ఆరోగ్యశ్రీ నిలిపి వేసినట్టు మంగళవారం ఓ ఆస్పత్రి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
- రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వి.రామిరెడ్డి వనస్థలిపురంలో ఉంటున్నారు. ఆయనకు మంగళవారం ఉద యం చాతి నొప్పి వచ్చింది. అది గుండెపోటా? సాధారణ నొప్పా? అర్థంకాలేదు. దీంతో సమీపంలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రికి వెళ్లారు. తన వద్ద ఉన్న ఈజేహెచ్‌ఎస్ కార్డును చూపించారు. ఈ పథకం కింద సేవలను నిలిపివేశామని, డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తామని చెప్పడంతో అప్పటికప్పుడు రూ. 20 వేలు చెల్లించి ఆసుపత్రిలో చేరారు.
- వరంగల్ పట్టణానికి చెందిన ఆర్.వెంకటమ్మ మంగళవారం ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని నెట్‌వర్క్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
సాక్షి, హైదరాబాద్ : ఇలా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్ పథకం సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం నుంచి ఓపీ, డయాగ్నోస్టిక్, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇన్‌పేషెంట్ సేవల్ని నిలిపివేస్తామని నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు నోటీసులు కూడా ఇచ్చింది. రూ. 1,200 కోట్ల మేరకు బకాయిలు తీర్చడంలోనూ, చర్చలు జరపడంలోనూ సర్కారు విఫలం కావడంతో మంగళవారం ఉదయం నుంచి నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు అనేక ఆసుపత్రుల వద్ద ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టారు. దీంతో కొందరు పేదలు, ఉద్యోగులు డబ్బులు చెల్లించి వైద్యం పొందగా, మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు పరుగులు తీశారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు కిటకిటలాడాయి.
232 ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత...
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్ సేవలు అందించేందుకు 236 ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు, 96 ప్రభుత్వ నెట్‌వర్క్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులూ ఉన్నాయి. దీనికితోడు మరో 67 డెంటల్ నెట్‌వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అయితే ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రం డెంటల్ వైద్య సేవలు అందవు. కేవలం ఈజేహెచ్‌ఎస్ రోగులకు మాత్రమే డెంటల్ సేవలు అందజేస్తారు. అంటే రాష్ట్రంలో డెంటల్‌తో కలిపి ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు 303 ఉన్నాయి. అందులో మంగళవారం 232 ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయినట్లు నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం తెలిపింది. అందులో హైదరాబాద్‌లో 66, వరంగల్ జిల్లాలో 34, రంగారెడ్డిలో 32, మేడ్చల్‌లో 27, నిజామాబాద్‌లో 14, కరీంనగర్ జిల్లాలో 13, ఖమ్మంలో 10, మహబూబ్‌నగర్‌లో 8, నల్లగొండలో 6, సంగారెడ్డిలో 5, సిద్దిపేట, జగిత్యాలలో 4, నిర్మల్‌లో 2, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒకటి చొప్పున నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వారితో పాటు 5.6 లక్షల మంది ఉద్యోగులు, 25 వేల మంది జర్నలిస్టులకు ఈ 303 ఆసుపత్రులు సేవలు అందిస్తాయి. ప్రతి రోజు 10 వేల మంది ఔట్‌పేషెంట్లు, 3 వేల మంది ఇన్ పేషెంట్ల ఆరోగ్యశ్రీ రోగులు వస్తుంటారు. ఇప్పుడు ఔట్ పేషెంట్ల సేవలనే నిలిపివేశారు. అలాగే వైద్య పరీక్షలకు కూడా బ్రేక్ పడింది. ఇక ఉద్యోగులు వెల్‌నెస్ సెంటర్లకు వెళ్లగా, అక్కడ చికిత్సకాని వారికి ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేశారు. ‘ప్రైవేటు’కు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.
నిర్లక్ష్యంగా అధికారుల తీరు...
వైద్య ఆరోగ్యశాఖ తీరు తీవ్ర నిర్లక్ష్యంగా ఉంది. ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్ సేవలు పాక్షికంగా నిలిచిపోయినా ఏమాత్రం పట్టించుకోలేదు. బకాయిలు పేరుకుపోయి రెండు మూడేళ్లలో 12 ఆసుపత్రులు మూతపడినా అధికారులు పట్టించుకోవడం లేదని నెట్‌వర్క్ ఆసుపత్రులు విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారులు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. లక్ష్మారెడ్డి ఆపద్ధర్మ మంత్రి కావడంతో అధికారులే అంతా చూసుకోవాల్సి ఉన్నా మనకు పోయేదెముంది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాగా, డబ్బులిచ్చి వైద్యం చేయించుకున్నా రీయింబర్స్‌మెంట్ బిల్లులు పాస్ కావడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా రాష్టవ్యాప్తంగా రూ. 50 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment