాంగ్రెస్
- అడ్రస్ లేని టీడీపీ
- ఉనికి కోసం బీజేపీ

 కరీంనగర్ సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 12 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్.. అదే హవాను స్థానిక సంస్థల్లో కొనసాగించింది. ఈనెల 3, 4, 5 తేదీల్లో వరుసగా జరిగిన పరోక్ష ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. జిల్లాలో 11 మున్సిపాలిటీకు.. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో సహా మెట్‌పల్లి, కోరుట్ల, సిరిసిల్ల మున్సిపాలిటీలు, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి నగరపంచాయతీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. జిల్లాలో 57 జెడ్పీటీసీ స్థానాలకు.. 41 సీట్లను సాధించి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేసింది.

జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, కో-ఆప్షన్ సీట్లను తన ఖాతాలో వేసుకుంది. 57 మండల పరిషత్‌లకు గాను.. 42 ఎంపీపీలను ఏకపక్షంగా గెలుచుకొని జిల్లాను పూర్తిగా గులాబీమయం చేసింది. పలు మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లతో మెజారిటీ లేకున్నా.. అధికార బలంలో పరోక్ష ఎన్నికల్లో సత్తా చాటుకుంది. జిల్లావ్యాప్తంగా ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో మాత్రమే టీఆర్‌ఎస్ వెనుకబడగా, కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది. జగిత్యాల మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని మూడు ఎంపీపీలను కైవసం చేసుకుంది.

నరేంద్రమోడీ హవాతో జాతీయస్థాయిలో అధికారం చేపట్టిన బీజేపీ జిల్లాలో మాత్రం ఉనికి కోసం అపసోపాలు పడుతోంది. ఒక్క జెడ్పీటీసీ, ఒక్క ఎంపీపీ, ఒక్క నగరపంచాయతీ సాధించుకొని ‘నంబర్ వన్’ గా చతికిలపడింది. జిల్లాలో మొన్నటిదాకా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అడ్రసే గల్లంతైంది. కేవలం ఓదెల జెడ్పీటీసీని గెలుచుకున్న ఆ పార్టీ..  ఒక్క మండల పరిషత్‌ను కూడా సొంతం చేసుకోలేక పోయింది. మున్సిపాలిటీల్లో బోణీ కూడా కొట్టని దుస్థితి ఏర్పడింది.

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సొంత జగిత్యాల నియోజకవర్గంలో పూర్తిగా గల్లయింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు సిహెచ్.విజయరమణారావు నియోజకవర్గమైన పెద్దపల్లిలోనూ టీడీపీ కనుమరుగైంది. సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నించినప్పటికీ సొంత పార్టీ ఎంపీటీసీలే షాక్‌నిచ్చి.. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచారు. పెద్దపల్లి నగర పంచాయతీలోనూ కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని టీడీపీ నేతలు తీర్మానిస్తే.. విప్‌ను ధిక్కరించి మరీ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌కు ఓటేశారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల పరిస్థితి దయనీయంగా మారింది.
 
కారు వైపు పరుగులు
అధికార పార్టీ టీఆర్‌ఎస్ తన హవాను కొనసాగిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కారెక్కేందుకు పరుగులు తీస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు మండలి చైర్మన్ ఎన్నికకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థి స్వామిగౌడ్‌కు ఓటేశారు. జిల్లాలో నలుగురు ఎమ్మెల్సీలకు గాను భానుప్రసాద్‌రావు చేరడంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల సంఖ్య మూడుకు చేరింది. కరీంనగర్ కార్పొరేషన్‌లో 14 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలుపొందగా.. ఐదుగురు సీనియర్ కార్పొరేటర్లు గులాబీ గూటికి చేరుకున్నారు.

హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన విజయ్ టీఆర్‌ఎస్‌లో చేరి ఏకంగా చైర్మన్ అయ్యారు. అధికారంలోకి రావడమే తరువాయి.. రాజకీయంగా పట్టు సాధించేందుకు గులాబీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండటంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా కారువైపు పరుగులు పెడుతున్నారు. పలువురు సర్పంచులు, వార్డు సభ్యులు, సింగిల్‌విండో చైర్మన్లు సైతం టీఆర్‌ఎస్‌లో చే రుతున్నారు. దీంతో జిల్లాలో 90 శాతానికి పైగా పదవులు టీఆర్‌ఎస్ ఖాతాలో ఉండడం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement