కుర్చీ రెడీ
సాక్షి, ఏలూరు:పురపాలక ఎన్నికల్లో విజయం వరించినా.. పదవి చేపట్టే ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు గురువారం నెరవేరనున్నాయి. ‘పుర’ పాలకవర్గాల ప్రమాణ స్వీకారాన్ని వైభవంగా నిర్వహించేందుకు గెలుపొందిన అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, తణుకు, కొవ్వూరు పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.
291 మంది ప్రమాణ స్వీకారం
పుర, నగరపాలక సంఘాల్లో 291 వార్డు/కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. వాటిలో 217 మంది టీడీపీ అభ్యర్థులు, 56 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఐదుగురు బీజేపీ, 12 మంది స్వతంత్రులు, ఒక సీపీఎం అభ్యర్థి గెలుపొందారు. వీరంతా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్, చైర్మన్ ఎంపిక జరుగుతుంది. ఆ వెంటనే డెప్యూటీ మేయర్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. ఈ పదవుల కోసం టీడీపీ నేతలు క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ తరఫున గెలుపొందిన వారిని పొరుగు జిల్లాలకు తరలించి సకల సదుపాయాలు కల్పించారు. వారందరినీ నేరుగా పురపాలక, నగరపాలక కార్యాలయూలకు తీసుకువచ్చి తమకు అనుకూలమైన వ్యక్తిని ఎన్నుకునేలా ఏర్పాట్లు చేశారు.
పీఠాలు వీరికే!
నగర మేయర్, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థులను టీడీపీ దాదాపుగా ఖరారు చేసింది. వారికే ఓటు వేయాలని విప్ జారీ చేసింది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ పదవి ఈసారి బీసీ మహిళను వరిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ ముజుబూర్ రెహమాన్ భార్య షేక్ నూర్జహాన్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్‌ను చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించారు. భీమవరంలో కొటికలపూడి గోవిందరావు(చినబాబు)ను ఎంపిక చేశారు. పాలకొల్లులో వల్లభు నారాయణమూర్తి, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి బంగారు శివలక్ష్మి, నిడదవోలుకు బొబ్బా కృష్ణమూర్తిని ఎంపిక చేశారు. నరసాపురంలో ఎమ్మెల్యే, ఎంపీలు కూడా ఓటు వేయనున్నారు. ఇక్కడ పసుపులేటి రత్నమాల చైర్మన్ కావాలనుకుంటున్నారు. కొవ్వూరులో సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), జొన్నలగడ్డ రాధారాణిలకు చైర్మన్ పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుతున్నారు. తణుకులోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ దొమ్మేటివెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు చెరో రెండున్నరేళ్లు పీఠంపై కూర్చోనున్నారు. నరసాపురంలో పసుపులేటి రత్నమాల చైర్మన్ పదవికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ప్రమాణ స్వీకారం చేయనున్న సభ్యుల సంఖ్య .. పార్టీల వారీగా
ఏలూరు (50 వార్డులు )
టీడీపీ 41, వైఎస్సార్ సీపీ 8, ఇండిపెండెంట్ 1
తాడేపల్లిగూడెం (35 వార్డులు)
టీడీపీ 24, వైఎస్సార్ సీపీ 7, బీజేపీ 1, సీపీఐ 1,
ఇండిపెండెంట్లు 2
పాలకొల్లు (31 వార్డు)
టీడీపీ 25, వైఎస్సార్ సీపీ 5, ఇండిపెండెంట్ 1
నరసాపురం (31 వార్డులు)
టీడీపీ 14, వైఎస్సార్ సీపీ 14, ఇండిపెండెంట్లు 3
నిడదవోలు (28 వార్డులు)
టీడీపీ 18, వైఎస్సార్ సీపీ 9, బీజేపీ 1
కొవ్వూరు (23 వార్డులు)
టీడీపీ 21, ఇండిపెండెంట్లు 2
తణుకు (34 వార్డులు)
టీడీపీ 32, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1
భీమవరం (39 వార్డులు)
టీడీపీ 26, వైఎస్సార్ సీపీ 11, బీజేపీ 2
జంగారెడ్డిగూడెం (20 వార్డులు)
టీడీపీ 16, వైఎస్సార్ సీపీ 2, ఇండిపెండెంట్లు 2