కఠిన చర్యలు.. పటిష్ట చట్టాలు!
నల్లధనం వ్యాప్తిని అడ్డుకోవడానికి సిట్ సూచన
* క్రికెట్ బెట్టింగుల్లో భారీ బ్లాక్‌మనీ..సెబీ మరింత క్రియాశీలమవ్వాలి
* చెక్కుల ద్వారానే మత సంస్థలు, ఎన్జీవోలు, విద్యాసంస్థలకు విరాళాలు
న్యూఢిల్లీ: దేశంలో నల్లధనం వ్యాప్తిని అరికట్టేందుకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శుక్రవారం ఇచ్చిన తన మూడో నివేదికలో కీలక సూచనలు చేసింది. బ్లాక్‌మనీ వినియోగం విస్తృతంగా ఉన్న రంగాలను ప్రస్తావిస్తూ..
వాటిలో బ్లాక్‌మనీ వినియోగాన్ని అడ్డుకునేందుకు నిర్దిష్ట సూచనలు చేసింది. స్టాక్ మార్కెట్, క్రికెట్ బెట్టింగ్, డొనేషన్స్.. ముఖ్యంగా ఈ మూడు రంగాల్లో నల్లధనం ఏరులై పారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదకర ధోరణిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు, పటిష్టమైన చట్టాలు అవసరమని జస్టిస్(రిటైర్డ్) ఎంబీ షా నేతృత్వంలోని సిట్ తేల్చిచెప్పింది. ఆయా రంగాల్లో నల్లధనం అరికట్టేందుకు సిట్ ఇచ్చిన సూచనలు..
స్టాక్ మార్కెట్
* స్టాక్‌మార్కెట్‌లోకి నల్లధనాన్ని పారించే వారిపై నిషేధంతోపాటు, దాన్ని అరికట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కఠినచర్యలు తీసుకోవాలి. పీ-నోట్స్(పార్టిసిపేటరీ నోట్స్) మార్గంలో మార్కెట్లలోకి వచ్చే విదేశీ నిధుల యజమానులను గుర్తించాలి. ఈ నోట్స్‌ను ఇతరులకు బదిలీ చేసే నిబంధన విదేశీ పెట్టుబడుల రాకను ఎలా సులువు చేస్తోందో గమనించాలి.
* పీ-నోట్స్ ద్వారా వచ్చే పెట్టుబడులు పారదర్శకంగా ఉండే లా చూసేందుకు ఆయా ఇన్వెస్టర్ల వివరాలన్నీ (కేవైసీ) సెబీ దగ్గర కచ్చితంగా ఉండాలి. విదేశీ ఇన్వెస్టర్లు సులభతరంగా భారత సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎంచుకునే మార్గాల్లో పీ-నోట్ కూడా ఒకటి. స్టాక్స్ ధరలు అనూహ్యంగా పెరగడం మరింత దృష్టి పెట్టాలి.
క్రికెట్ బెట్టింగ్
* క్రికెట్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌లు.. ముఖ్యంగా ఐపీఎల్‌లో బెట్టింగుల్లో నల్లధనం పాత్ర చాలా ఎక్కువ. క్రీడల్లో.. ముఖ్యంగా క్రికెట్లో బెట్టింగ్‌ల వల్ల భారీ ఎత్తున నల్లధనం ఏర్పడుతోంది.
* క్రికెట్ బెట్టింగుల్లో నల్లధనం వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కఠిన చట్టాలను రూపొందించాలి.
* అక్రమ బెట్టింగ్.. క్రీడల్లో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్‌లనే అనైతిక చర్యలకు కారణమవుతోంది. అది చివరకు బ్లాక్‌మనీ వ్యాప్తికే ఉపయోగపడ్తుంది.
* ఇంటర్నెట్ వల్ల బెట్టింగ్ విస్తృతయింది. కొన్ని వెబ్‌సైట్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది.
విద్య, మత సంస్థలు.. ఎన్జీవోలు
* విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన సంస్థల కార్యకలాపాల్లో నల్లధనం వ్యాప్తిని అరికట్టేందుకు.. ఆయా సంస్థలు డొనేషన్లను అకౌంట్‌పేయీ చెక్కుల ద్వారానే స్వీకరించేలా నిబంధనలను రూపొందించాలి. అక్రమంగా డొనేషన్లను ఇచ్చేవారిపై, స్వీకరించేవారిపై అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు చేపట్టాలి. డొనేషన్ల ద్వారా నల్లధనం వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన నిబంధనలు రూపొందించాలి.
* విద్యాసంస్థలు, ఎన్జీవోలు, మతపరమైన సంస్థలు స్వీకరించే విరాళాలను పన్ను పరిధిలోకి తీసుకురావాలి. కొన్ని ప్రముఖ విద్యా సంస్థలు భారీ మొత్తాల్లో డొనేషన్లు స్వీకరిస్తుంటాయి. అవి నగదు రూపంలో డొనేషన్లు తీసుకోవడం వల్ల బ్లాక్‌మనీ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.