నల్లధనంపై సిట్ అధిపతిగా జస్టిస్ షా | Justice Shah to head probe panel on black money | Sakshi
Sakshi News home page

నల్లధనంపై సిట్ అధిపతిగా జస్టిస్ షా

Published Fri, May 2 2014 2:43 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

నల్లధనంపై సిట్ అధిపతిగా జస్టిస్ షా - Sakshi

నల్లధనంపై సిట్ అధిపతిగా జస్టిస్ షా

వైస్ చైర్మన్‌గా జస్టిస్ అరిజిత్ పసాయత్ నియామకం
 
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై విచారణ జరిపేందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి(సిట్) చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షాను సుప్రీం కోర్టు గురువారం నియమించింది. అలాగే వైస్‌చైర్మన్‌గా మరో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్‌ను నియమిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఇంతకుముందు సిట్ చైర్మన్‌గా జస్టిస్ (రిటైర్డ్) బీపీ జీవన్‌రెడ్డిని, వైస్ చైర్మన్‌గా జస్టిస్ షాను నియమించడం తెలిసిందే. అయితే జీవన్‌రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఈ బాధ్యతలు చేపట్టేందుకు అశక్తత వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో జస్టిస్ షాను చైర్మన్‌గా నియమిస్తున్నట్టు సుప్రీంకోర్టు తాజాగా ప్రకటించింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనంపై విచారణ జరపడంతోపాటు దానిని దేశంలోకి రప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు అందజేయడానికి ఉద్దేశించి సిట్‌ను ఏర్పాటు చేయడం విదితమే. ఇదిలా ఉండగా జర్మనీకి చెందిన లీషెన్‌స్టీన్‌లోని ఎల్‌ఎస్‌టీ బ్యాంకు లో నల్లధనాన్ని అక్రమంగా దాచినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించిన మొత్తం 26 కేసుల వివరాలతో కూడిన పత్రాలు, ఇతర సమాచారాన్ని పిటిషనర్ రామ్‌జెఠ్మలానీకి మూడురోజుల్లోగా అందజేయాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది.


 వివరాల వెల్లడిపై స్విస్‌లో వ్యతిరేకత
 తస్కరణకు గురైన స్విస్ బ్యాంకుల్లోని ఖాతాదారుల సమాచారం ఆధారంగా నమోదు చేసిన నల్లధనం కేసుల్లో మరిన్ని వివరాలు సమర్పించాలన్న భారత్ విజ్ఞప్తిపై తమ దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని భారత్‌లో స్విట్జర్లాండ్ రాయబారి లినస్ వోన్ కాస్టెల్‌మర్ తెలిపారు. గురువారం ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కాస్టెల్‌మర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అక్రమ నిధుల ఉదంతాలపై తమ దేశం పూర్తి సమాచారం అందించేందుకు వీలుగా నిర్ణీత కాలవ్యవధి ఖరారయ్యే వరకూ భారత్ తమ ను అర్థం చేసుకోవాలని కోరారు. గడిచిన ఐదు, పదేళ్లలో స్విస్ బ్యాంకుల నిబంధనల్లో భారీ మార్పులు వచ్చిన విషయాన్ని గమనించాలని సూచించారు. తస్కరణకు గురైన ఖాతాదారుల సమాచారం గురించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు ఉద్దేశించే బిల్లును గత ఏడాది తమ దేశ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టినా అది నెగ్గలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement