
వైస్ చైర్మన్ పదవి కోసం బరితెగింపు
పిడుగురాళ్ల/నరసరావుపేట: ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కూడా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ వారే ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ పదవికి ఎన్నిక నిర్వహించనుంది.
తొలుత ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిలర్లను లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో మరుసటి రోజు అంటే 4కి వాయిదా పడింది. అయితే ఆ రోజు కూడా ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. తిరిగి ఈనెల 17న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 30 వార్డు కౌన్సిలర్ ఉన్నం ఆంజనేయులును టీడీపీ నేతలు లోబరుచుకుని మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. మిగతా వారిలో 20 మందిని టార్గెట్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నారు.
ఈ 20 మందిని శనివారం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలోకి చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14వ వార్డు కౌన్సిలర్ పులి బాలకాశిని గురువారం రాత్రి పోలీసులు తీసుకు వెళ్లారని ఆయన భార్య రమణ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను కాపాడాలని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులను తట్టుకోలేక 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మున్నీరా ఆమె భర్త షేక్ సైదావలి అజ్ఞాతంలో వెళ్లారు.
వీరిని బయటకు రప్పించడం కోసం పోలీసులు సైదావలి సోదరుడు సుభానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సైదావలి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం 23వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్రీరంగ రజని భర్త జూలకంటి శ్రీనివాసరావును పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్లి వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి మారాలని వేధించినట్లు వారు తెలిపారు.
13వ వార్డు కౌన్సిలర్ షేక్ సమీరా ఆమె భర్త షేక్ కరిముల్లాను కూడా బెదిరించారు. టీడీపీ నాయకులు, పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక తాను కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసి, ఇంత వరకు అందుబాటులోకి రాలేదు. టీడీపీ నేతలు ఇంతగా బరితెగించడం దారుణమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల దన్నుతో బరితెగింపు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసుల దన్నుతో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, బెదిరించడం ద్వారా ఈ నెల 17న జరగబోయే ఎన్నికను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment