బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మహేశ్ నరాల బలహీనతతో బాధపడుతున్నారు. ఈఎస్‌ఐ కార్డుదారుడు కావడంతో అత్యవసర సేవల కింద సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఈఎస్‌ఐ ఇన్‌పేషెంట్ సౌకర్యం లేదని చెప్పడంతో బంజారాహిల్స్‌లోని మరో కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఏకంగా ఈఎస్‌ఐ సేవలు అందించలేమంటూ బోర్డు కనిపించింది. దీంతో చేసేదేం లేక సొంత ఖర్చుతో చికిత్సకు సిద్ధమయ్యారు.
సాక్షి, హైదరాబాద్: కార్మికులకు ఆరోగ్య సేవలు సంకటంలో పడ్డాయి. ఈఎస్‌ఐసీ చందాదారులకు వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం పేరిట నిబంధనలకు నీళ్లు వదులుతున్నాయి. దాంతో అత్యవసర సేవల కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తున్న కార్మికులకు నిరాశే ఎదురవుతోంది. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో తగిన వైద్యం అందకపోతుండటంతో అత్యవసర వైద్యం కోసం చాలా మంది కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఆ ఆస్పత్రులు చికిత్సకు నిరాకరిస్తుండటంతో వెనుదిరుగుతున్నారు.
14.6 లక్షల ఈఎస్‌ఐ కార్డులు..
రాష్ట్రవ్యాప్తంగా 14.6 లక్షల ఈఎస్‌ఐ కార్డులున్నాయి. ఒక్కో కార్డుపై సగటున నలుగురు సభ్యులున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా 58.4 లక్షల మందికి ఈఎస్‌ఐసీ సేవలు అందాలి. ఈఎస్‌ఐసీ సేవల నిమిత్తం ఒక్కో కార్డుదారుడు తన వేతనం నుంచి 6.5 శాతం మొత్తాన్ని నెలనెలా కాంట్రిబ్యూషన్ కింద చెల్లిస్తున్నాడు. ఈఎస్‌ఐకి నెలకు దాదాపు రూ.70 కోట్ల వరకు రాష్ట్రంలోని కార్మికులు చెల్లిస్తుండగా.. ప్రభుత్వం కూడా తనవాటా విడుదల చేస్తోంది. ఈఎస్‌ఐసీ ఆస్పత్రుల పరిధిలో అందని సేవలను గుర్తింపు పొందిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈక్రమంలో హైదరాబాద్‌లోని 39 కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఈఎస్‌ఐసీ గుర్తింపు ఉంది. అయితే మెజారిటీ ఆస్పత్రులు ఈఎస్‌ఐసీ సేవలకు మంగళం పాడాయి. కొన్ని ఆస్పత్రులు ఏకంగా సేవలందించట్లేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
చెల్లింపుల్లో జాప్యమే కారణం!
కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈఎస్‌ఐ సేవల పరిస్థితి ఏడాది కాలంగా గందరగోళంగా మారింది. సకాలంలో బిల్లులు ఇవ్వట్లేదనే ఆరోపణలతో సేవలు నిలిపేస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. 6 నెలలు, ఏడాది పాటు నిధులే ఇవ్వట్లేదని, దీంతో తప్పని పరిస్థితిలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామని ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
11 ఆస్పత్రులకు నోటీసులు..
ఈఎస్‌ఐసీ కార్డుదారులకు సేవలందించకపోవడంపై కార్పొరేషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో స్పందించిన ఈఎస్‌ఐసీ అధికారులు ఇప్పటివరకు 11 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా స్పందించి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment