
ఉలిక్కిపడ్డ ముచ్చుమర్రి
నందికొట్కూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ దారుణ హత్య
పదేళ్లుగా కర్నూలులోనే నివాసం
కాపుకాసి కడతేర్చిన ప్రత్యర్థులు
మృతుడు గతంలో బెరైడ్డి ప్రధాన అనుచరుడు
హత్యతో నిర్మానుష్యమైన గ్రామం
జూపాడుబంగ్లా/పగిడ్యాల న్యూస్‌లైన్: నందికొట్కూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ సాయిఈశ్వరుడుక(55) హత్యోదంతంతో ఆయన స్వగ్రామమైన ముచ్చుమర్రి ఉలిక్కిపడింది. శని వారం సాయంత్రం కర్నూలు నగరం రెవెన్యూ కాలనీలోని ఇంటి నుంచి శకుంతల కల్యాణ మం డపం వద్దకు నడుచుకుంటూ వస్తుండగా కాపుకాసిన ప్రత్యర్థులు వేటకొడవళ్లు, గండ్ర గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు.
తెలుగు మల్లమ్మ, బాలన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు, సాయి ఈశ్వరుడు సంతానం. గ్రామంలో వీరికి 10 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న ఈశ్వరుడు కొంతకాలం గ్రామ డీలర్‌గా ఉన్నారు. ఇతనికి భార్యతో పాటు ఓ కుమార్తె, ఇరువురు కుమారులు సంతానం.
2002 సంవత్సరానికి ముందు ఈయన గ్రామంలో ఓ సామాన్య వ్యక్తి. గ్రామంలో ఆధిపత్య పోరుకు ఆకర్షితుడై 1989లో ప్రస్తుత రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి వర్గంలో చేరాడు. క్రమేణా ఆయనకు కుడిభుజంగా ఎదిగాడు. బెరైడ్డి శేషశయనారెడ్డితో తలెత్తిన మనస్పర్థలతో జూన్ 13, 2002న సాయి ఈశ్వరుడిపై జరిగిన దాడిలో ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డాడు.
అప్పట్లో బెరైడ్డి శేషశయనారెడ్డితో పాటు నాగరాజు, మద్దిలేటి, ఎలిమ క్రిష్ణయ్య, హనుమన్న, బోయ శివన్న, కుంటి రేవన్నలపై ముచ్చుమర్రి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు నాలుగేళ్ల క్రితం కోర్టులో కొట్టేశారు. ఆ దాడి అనంతరం సాయి ఈశ్వరుడు గౌరు వర్గంలో చేరి ముచ్చుమర్రికి దూరంగా కర్నూలులోని రెవెన్యూ కాలనీలో నివాసం ఏర్పర్చుకున్నాడు.
ఈ మార్పుతో గ్రామంలోని ఆయన ఇంటిని ప్రత్యర్థులు ధ్వసం చేశారు. పదేళ్లుగా కర్నూలులో ఉంటున్న ఈయన తన పొలాన్ని రంగడు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు. కౌలుదారునిపైనా గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల దాడి చేసి గాయపర్చారు. బాధితుని ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
2004లో గౌరు వర్గంలో చేరిన సాయి ఈశ్వరుడు.. 2009 ఎన్నికల్లో లబ్బి వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం ఆయన వెంట నడిచాడు. ఈ నేపథ్యంలో 2013లో నందికొట్కూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్నాడు. ముఖ్యమైన పని ఉంటే తప్ప ఆయన నందికొట్కూరుకు వచ్చేవాడు కాదని తెలుస్తోంది.
సాయి ఈశ్వరుడి హత్యతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని గ్రామస్తులు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడంతో వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి. ముందుజాగ్రత్తగా గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.