ప్రభుత్వ హెచ్చరికతో 166 ఆసుపత్రుల్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల తీరుపై ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో అనేక నెట్‌వర్క్ ఆసుపత్రులు చిన్నగా సమ్మె నుంచి బయటకు వస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పేదల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీని ఇష్టారాజ్యంగా సమ్మె పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
దీంతో కొన్ని ఆసుపత్రులు రాజీ ధోరణికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 244 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులుంటే వాటిల్లో 166 ఆసుపత్రుల్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుతున్నాయని... మిగిలిన 78 మాత్రమే సమ్మె చేస్తున్నాయని ఆరోగ్యశ్రీ సీఈవో చంద్రశేఖర్ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొనే 78 ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి కార్యాలయం తెలిపింది.
అత్యధికంగా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న నెట్‌వర్క్ ఆసుపత్రులే సమ్మెలో ఉన్నాయని చెబుతున్నారు. ఇదిలావుంటే నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిపడిన సొమ్ములో సోమవారం రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం... మంగళవారం మరో రూ.130 కోట్లకు బీఆర్వో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని వైద్య ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.
దిగివచ్చిన ప్రైవేటు ఆసుపత్రులు
Published Wed, Oct 5 2016 2:47 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
Advertisement
Advertisement