సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్ల విలువైన ఆరోగ్య సేవలను ప్రైవేటు పరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల వేళ మిగిలిన వాటిని కూడా ప్రైవేటుకు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ ముగించాలంటూ కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. లేదంటే మీపై చర్యలు తప్పవంటూ ఆరోగ్య శాఖ సలహాదారు, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. వందలాది కోట్ల రూపాయల విలువైన పనులు ఎవరికివ్వాలో ముందే నిర్ణయించి పేరుకు టెండర్లు నిర్వహిస్తున్నారని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత టెలీ ఆఫ్తల్మాలజీ(కంటి పరీక్షలు) సేవలు ఓ కార్పొరేట్ ఆస్పత్రికి దక్కేలా ప్రభుత్వ పెద్దలు ముందే నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు సదరు కార్పొరేట్ ఆస్పత్రికి దక్కేలా నిబంధనలు రూపొందించడమే ఇందుకు ఉదాహరణ అని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎనిమిది జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) కింద కేన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు చేసేందుకు టెండర్ పిలుస్తున్నారు. ఒక్కో జిల్లాలో రూ.70 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాల్సిన ఈ ఆస్పత్రులను కూడా ఓ కార్పొరేట్ కంపెనీకి కట్టబెడుతున్నారు. ఆ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులే టెండర్ డాక్యుమెంట్లు తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చారంటే.. ఇక టెండర్ల ప్రక్రియ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. రూ.550 కోట్లయ్యే ఈ ప్రాజెక్టు వారికి అప్పజెప్పడంతో పాటు ప్రభుత్వాస్పత్రులకు వచ్చే పేషెంట్లను కూడా అక్కడికే తీసుకెళ్లేలా నిబంధనలు రూపొందించడం గమనార్హం. టీబీ రోగులకు మందులు అందజేయడాన్ని కూడా ప్రైవేటుకు అప్పజెప్పి భారీగా లబ్ధి చేకూర్చేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోగా అందినకాడికి దండుకునేందుకు ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరోగ్య శాఖ సలహాదారు నేతృత్వంలో..
వైద్య విద్యా శాఖ, మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థల్లోనే ఎక్కువ టెండర్లున్నాయి. ఈ రెండు విభాగాలకు ఎన్‌ఎండీ ఫరూక్ మంత్రిగా ఉన్నారు. కానీ ఆయనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ పెద్దలే.. ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తుండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వైద్య ఆరోగ్య శాఖకు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఓ ప్రైవేటు కన్సల్టెంట్.. తనకు కావాల్సిన కంపెనీలకు టెండర్లు దక్కేలా డాక్యుమెంట్లు రూపొందించి పనులు చక్కబెడుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా.. ఆయన ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఓ అధికారి సాక్షికి తెలిపారు. ఉన్నతాధికారులు, సలహాదారు నేరుగా ముఖ్యమంత్రితోనే మాట్లాడి ఇదంతా చేస్తున్నట్టు వివరించారు. పైగా ఇటీవల కాలంలో చాలామంది అధికారులు ఈ శాఖలో పనిచేయలేమంటూ బలవంతంగా బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. దీంతో అన్ని విభాగాలకు ఒకరే ఇన్‌చార్జిగా ఉండటంతో.. వీరి పని మరింత సులువైంది.
మరిన్ని ఆరోగ్య సేవలు ప్రైవేటుపరం
Published Sun, Feb 17 2019 5:34 AM | Last Updated on Sun, Feb 17 2019 5:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment