ఎంపిక మార్గదర్శకాల నిమిత్తం వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం!
3 కోట్ల మందికి ఈ పథకం వర్తించేలా ప్లాన్?
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ కార్డుల ఎంపికకు మార్గదర్శకాల తయారీ కోసం త్వరలోనే ఒక కమిటీని నియమించాలని వైద్య ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎవరిని అర్హులుగా ఎంపిక చేయాలి? పాత కార్డుల అప్డేట్, కొత్త పేర్ల ఎంట్రీ, సవరణలు వంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. దీంతోపాటు రేషన్ కార్డుతో లింక్ కట్ చేస్తూ అందరికీ స్కీమ్ వర్తించేలా నిబంధనలు ఎలా ఉండాలనే అంశాలపై ఈ కమిటీ స్పష్టమైన మార్గదర్శకాలను తయారు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి తర్వాత ఈ కమిటీ ఏర్పాటుపై స్పష్టత రానుంది.
రేషన్ కార్డునే పరిగణనలోకి తీసుకోకుండా..
ప్రభుత్వం హామీయిచ్చినట్లు రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకోకుండా బీపీఎల్ కుటుంబాలను ఆదాయ ధ్రువీకరణ పత్రం ద్వారా గుర్తిస్తూనే, క్షేత్రస్థాయి కమిటీ ద్వారా విచారణ చేయించనున్నారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఏమిటి వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ఆరా తీయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల పైచిలుకుమంది ఆరోగ్య శ్రీ కార్డుల కోసం ఎదురుచూస్తుండగా, మరో 11 లక్షల దరఖాస్తులు మెంబర్ అడిషన్ (అదనపు సభ్యులు చేర్పులు) కోసం పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే కార్డులు ఉన్నోళ్లకు అప్డేట్ చేస్తూనే, కొత్త కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇప్పుడు 89.96 లక్షల కుటుంబాలకు మళ్లీ కొత్త కార్డులు ఇస్తూనే, ఇప్పటి వరకు అసలు పొందని వాళ్లకీ ఆరోగ్య శ్రీ కార్డులు అందజేయనున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 3 కోట్ల మందికి ఈ స్కీమ్ వర్తించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి ప్రతి ఏటా దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు అవుతుండగా, కొత్త కార్డుల ద్వారా మరో రూ.నాలుగైదు వందల కోట్ల వరకు ఖర్చు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్త రేషన్ కార్డులపై ఉప సంఘం ఏర్పాటు
చైర్మన్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించే ఈ ఉప సంఘంలో సభ్యులుగా మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కన్వీనర్‌గా ప్రభుత్వ కార్యదర్శి హోదాలో పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ వ్యవహరిస్తారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఎలాంటి మార్గదర్శకాలను అమలు చేయాలనే అంశంతో పాటు అర్హుల ఎంపిక ఏ ప్రాతిపదికన చేయాలనే విషయాన్ని ఈ సబ్ కమిటీ నిర్ణయిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment