ఆరోగ్యమస్తు.. | telangana govt plans for health scheme for journalists and corporate employees | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమస్తు..

Published Thu, Oct 27 2016 2:57 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

ఆరోగ్యమస్తు.. - Sakshi

ఆరోగ్యమస్తు..

‘కార్పొరేట్‌’లో ఉద్యోగులు, జర్నలిస్టులకు
ఏడాదికోసారి ఉచితంగా వైద్య పరీక్షలు
►దీర్ఘకాలిక రోగులకు
    నెలవారీగా ఉచితంగా మందులు
►700 రకాల బ్రాండెడ్‌
    మందులు అందించే యోచన
► వైద్యం కోసం ముందుగా
    రిఫరల్‌ ఆసుపత్రులకు...
► అక్కడ్నుంచి పై ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తేనే కార్పొరేట్‌ చికిత్స
► అత్యవసర సమయాల్లో మాత్రం నేరుగా వెళ్లేందుకు వెసులుబాటు
వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం
► వచ్చేనెల నుంచే ఈజేహెచ్‌ఎస్‌ పథకం అమలుకు సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌
: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఏడాదికోసారి ప్రైవేటు, కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎగ్జిక్యూటివ్‌ ప్యాకేజీ కింద ఉచితంగా సమగ్ర వైద్య పరీక్షలు (మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌) నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే శస్త్రచికిత్సలు చేయించుకున్న, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నెలవారీగా ఉచితంగా బ్రాండెడ్‌ ఔషధాలు అందజేయనుంది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్‌)లో ఈ సదుపాయాలను చేర్చనుంది. వచ్చేనెల నుంచి ఈ పథకాన్ని పక్కాగా అమల్లోకి తీసుకొస్తామని ఈజేహెచ్‌ఎస్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం జనరిక్‌ మందులను సరఫరా చేస్తున్నామని, అవి కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదన్నారు. ఇక నుంచి బ్రాండెడ్‌ ఔషధాలను సరఫరా చేసేలా హైదరాబాద్‌లోని అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈజేహెచ్‌ఎస్‌ పథకంలోని వ్యాధులకు ఇవ్వాల్సిన మొత్తం 700 రకాల మందులను బ్రాండెడ్‌వే అందించనున్నారు. అందుకు సంబంధించిన జాబితాను ఈజేహెచ్‌ఎస్‌ అధికారులు వైద్య ఆరోగ్యశాఖకు అందజేశారు. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం పీహెచ్‌సీ స్థాయి నుంచి నిమ్స్‌ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ మందులను అందుబాటులో ఉంచుతారు.

ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షల ప్యాకేజీపై కసరత్తు
రాష్ట్రంలో 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా 20 లక్షల మందికిపైగా ఆరోగ్య కార్డుల ద్వారా ప్రయోజనం పొందుతారు. అలాగే దాదాపు 23 వేల మంది జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు 40 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదికోసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు (హెల్త్‌ చెకప్‌) చేయించుకునే వీలుంది. అలాగే ఏదైనా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే జబ్బును బట్టి ఉచిత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఇక నుంచి అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఏడాదికోసారి మాస్టర్‌ హెల్త్‌ చెక్‌ చేయించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు వీలు కల్పించాలని నిర్ణయించింది.

అంటే సంబంధిత కార్పొరేట్‌ లేదా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించే అత్యున్నతస్థాయి ప్యాకేజీని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు అమలుచేస్తారు. సాధారణంగా కార్పొరేట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ కింద ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తారు. అలా నలుగురు కుటుంబ సభ్యులున్న ప్రభుత్వ ఉద్యోగులు హెల్త్‌ చెకప్‌ చేయించుకోవాలంటే రూ.20 వేల నుంచి రూ.30 వేలకుపైనే ఖర్చు కానుంది. ఇలాంటి అవకాశం ఉచితంగా కల్పించాలని ఈజేహెచ్‌ఎస్‌ నిర్ణయించింది. దీనిపై ఆయా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులతో చర్చిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీకి ఎంత చెల్లించాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. హెల్త్‌ చెకప్‌ వల్ల ముందుగానే ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని జాగ్రత్తలు తీసుకునే వీలుంటుందన్నది సర్కారు ఆలోచన. బీపీ, షుగర్‌ మొదలు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ఇతరత్రా అన్ని రకాల పరీక్షలు మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌లో చేస్తారు.

ముందు రిఫరల్‌... ఆ తర్వాతే కార్పొరేట్‌
శస్త్రచికిత్సల ప్యాకేజీ సొమ్ము తక్కువగా ఉన్నందున ప్రస్తుతం కార్పొరేట్‌ ఆసుపత్రులు ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించడం లేదు. దీనిపై ఇటీవల నాలుగైదుసార్లు ఈజేహెచ్‌ఎస్‌ సీఈవో డాక్టర్‌ పద్మ ఆయా ఆసుపత్రులతో చర్చించారు. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. వైద్య వర్గాల సమాచారం ప్రకారం కార్పొరేట్‌ వైద్య ప్యాకేజీ సొమ్మును 60 శాతం వరకు పెంచే యోచనలో సర్కారు ఉంది. అయితే ఉచిత ఓపీ సేవలు కాకుండా ఉద్యోగులకు ఏడాదికి రూ.5 వేలు ఇవ్వాలన్న ఆలోచనను సర్కారు ఉపసంహరించుకుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం రిఫరల్‌ వార్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

అందులో ఒకరిద్దరు సీనియర్‌ వైద్యులుంటారు. వారు పరీక్షలు నిర్వహించాక పై ఆసుపత్రికి రిఫర్‌ చేస్తేనే రోగి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. లేకుంటే ఆ రిఫరల్‌ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన మందులే వాడాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాగే సేవలందిస్తున్నారు. అయితే రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అత్యవసర వైద్యం చేయించుకోవాల్సి వస్తే నేరుగా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్‌ లేదా ఇతర నెట్‌వర్క్‌ ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా వెళ్లొచ్చు. రిఫరల్‌ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించాల్సి వస్తే అందుకు ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లతో అవగాహన కుదుర్చుకోవాలని నిర్ణయించారు. వాటికి ఫిక్స్‌డ్‌ ధరలు నిర్ణయించి అమలుచేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement