కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: చిన్నారులను జీవితాంతం నరకయాతనకు గురిచేసే పోలియో మహమ్మారిని సమాజం నుంచి తరిమేయాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించనున్న మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ మీదుగా రాజ్‌విహార్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ పల్స్‌పోలియో వ్యాక్సిన్ వేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు.
జిల్లాలో నాలుగేళ్లుగా ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, ఇకపై కూడా నమోదు కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులతో పాటు ప్రోగ్రామ్ అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వై.నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 5,05,576 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్‌పోలియో వ్యాక్సిన్ వేసేందుకు 6,60,000 డోసుల వ్యాక్సిన్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. 19న 2,735 కేంద్రాల ద్వారా చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. పల్స్‌పోలియో కేంద్రాలతో పాటు బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, తండాలు, గిరిజన ప్రాంతాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 15 మంది జిల్లా అధికారులతో పాటు 13 మంది ప్రోగ్రామ్ అధికారులు, 20 మంది ఎస్‌పీహెచ్‌వోలు, 85 మంది మెడికల్ ఆఫీసర్లు, 273 మంది సూపర్‌వైజర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారన్నారు.
20, 21వ తేదీల్లో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని, కర్నూలు కార్పొరేషన్‌లో 22వ తేదీన కూడా కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. ర్యాలీలో అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ యు.రాజాసుబ్బారావు, జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు, డీఐవో డాక్టర్ అనిల్‌కుమార్, మలేరియా నియంత్రణాధికారి హుసేన్‌పీరా, మాస్ మీడియా అధికారిణి రమాదేవి, డిప్యూటీ డెమో లక్ష్మీనర్సమ్మ, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, సంక్షేమ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.
పోలియో మహమ్మారిని తరిమేద్దాం
Published Sun, Jan 19 2014 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement