న్యూఢిల్లీ: దేశ విదేశాల్లో మూలుగుతున్న నల్లధనానికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలిసిన వారు వెంటనే తమకు తెలియజేయాలని.. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆదివారం విజ్ఞప్తి చేసింది. ఇలా ఇచ్చే సమాచారాన్ని అందుకోవడం కోసం త్వరలోనే తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు త్వరలోనే ఒక ప్రకటన జారీ చేయనున్నట్లు బృందం తెలిపింది. ప్రజలు నేరుగా ఈమెయిల్ ద్వారా సమాచారం అందించవచ్చని పేర్కొంది. లేదా సదరు సమాచారాన్ని లేఖ రూపంలో సిట్ కార్యాలయానికి పంపవచ్చని వెల్లడించింది.
కాగా, నల్లధనం కేసుల విచారణ నిమిత్తం స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, యూఏఈ, అమెరికా తదితర దేశాల్లో సీబీఐ అధికారులను నియమించాల్సిన అవసరముందని సిట్‌ను సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా కోరారు.