EJHS Scheme
-
ఓపీ, డయాగ్నోస్టిక్ సేవలు నిలిపివేత..
రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వి.రామిరెడ్డి వనస్థలిపురంలో ఉంటున్నారు. ఆయనకు మంగళవారం ఉద యం చాతి నొప్పి వచ్చింది. అది గుండెపోటా? సాధారణ నొప్పా? అర్థంకాలేదు. దీంతో సమీపంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్లారు. తన వద్ద ఉన్న ఈజేహెచ్ఎస్ కార్డును చూపించారు. ఈ పథకం కింద సేవలను నిలిపివేశామని, డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తామని చెప్పడంతో అప్పటికప్పుడు రూ. 20 వేలు చెల్లించి ఆసుపత్రిలో చేరారు. వరంగల్ పట్టణానికి చెందిన ఆర్.వెంకటమ్మ మంగళవారం ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని నెట్వర్క్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాక్షి, హైదరాబాద్ : ఇలా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ పథకం సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం నుంచి ఓపీ, డయాగ్నోస్టిక్, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇన్‌పేషెంట్ సేవల్ని నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు నోటీసులు కూడా ఇచ్చింది. రూ. 1,200 కోట్ల మేరకు బకాయిలు తీర్చడంలోనూ, చర్చలు జరపడంలోనూ సర్కారు విఫలం కావడంతో మంగళవారం ఉదయం నుంచి నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు అనేక ఆసుపత్రుల వద్ద ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టారు. దీంతో కొందరు పేదలు, ఉద్యోగులు డబ్బులు చెల్లించి వైద్యం పొందగా, మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు పరుగులు తీశారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు కిటకిటలాడాయి. 232 ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత... రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ సేవలు అందించేందుకు 236 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు, 96 ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులూ ఉన్నాయి. దీనికితోడు మరో 67 డెంటల్ నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అయితే ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రం డెంటల్ వైద్య సేవలు అందవు. కేవలం ఈజేహెచ్ఎస్ రోగులకు మాత్రమే డెంటల్ సేవలు అందజేస్తారు. అంటే రాష్ట్రంలో డెంటల్‌తో కలిపి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు 303 ఉన్నాయి. అందులో మంగళవారం 232 ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయినట్లు నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం తెలిపింది. అందులో హైదరాబాద్‌లో 66, వరంగల్ జిల్లాలో 34, రంగారెడ్డిలో 32, మేడ్చల్‌లో 27, నిజామాబాద్‌లో 14, కరీంనగర్ జిల్లాలో 13, ఖమ్మంలో 10, మహబూబ్‌నగర్‌లో 8, నల్లగొండలో 6, సంగారెడ్డిలో 5, సిద్దిపేట, జగిత్యాలలో 4, నిర్మల్‌లో 2, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒకటి చొప్పున నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వారితో పాటు 5.6 లక్షల మంది ఉద్యోగులు, 25 వేల మంది జర్నలిస్టులకు ఈ 303 ఆసుపత్రులు సేవలు అందిస్తాయి. ప్రతి రోజు 10 వేల మంది ఔట్పేషెంట్లు, 3 వేల మంది ఇన్ పేషెంట్ల ఆరోగ్యశ్రీ రోగులు వస్తుంటారు. ఇప్పుడు ఔట్ పేషెంట్ల సేవలనే నిలిపివేశారు. అలాగే వైద్య పరీక్షలకు కూడా బ్రేక్ పడింది. ఇక ఉద్యోగులు వెల్నెస్ సెంటర్లకు వెళ్లగా, అక్కడ చికిత్సకాని వారికి ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేశారు. ‘ప్రైవేటు’కు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. నిర్లక్ష్యంగా అధికారుల తీరు... వైద్య ఆరోగ్యశాఖ తీరు తీవ్ర నిర్లక్ష్యంగా ఉంది. ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ సేవలు పాక్షికంగా నిలిచిపోయినా ఏమాత్రం పట్టించుకోలేదు. బకాయిలు పేరుకుపోయి రెండు మూడేళ్లలో 12 ఆసుపత్రులు మూతపడినా అధికారులు పట్టించుకోవడం లేదని నెట్వర్క్ ఆసుపత్రులు విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారులు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. లక్ష్మారెడ్డి ఆపద్ధర్మ మంత్రి కావడంతో అధికారులే అంతా చూసుకోవాల్సి ఉన్నా మనకు పోయేదెముంది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాగా, డబ్బులిచ్చి వైద్యం చేయించుకున్నా రీయింబర్స్మెంట్ బిల్లులు పాస్ కావడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా రాష్టవ్యాప్తంగా రూ. 50 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. -
ఆరోగ్యమస్తు..
► ‘కార్పొరేట్’లో ఉద్యోగులు, జర్నలిస్టులకు ఏడాదికోసారి ఉచితంగా వైద్య పరీక్షలు ►దీర్ఘకాలిక రోగులకు నెలవారీగా ఉచితంగా మందులు ►700 రకాల బ్రాండెడ్ మందులు అందించే యోచన ► వైద్యం కోసం ముందుగా రిఫరల్ ఆసుపత్రులకు... ► అక్కడ్నుంచి పై ఆసుపత్రులకు రిఫర్ చేస్తేనే కార్పొరేట్ చికిత్స ► అత్యవసర సమయాల్లో మాత్రం నేరుగా వెళ్లేందుకు వెసులుబాటు వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం ► వచ్చేనెల నుంచే ఈజేహెచ్ఎస్ పథకం అమలుకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఏడాదికోసారి ప్రైవేటు, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎగ్జిక్యూటివ్ ప్యాకేజీ కింద ఉచితంగా సమగ్ర వైద్య పరీక్షలు (మాస్టర్ హెల్త్ చెకప్) నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే శస్త్రచికిత్సలు చేయించుకున్న, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నెలవారీగా ఉచితంగా బ్రాండెడ్ ఔషధాలు అందజేయనుంది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్)లో ఈ సదుపాయాలను చేర్చనుంది. వచ్చేనెల నుంచి ఈ పథకాన్ని పక్కాగా అమల్లోకి తీసుకొస్తామని ఈజేహెచ్‌ఎస్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం జనరిక్ మందులను సరఫరా చేస్తున్నామని, అవి కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదన్నారు. ఇక నుంచి బ్రాండెడ్ ఔషధాలను సరఫరా చేసేలా హైదరాబాద్‌లోని అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈజేహెచ్ఎస్ పథకంలోని వ్యాధులకు ఇవ్వాల్సిన మొత్తం 700 రకాల మందులను బ్రాండెడ్వే అందించనున్నారు. అందుకు సంబంధించిన జాబితాను ఈజేహెచ్ఎస్ అధికారులు వైద్య ఆరోగ్యశాఖకు అందజేశారు. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం పీహెచ్సీ స్థాయి నుంచి నిమ్స్ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ మందులను అందుబాటులో ఉంచుతారు. ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షల ప్యాకేజీపై కసరత్తు రాష్ట్రంలో 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా 20 లక్షల మందికిపైగా ఆరోగ్య కార్డుల ద్వారా ప్రయోజనం పొందుతారు. అలాగే దాదాపు 23 వేల మంది జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు 40 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదికోసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు (హెల్త్ చెకప్) చేయించుకునే వీలుంది. అలాగే ఏదైనా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే జబ్బును బట్టి ఉచిత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఇక నుంచి అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఏడాదికోసారి మాస్టర్ హెల్త్ చెక్ చేయించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు వీలు కల్పించాలని నిర్ణయించింది. అంటే సంబంధిత కార్పొరేట్ లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించే అత్యున్నతస్థాయి ప్యాకేజీని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు అమలుచేస్తారు. సాధారణంగా కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మాస్టర్ హెల్త్ చెకప్ కింద ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తారు. అలా నలుగురు కుటుంబ సభ్యులున్న ప్రభుత్వ ఉద్యోగులు హెల్త్ చెకప్ చేయించుకోవాలంటే రూ.20 వేల నుంచి రూ.30 వేలకుపైనే ఖర్చు కానుంది. ఇలాంటి అవకాశం ఉచితంగా కల్పించాలని ఈజేహెచ్ఎస్ నిర్ణయించింది. దీనిపై ఆయా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులతో చర్చిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీకి ఎంత చెల్లించాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. హెల్త్ చెకప్ వల్ల ముందుగానే ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని జాగ్రత్తలు తీసుకునే వీలుంటుందన్నది సర్కారు ఆలోచన. బీపీ, షుగర్ మొదలు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ఇతరత్రా అన్ని రకాల పరీక్షలు మాస్టర్ హెల్త్ చెకప్‌లో చేస్తారు. ముందు రిఫరల్... ఆ తర్వాతే కార్పొరేట్ శస్త్రచికిత్సల ప్యాకేజీ సొమ్ము తక్కువగా ఉన్నందున ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించడం లేదు. దీనిపై ఇటీవల నాలుగైదుసార్లు ఈజేహెచ్ఎస్ సీఈవో డాక్టర్ పద్మ ఆయా ఆసుపత్రులతో చర్చించారు. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. వైద్య వర్గాల సమాచారం ప్రకారం కార్పొరేట్ వైద్య ప్యాకేజీ సొమ్మును 60 శాతం వరకు పెంచే యోచనలో సర్కారు ఉంది. అయితే ఉచిత ఓపీ సేవలు కాకుండా ఉద్యోగులకు ఏడాదికి రూ.5 వేలు ఇవ్వాలన్న ఆలోచనను సర్కారు ఉపసంహరించుకుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం రిఫరల్ వార్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అందులో ఒకరిద్దరు సీనియర్ వైద్యులుంటారు. వారు పరీక్షలు నిర్వహించాక పై ఆసుపత్రికి రిఫర్ చేస్తేనే రోగి ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. లేకుంటే ఆ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన మందులే వాడాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాగే సేవలందిస్తున్నారు. అయితే రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అత్యవసర వైద్యం చేయించుకోవాల్సి వస్తే నేరుగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ లేదా ఇతర నెట్వర్క్ ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా వెళ్లొచ్చు. రిఫరల్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించాల్సి వస్తే అందుకు ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లతో అవగాహన కుదుర్చుకోవాలని నిర్ణయించారు. వాటికి ఫిక్స్డ్ ధరలు నిర్ణయించి అమలుచేస్తారు.