
మీడియాతో మాట్లాడుతున్న హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు
రూ.3,500 కోట్లు బకాయి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
సర్కారు నుంచి బిల్లులు సకాలంలో రావడంలేదు
మందులు, ఇతర సామగ్రి సరఫరాదారులకు బిల్లులు కట్టలేకపోతున్నాం
అప్పుపై మందులు అందించలేమని వారు నోటీసులిచ్చారు
ఓవర్ డ్రాఫ్ట్ దాటిపోవడంతో బ్యాంకులు కూడా అప్పులిచ్చే పరిస్థితిలేదు
ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందనలేదు
ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల వెల్లడి
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం పేదల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈనెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. నెలకు రూ.300 కోట్లకు పైగా బిల్లులు నిలిచిపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు గత్యంతరంలేని స్థితిలో ఈ నిర్ణయానికి వచ్చాయి. 11 నెలలుగా కూటమి ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.3,500 కోట్లకు పైగా పేరుకుపోయాయి. ఈ పరిస్థితిని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులు గురువారం మీడియాకు వివరించారు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ)లను ఈనెల 7 నుంచి పూర్తిగా నిలిపేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘ఆశా’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. విజయ్‌కుమార్ మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం రూ.3,500 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో తమ ఆస్పత్రులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు అందడంలేదన్నారు. దీంతో పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోవడంతో మందులు, ఇతర సామగ్రిని సరఫరాచేసే వారికి బిల్లులు చెల్లించలేని గడ్డు పరిస్థితుల్లో ఆస్పత్రుల యాజమాన్యాలు ఉన్నాయన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేగానీ వీటిని అందించలేమని సరఫరా సంస్థలు ఇప్పటికే నోటీసులిచ్చాయన్నారు. అలాగే, ఓవర్ డ్రాఫ్ట్ దాటిపోవడంతో ఏ బ్యాంకు కూడా అప్పులిచ్చే పరిస్థితిలేదన్నారు.
ఇక ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి యాజమాన్యాలు కనీసం రెండునెలల వేతనాలు బకాయిలు ఉన్నట్లు వివరించారు. ఈ పరిస్థితుల్లో సేవలు నిలిపివేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ఇదే అంశంపై గతనెల ఏడునే ప్రభుత్వానికి లేఖ రాశామని.. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అలాగే, గతేడాది జూలై నుంచి బకాయిలు, ఇతర డిమాండ్లపై ప్రభుత్వానికి 26 సార్లు లేఖలు రాశామని విజయ్‌కుమార్ గుర్తుచేశారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో నగదు రహిత ఈహెచ్‌ఎస్ సేవలను ఆపేశామన్నారు.
రూ.4వేల కోట్ల బడ్జెట్‌లో.. రూ.3,500 కోట్ల బకాయిలు..
ఇక 2025–26 సంవత్సరానికి ఆరోగ్యశ్రీ పథకం కోసం రూ.4 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తే ఇందులో బకాయిలే రూ.3,500 కోట్లున్నాయని ఆయన చెప్పారు. ఈ బకాయిల్లో కనీసం రూ.1,500 కోట్లు చెల్లిస్తేగానీ సేవలను కొనసాగించలేమని తేల్చిచెప్పారు. బీమా విధానంలోకి ప్రభుత్వం వెళ్తున్న క్రమంలో ప్యాకేజీల పెంపు, బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) పెరుగుతోందేగానీ, నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించే ప్యాకేజీలు మాత్రం పెరగడంలేదని చెప్పారు. ప్యాకేజీలు పెంచకపోతే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం సాధ్యంకాదన్నారు. ఈ క్రమంలో కిమ్స్, మెడికవర్, తదితర కార్పొరేట్ ఆస్పత్రులు ఏడో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తాయని ఆయన స్పష్టంచేశారు.

ప్రభుత్వ పెద్దల అపాయింట్‌మెంట్ దొరకడంలేదు..
ఆశా కార్యదర్శి డాక్టర్ అవినాశ్ మాట్లాడుతూ.. బకాయిలు చెల్లింపుపై కార్యాచరణ ప్రకటిస్తామని గతేడాది ఆగస్టులో ప్రభుత్వం హామీ ఇచ్చినా అది అమలుకు నోచుకోలేదన్నారు. తమ సమస్యలపై చర్చల కోసం ప్రభుత్వ పెద్దలను సంప్రదించే ప్రయత్నం చేస్తుంటే అపాయింట్‌మెంట్‌లు దొరకడంలేదన్నారు.
డాక్టర్ యార్లగడ్డ రమేశ్‌బాబు మాట్లాడుతూ.. బీమా విధానంలోకి మారే క్రమంలో ఆయుష్మాన్ భారత్‌తో పథకాన్ని ఇంటిగ్రేట్ చేస్తామని అంటున్నారని, ఆయుష్మాన్ భారత్‌లోని 1,500 ప్రొసీజర్లు ఆరోగ్యశ్రీ కంటే తక్కువ ప్యాకేజీల్లో ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ఇంటిగ్రేట్ చేస్తే ఆస్పత్రుల మనుగడ కష్టం అవుతుందన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 600 నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్ పథకం నుంచి వైదొలిగాయని రమేశ్‌బాబు చెప్పారు.