నర్సీపట్నంలో పచ్చ మూకల అమానుషం
పూర్వ మహిళా వలంటీర్‌పై పాశవికంగా దాడి
జుత్తుపట్టుకొని లాక్కొచ్చి, దుస్తులు చించేసిన అయ్యన్న అనుచరులు
ఎన్నికల్లో చురుగ్గా పనిచేశారన్న కోపంతో దుశ్చర్య
నిందితులు రెడ్డిసాయి, రెడ్డి రాజేష్ గంగాధర్‌లపై పోలీసులకు ఫిర్యాదు
ఏరియా ఆస్పత్రిలో బాధితురాలికి వైద్యం
రాత్రి వేళ జుత్తు పట్టుకొని లాక్కొచ్చారు.. కాళ్లతో తన్నుకుంటూ.. తాకరాని చోట తాకుతూ.. దుస్తులు చింపేశారు. అడ్డు వచ్చిన వారిని గాయపరిచారు. ఫోన్లు, ఒంటిపైనున్న బంగారు వస్తువులు లాక్కెళ్లారు. నర్సీపట్నంలో ఒంటరి మహిళపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచరులు జరిపిన దాష్టీకమిది. వలంటీర్‌గా సేవలందించడమే ఆమె చేసిన పాపమట.. వలంటీర్ వ్యవస్థను ఎన్నికల ప్రక్రియకు దూరం చేయడంతో రాజీనామా చేయడమే ఆమె తప్పట.. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున పనిచేయడమే ఆమె దోషమట.. అందుకే దుశ్శాశనుల్లా ఆమెను ఈడ్చుకొచ్చారు. వివస్త్రను చేశారు. ఈ ఘటనతో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంది. గాంధీ గారి దేశంలో గజానికో గాంధారి కొడుకు తయారయ్యాడని.. వారికి అడ్డుకట్ట వేసేందుకు దశ ‘దిశ’ నిర్దేశించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నా.. ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నవారన్నా ఎందుకంత కక్ష, కార్పణ్యం అని ప్రశ్నిస్తోంది.
విశాఖ సిటీ : వలంటీర్లంటే వారికి ఒళ్లు మంట. సేవలతో ప్రజలకు దగ్గరవుతున్నారని, సీఎం జగన్ ప్రతినిధులుగా ప్రజలు వారిని ప్రేమిస్తున్నారని ద్వేషం. వారి వల్ల రాజకీయంగా తాము బలహీనపడుతున్నామని కడుపు మంట. అందులో మహిళా వలంటీరంటే మరింత చులకన. అందుకే నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో పూర్వ వలంటీర్ పొలమూరి రాజకుమారిపై మంగళవారం రాత్రి అయ్యన్నపాత్రుడి అనుచరులు కీచకపర్వానికి తెగబడ్డారు. రాజకుమారికి భర్త లేడు. 13 ఏళ్ల కుమారుడితో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వలంటీర్‌గా చేరారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా మనసారా సేవలందించారు. చంద్రబాబు అండ్ కో ఫిర్యాదులతో వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం పెట్టమన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనస్తాపం చెంది రాజీనామా చేశారు. ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించారు. పోలింగ్ రోజున ఓటర్లకు స్లిప్‌లు రాసిచ్చి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పని చేయడం టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడి అనుచరులకు మింగుడు పడలేదు. అదే గ్రామానికి చెందిన టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ అనుచరులు రెడ్డి రాజేష్, రెడ్డి సత్యనారాయణ, కామిరెడ్డి శివ, సుకల రాజే‹Ùతో పాటు మరికొందరు రాజకుమారిని టార్గెట్ చేశారు.
తప్పిన ప్రాణాపాయం
పోలింగ్ మరుసటి రోజు మంగళవారం రాత్రి రాజకుమారి పడుకునేందుకు తన 13 ఏళ్ల కుమారుడిని వెంట పెట్టుకొని అదే గ్రామంలో ఉన్న అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో టీడీపీ మూకలు రెడ్డి రాజేష్ రెడ్డి సత్యసాయి, కామిరెడ్డి శివ, సుకల రాజేష్ పెట్ట గంగాధర్, అల్లు రాజు, వానపల్లి రాజేష్, సొర్ల రఘు, నందిపల్లి బోయిల నాయుడు వారి ఇంటి మీదకు ఎగబడ్డారు. రాజకుమారిపై దాడి చేశారు. వారి చర్యలను ఆమె సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేందుకు ప్రయతి్నంచడంతో ఆమె చేతిలో ఉన్న మొబైల్‌ను లొక్కొని జుట్టు పట్టుకొని బయటకు లాక్కొచ్చారు. ఛాతి మీద చేయి వేసి విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఆమె ఒంటి మీద బట్టలను చించేసి వివస్త్రను చేశారు.
మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. రాజకుమారిపై దాడిని అడ్డుకోవడానికి స్థానిక యువకులు, మహిళలు ప్రయత్నించారు. టీడీపీ నేతలు వారిపై కూడా దాడి చేసి గాయపరిచారు. దీంతో ఒమ్మి గోవింద, గజ్జల గోపీచంద్, వియ్యపు వరహాలు, గుమ్మిడి సీతమ్మలకు కూడా గాయాలయ్యాయి. రాజకుమారిని రక్షించడానికి ప్రయత్నించిన వృద్ధురాలు సీతమ్మ చెంపపై గట్టిగా కొట్టి ఆమె బంగారు చెవి దుద్దులు లాక్కొని వెళ్లిపోయారు. ఒంటరిగా ఉంటే చంపేసే వారని, అమ్మ వాళ్ల ఇంటి వద్ద ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డానని రాజకుమారి చెప్పారు. ఈ ఘటనపై ఆమె నర్సీపట్నం రూరల్ పోసులకు ఫిర్యాదు చేసి, తనకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు దాడికి పాల్పడిన వారిపై 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment