
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ వైద్య సేవ లలో మరో ముందడుగు పడింది. అమ్మ ఒడి (102 సేవలు) విస్తరణ, కొత్తగా ద్విచక్ర అంబులెన్సులు, ఏఎన్‌ఎంలు వినియోగించే ద్విచక్ర వాహనాల (వింగ్స్) సేవలను సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా అమలవుతున్న జననీ సురక్ష యోజన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పు అయిన మహిళను, శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడం లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. 2016 డిసెంబర్ 28న రాష్ట్రంలో అమ్మ ఒడి సేవలను ప్రారంభించారు. మొదటి దశలో 41 వాహనాలతో సేవలు మొదలయ్యాయి.
జీవీకే ఈఎంఆర్‌ఐ భాగస్వామ్యంతో 102 వాహనాలకు విస్తరించింది. అయితే 12 జిల్లాల్లోనే ఈ సేవలను కొనసాగిస్తున్నారు. మిగతా జిల్లాల్లోనూ ఈ పథకం అమలుకు కొత్తగా 200 వాహనాలను కొనుగోలు చేశారు. ఈ వాహనాల సేవలు బుధవారం ప్రారంభం కానున్నాయి. అలాగే అత్యవసర సమయాల్లో వేగంగా రోగుల దగ్గరకు వెళ్లేందుకు వినియోగించే ద్విచక్ర అంబులెన్స్ సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ సేవల కోసం 50 వాహనాలను కొనుగోలు చేశారు. మరోవైపు గ్రామీణ ఆరోగ్య సేవలలో కీలకమైన ఏఎన్‌ఎంల కోసం తక్కువ ధరతో ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయించనున్నారు. ఈ వాహనాలను సైతం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఏఎన్‌ఎంలకు పంపిణీ చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది.