న్యూడిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆర్థిక సలహాదారుగా ఉన్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ నెలాఖరుకు వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
ప్రభుత్వ ప్రధాన విధాన థింక్ ట్యాంక్ లో కీలకంగా ఉన్న పనాగరియా రాజీనామా ప్రభుత్వానికి పెద్ద షాక్ అని ఎనలిస్టులు అభిప్రాయపడ్డారు. పానగారియా రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించారు. మరోవైపు రాజీనామా అనంతరం పనాగరియా న్యూయార్క్ కొలంబియా విశ్వవిద్యాలయానికి తిరిగి వెళ్లనున్నారు. అక్కడ తన బోధనను కొనసాగించనున్నారు.
విలేఖరులతో మాట్లాడిన పనాగరియా కొలంబియా యూనివర్సిటీ తనకు మరింత పొడిగింపు ఇవ్వడం లేదని అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తనను రిలీవ్ చేయాల్సిందిగా ప్రధానిని కోరినట్టు తెలిపారు. ఆగస్టు 31 న తాను నీతి ఆయోగ్‌ను వీడే అవకాశం ఉందనే ఆశాభావాన్ని వ్యక‍్తం చేశారు. అలాగే ఈ వయసులో యూనివర్శిటీలో తాను చేస్తున్న పని చాలా కష్టం కావచ్చని పానాగారియా వ్యాఖ్యానించారు.
కాగా భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా పేరు యొక్క సంక్షిప్త రూపమే నీతి ఆయోగ్. ఇండియన అమెరికన్ ఎకనమిస్ట్ అయిన పనాగరియా కొలంబియా యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2015లో పనాగరియా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా నియమి తులయ్యారు. 2012 లో దేశీయ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నారు.