ఇంటింటికీ ఇంటర్నెట్.. ప్రతీ పల్లెకు రోడ్డు | House to house Internet | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ ఇంటర్నెట్.. ప్రతీ పల్లెకు రోడ్డు

Published Sat, May 28 2016 6:25 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

ఇంటింటికీ ఇంటర్నెట్.. ప్రతీ పల్లెకు రోడ్డు - Sakshi

ఇంటింటికీ ఇంటర్నెట్.. ప్రతీ పల్లెకు రోడ్డు

అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్
- పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ
-  నీటి సరఫరా లీకేజీల నివారణకు సహకరిస్తామన్న ‘త్రీఎం’ సంస్థ
- సింగపూర్ తరహాలో అర్బన్ సొల్యూషన్ లేబొరేటరీ ఏర్పాటుకు హామీ
- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన మెడ్‌ట్రానిక్స్
 
 సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ ఇంటర్నెట్, ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. అమెరికా పర్యటనలో భాగంగా నాలుగో రోజు మిన్నెసొటా రాష్ట్రంలోని మిన్నేపోలిస్‌లో కేటీఆర్ పర్యటించారు. ప్రవాస భారతీయ, తెలుగు సంఘాల సంయుక్త సమావేశంతో పా టు పలు అంతర్జాతీయ కార్పొరేషన్ల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ‘త్రీఎం’ సంస్థ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జాన్ పౌర్నూర్‌తో భేటీలో తాగునీటి పథకాల్లో లీకేజీని నివారణ సాంకేతికతపై చర్చించారు.

తాగునీటి పథకాల్లో లీకేజీలను అరికట్టే వినూత్న సాంకేతికతను తాము అభివృద్ధి చేసినట్లు ఈ సందర్భంగా పౌర్నూర్ వెల్లడించారు. సింగపూర్‌లో తమ సంస్థ ఏర్పాటు చేసిన అర్బన్ సొల్యూషన్ లేబొరేటరీ తరహా పరిశోధనశాలను తెలంగాణలోనూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హైదరాబాద్‌లో నీటి లీకేజీల నివారణకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌లో లీకేజీల నివారణకు త్రీఎం సాంకేతికతను వినియోగించుకోవడంపై ఆసక్తి వ్యక్తం చేశారు.

 ప్రజారోగ్య రంగంలోనూ..
 ప్రజారోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం లో కలసి పనిచేసేందుకు ప్రఖ్యాత వైద్య ఉపకరణాల తయారీ సంస్థ మెడ్‌ట్రానిక్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణల కోసం టీహబ్‌లో భాగస్వామి అవుతామని తెలిపింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని.. వైద్య ఆవిష్కరణలకు హైదరాబాద్ అత్యంత అనుకూలమైనదని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, త్వరలో ఏర్పాటు చేయబోయే వైద్య ఉపకరణాల తయారీ పార్కులో పెట్టుబడులు పెట్టాలని మెడ్‌ట్రానిక్స్ ప్రతి నిధులను మంత్రి కేటీఆర్ కోరారు.

అనంత రం మిన్నెపోలిస్‌లోని ఉపాధి, ఆర్థికాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులతోనూ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. మిన్నెసొటాలో ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన కోసం అనుసరిస్తున్న విధానాలను, వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమీప భవిష్యత్తులో తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని డీడ్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. అనంతరం మిన్నెపోలిస్‌లోని బోస్టన్ సైంటిఫిక్ కంపెనీ నిర్వహిస్తున్న వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమను కేటీఆర్ సందర్శించారు. తెలంగాణలోని వైద్య ఉపకరణాల తయారీ పార్కులో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

 అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పేరొందిన కార్గిల్ కార్పోరేషన్ ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్.. తెలంగాణలోని ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ప్రఖ్యాత సంస్థ ఐటీసీ ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని వివరించారు. ప్రవాస భారతీయ, తెలుగు సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement