3 లక్షల పైన నగదు లావాదేవీలు బంద్!
• నల్లధనం నిరోధానికి కేంద్రం త్వరలో మరో చర్య!
• సిట్ సిఫారసులకు అనుగుణంగా చర్యలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో నల్లధనం నిరోధానికి సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) సిఫారసుల అమలుపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా రూ.3 లక్షలు పైబడిన నగదు లావాదేవీల నిషేధాన్ని పరిశీలిస్తోంది. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) చైర్‌పర్సన్ రాణి సింగ్ నాయర్ మంగళవారం ఇక్కడ అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు.
వ్యక్తులు, పరిశ్రమలకు సంబంధించి క్యాష్ హోల్డింగ్ మొత్తాన్ని రూ.15 లక్షలుగా కూడా సిట్ సిఫారసు చేసింది. ఇంతకుమించి మొత్తం తమ వద్ద ఉంచుకోడానికి ముందు ఆ ప్రాంత ఆదాయపు పన్ను కమిషనర్ అనుమతి పొందాల్సి ఉంటుంది. నగదు లావాదేవీలపై ఇప్పటికే ఒక శాతం టీసీఎస్ (సోర్స్ వద్ద పన్ను వసూలు)ను ఆదాయపు పన్ను శాఖ అమలు చేస్తోందని, పాన్ వివరాలు తెలపడం తప్పనిసరి చేసిందని అన్నారు. నల్లధనం నిరోధంపై తన ఐదవ నివేదికను జస్టిస్ ఎంజీ షా (రిటైర్డ్) నేతృత్వంలోని సిట్ గత నెలల్లో సుప్రీంకోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే.
ప్రజా సేవనూ అధికారులు అందించాలి...
కాగా పన్నుల శాఖ అధికారులకు సైతం చైర్‌పర్సన్ దిశా నిర్దేశం చేశారు. పన్ను అధికారులంటే కేవలం పన్నులు వసూలు చేయడమే పనిగా ఉండకూడదన్నారు. పన్నులు, తత్సంబంధ అంశాలకు సంబంధించి ప్రజలకు తగిన అత్యుత్తమ సలహాలనూ అందించాలని ఆమె పిలుపునిచ్చారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇదే తరహా విధానం ఉందని పేర్కొన్న ఆమె... పన్నుల శాఖ అధికారులను చూసి ప్రజలు భయపడే ధోరణి పోవాలని అన్నారు. పన్ను చట్టాల అమలు విషయంలో అధికారులు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, పెట్టుబడులకు తగిన ప్రాంతంగా దేశాన్ని తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు.