ESI services
-
ఈఎస్ఐ ‘కార్పొరేట్’ సేవలు మరింత చేరువలో!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ (ఉద్యోగ రాజ్య బీమా) చందాదారులకు వైద్య సేవలను మరింత చేరువలోకి తెచ్చే దిశగా డీఐఎంఎస్ (డైరెక్టర్ ఇన్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్) చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ, మూడు జనరల్ ఆస్పత్రులతోపాటు 71 డిస్పెన్సరీల ద్వారా వైద్య సేవలందుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రెండు జనరల్ ఆస్పత్రులు హైదరాబాద్ సమీపంలో ఉండగా.. మరో రెండు ఆస్పత్రులు వరంగల్, సిర్పూర్లో ఉన్నాయి. మిగతా డిస్పెన్సరీలు జిల్లాల్లో ఉన్నప్పటికీ అక్కడ కేవలం అవుట్ పేషెంట్ విభాగాల సేవలతోనే సరిపెడుతున్నాయి. ఈక్రమంలో శస్త్ర చికిత్సలు, మేజర్ చికిత్సల కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు రావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చందాదారులకు మరింత మెరుగైన సేవలను వేగంగా అందించేందుకు కొత్తగా ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులను ఎంపిక చేయాలని డీఐఎంఎస్ భావిస్తోంది. ఈమేరకు ప్రతిపాదనలను రూపొందించింది. జిల్లాకో ఆస్పత్రి చొప్పున... రాష్ట్రంలో ఈఎస్ఐ కార్పొరేషన్ 21 కార్పొరేట్ ఆస్పత్రులను ఎంప్యానెల్ చేసింది. ఇందులో మెజార్టీ ఆస్పత్రులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. అలాకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఎంప్యానెల్ ఆస్పత్రులు ఉండేలా డీఐఎంఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లాకొక కార్పొరేట్ ఆస్పత్రిని ఎంప్యానెల్ చేస్తే సంబంధిత జిల్లా పరిధిలోని చందాదారులకు అత్యవ సరంగా మెరుగైన సేవలు అందుతాయనే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 40 ఆస్పత్రులను ఎంప్యానెల్ చేయాలని భావిస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతోనూ ఇటీవల సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన ఈఎస్ఐ ప్రాంతీయ బోర్డు సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించారు. డీఐఎంఎస్ ప్రతిపాదనలను త్వరలో ఈఎస్ఐ కార్పొరేషన్‌కు పంపా లని నిర్ణయించారు. అక్కడ ఆమోదం వచ్చాక ఆస్పత్రుల తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇదంతా వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. -
ఇక అన్ని జిల్లాల్లోనూ ఈఎస్ఐ సేవలు
న్యూఢిల్లీ: దేశంలో ఇకపై అన్ని జిల్లాల్లోనూ ఈఎస్ఐ సేవలు లభించనున్నాయి. భారత్‌లోని 735 జిల్లాల్లోనూ ఏప్రిల్ 1నుంచి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఇన్సూర్డ్ పర్సన్స్‌కు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలు కేవలం 387 జిల్లాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండగా, మరో 187 జిల్లాల్లో పాక్షికంగా అందుబాటులో ఉన్నాయి. 161 జిల్లాల్లో మాత్రం అసలు ఈ సేవలే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్రం ఈ సేవల ఏర్పాటుకు ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన బిల్లుల ప్రక్రియను ఎసిక్ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. -
అవినీతి ‘లెజెండ్’!
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్)లో వెలుగు చూసిన స్కాంలో మరిన్ని అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ స్కాంలో ఏసీబీ అరెస్టు చేసిన 21 మంది నిందితుల్లో ఒకరైన ఓమ్నీ ఫార్మా ఎండీ కంచర్ల శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తు న్నాయి. డొల్ల కంపెనీలు, అక్రమంగా పొందిన టెండర్లు, నకిలీ ఇండెంట్ల ద్వారా శ్రీహరిబాబు రూ.వందల కోట్లు సంపాదించిన వైనాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గుర్తించారు. డొల్ల కంపెనీ మాజీ డైరెక్టర్, మాజీ జేడీ పద్మల సాయంతో ఏకంగా రూ. 54 కోట్లను తన ఖాతాకు మళ్లించుకున్న వైనాన్ని బట్టబయలు చేశారు. ఇటీవల బెయిల్ పొందిన శ్రీహరిని మరోసారి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎలా జరిగింది..?: శ్రీహరిబాబు రెండు దశాబ్దాలుగా మెడికల్ ఫీల్డ్‌లోనే ఉన్నాడు. ఐఎంఎస్‌లో డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మలను లంచాలతో తన దారికి తెచ్చుకున్న తరువాత లెజెండ్ పేరుతో షెల్ కంపెనీ ప్రారంభించాడు. దానికి కృపాసాగర్‌రెడ్డి అనే తన బినా మీని యజమానిగా చూపించాడు. ఈ కంపెనీ ద్వారా తెల్ల రక్తకణాల సంఖ్యను లెక్కగట్టేందుకు ఉప యోగించే ‘క్యూవెట్స్’ (పరీక్ష కిట్లు) కొనుగోలు చేయించాడు. జిల్లాల నుంచి ఎలాంటి ఇండెంట్లు రాకున్నా శ్రీహరిబాబు క్యూవెట్ల కోసం నకిలీ ఇండెంట్లు సృష్టించాడు. వాస్తవానికి వాటిని సరఫరా చేయడానికి లెజెండ్ కంపెనీకి ఎలాంటి అర్హత, అనుమతులు లేకున్నా శ్రీహరిబాబు నకిలీ అర్హత పత్రాలు సృష్టించాడు. ఒక్కో క్యూవెట్ ధర బహిరంగ మార్కెట్లో రూ. 11,800 ఉండగా శ్రీహరి మాత్రం ఒక్కో క్యూవెట్‌ను ఏకంగా రూ. 36,800లకు కోట్ చేశాడు. ఈ కోట్‌ను ఆమోదిస్తూ ఐఎంఎస్ అప్పటి డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ సంతకాలు చేశారు. 200 శాతం మార్జిన్.. బహిరంగ మార్కెట్లో లభించే ఒక్కో క్యూవెట్ కిట్ ధర రూ. 11,800లోనే 25 శాతం మార్జిన్ ఉన్నప్పటికీ దేవికారాణి బృందం మాత్రం శ్రీహరిబాబు 200 శాతానికన్నా అధికంగా కోట్ చేసిన రూ. 36,800కే ఒక్కో క్యూవెట్ ధరను నిర్ణయించారు. ఆ మేరకు ఆర్డర్ చేసిన కిట్లకు సంబంధించి రూ. 54 కోట్లను లెజెండ్ కంపెనీకి చెల్లించారు. ఈ డొల్ల కంపెనీ ఎండీ కృపాసాగర్‌రెడ్డి తనకు వచ్చిన రూ. 54 కోట్లను శ్రీహరిబాబు ఖాతాకు బదిలీ చేశాడు. మరోవైపు గ్లూకోజ్ పరీక్షకు వినియోగించే క్యూవెట్లలోనూ భారీగా అవినీతి జరిగింది. బహిరంగ మార్కెట్లో రూ. 1,980గా ఉన్న గ్లూకోజ్ క్యూవెట్లను రూ. 6,200కు కోట్ చేసి మరో రూ. 12.84 కోట్ల నిధులు శ్రీహరిబాబు డ్రా చేసుకున్నాడు. రూ. 19 కోట్ల ఐటీ చెల్లింపులు... శ్రీహరిబాబు ఆస్తులు చూసి ఏసీబీ ఉన్నతాధికారులే కళ్లు తేలేస్తున్నారు. 2017–18లో అతని ఖాతాలో ఒకసారి రూ. 54 కోట్లు వచ్చిపడ్డాయి. అతనికి షేర్ మార్కెట్లో ఏకంగా రూ. 99 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. అలాగే అతని పేరిట రూ. 24 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, భార్య పేరిట రూ. 7 కోట్ల ఎఫ్డీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులన్నింటికీ ఒక్క 2017–18 ఆర్థిక సంవత్సరంలోనే ఆదాయపు పన్నుశాఖ (ఐటీ)కు ఏకంగా రూ. 19 కోట్లను పన్ను రూపంలో చెల్లించడం గమనార్హం. ప్రస్తుతం శ్రీహరిబాబును అరెస్టు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఆయన ఏసీబీ అదుపులోనే ఉన్నారని సమాచారం. ఈ నకిలీ ఇండెంట్ల బాగోతాన్ని అమలు చేసిన ఓమ్నీ ఫార్మా ఉద్యోగి వెంకటేశ్వర్లు, లెజెండ్ ఫార్మా ఎండీ కృపాసాగర్‌రెడ్డి కోసం ఏసీబీ గాలిస్తోంది. శ్రీహరిబాబుకు తెలంగాణతోపాటు ఏపీ, ఇతర రాష్ట్రాల్లోనూ ఈఎస్ఐలలో మందుల సరఫరా చేసే కాంట్రాక్టులు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీహరిబాబుకు చెందిన ఇళ్లలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. -
కార్మిక వైద్యానికి ‘కార్పొరేట్’ షాక్!
బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మహేశ్ నరాల బలహీనతతో బాధపడుతున్నారు. ఈఎస్ఐ కార్డుదారుడు కావడంతో అత్యవసర సేవల కింద సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఈఎస్ఐ ఇన్‌పేషెంట్ సౌకర్యం లేదని చెప్పడంతో బంజారాహిల్స్‌లోని మరో కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఏకంగా ఈఎస్ఐ సేవలు అందించలేమంటూ బోర్డు కనిపించింది. దీంతో చేసేదేం లేక సొంత ఖర్చుతో చికిత్సకు సిద్ధమయ్యారు. సాక్షి, హైదరాబాద్: కార్మికులకు ఆరోగ్య సేవలు సంకటంలో పడ్డాయి. ఈఎస్ఐసీ చందాదారులకు వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం పేరిట నిబంధనలకు నీళ్లు వదులుతున్నాయి. దాంతో అత్యవసర సేవల కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తున్న కార్మికులకు నిరాశే ఎదురవుతోంది. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తగిన వైద్యం అందకపోతుండటంతో అత్యవసర వైద్యం కోసం చాలా మంది కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఆ ఆస్పత్రులు చికిత్సకు నిరాకరిస్తుండటంతో వెనుదిరుగుతున్నారు. 14.6 లక్షల ఈఎస్ఐ కార్డులు.. రాష్ట్రవ్యాప్తంగా 14.6 లక్షల ఈఎస్ఐ కార్డులున్నాయి. ఒక్కో కార్డుపై సగటున నలుగురు సభ్యులున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా 58.4 లక్షల మందికి ఈఎస్ఐసీ సేవలు అందాలి. ఈఎస్ఐసీ సేవల నిమిత్తం ఒక్కో కార్డుదారుడు తన వేతనం నుంచి 6.5 శాతం మొత్తాన్ని నెలనెలా కాంట్రిబ్యూషన్ కింద చెల్లిస్తున్నాడు. ఈఎస్ఐకి నెలకు దాదాపు రూ.70 కోట్ల వరకు రాష్ట్రంలోని కార్మికులు చెల్లిస్తుండగా.. ప్రభుత్వం కూడా తనవాటా విడుదల చేస్తోంది. ఈఎస్ఐసీ ఆస్పత్రుల పరిధిలో అందని సేవలను గుర్తింపు పొందిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈక్రమంలో హైదరాబాద్‌లోని 39 కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఈఎస్ఐసీ గుర్తింపు ఉంది. అయితే మెజారిటీ ఆస్పత్రులు ఈఎస్ఐసీ సేవలకు మంగళం పాడాయి. కొన్ని ఆస్పత్రులు ఏకంగా సేవలందించట్లేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చెల్లింపుల్లో జాప్యమే కారణం! కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈఎస్ఐ సేవల పరిస్థితి ఏడాది కాలంగా గందరగోళంగా మారింది. సకాలంలో బిల్లులు ఇవ్వట్లేదనే ఆరోపణలతో సేవలు నిలిపేస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. 6 నెలలు, ఏడాది పాటు నిధులే ఇవ్వట్లేదని, దీంతో తప్పని పరిస్థితిలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామని ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. 11 ఆస్పత్రులకు నోటీసులు.. ఈఎస్ఐసీ కార్డుదారులకు సేవలందించకపోవడంపై కార్పొరేషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో స్పందించిన ఈఎస్ఐసీ అధికారులు ఇప్పటివరకు 11 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా స్పందించి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
రేపటి నుంచి ఈఎస్ఐ సేవలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 1 (బుధవారం) నుంచి తమ ఆస్పత్రుల్లో ఈఎస్ఐ రోగులకు వైద్య సేవలు నిలిపివేయనున్నట్లు సోమవారం తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. వైద్య బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యానికి తోడు పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లింపులు జరపకపోవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈఎస్ఐతో రాష్ట్రవ్యాప్తంగా 43 స్పెషాలిటీ ఆస్పత్రులు అవగాహన ఒప్పందం కుదుర్చుకోగా, వీటిలో వరంగల్, కరీంనగర్‌లోని నాలుగు ఆస్పత్రులు మినహా మిగిలినవన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వీటిలో రోజుకు సగటున 200 మంది ఈఎస్ఐ లబ్ధిదారులు ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. లబ్ధిదారులకు చికిత్స చేసి పంపిస్తున్నప్పటికీ సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని, ఇప్పటికే ఆయా ఆస్పత్రులకు 2012 నుంచి ఇప్పటివరకు భారీ మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉందని అసోసియేషన్ ఆరోపించింది. పెరుగుతున్న ధరలకు విరుద్ధంగా ఈఎస్ఐ ప్యాకేజీలు ఉన్నాయని తెలిపింది. సకాలంలో వైద్య ఖర్చులు చెల్లించక పోవడంతో పాటు భారీగా బకాయిలు పేరుకుపోవడంతో ఇకపై ఈఎస్ఐ లబ్ధిదారులకు తమ అస్పత్రుల్లో ఉచిత సేవలు అందించడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఈఎస్ఐ మెడికల్ కమిషనర్‌కు నోటీసులు కూడా అందజేసినట్లు పేర్కొంది. అయితే అసోసియేషన్ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని ఈఎస్ఐ మెడికల్ కమిషనర్ ఇమాన్యుయెల్ చెప్పారు. మే 2017 నుంచే బకాయిలు చెల్లించాలని, అది కూడా రూ.80 కోట్ల బకాయిలు మాత్రమేనని తెలిపారు. స్పెషాలిటీ ఆస్పత్రుల నిరాకరణ నేపథ్యంలో రోగులకు ఇబ్బంది కలగకుండా పలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. -
అసంఘటిత కార్మికులందరికీఈఎస్‌ఐ సేవలు
- ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ఈఎస్ఐ ఆస్పత్రులు - కేంద్రమంత్రి దత్తాత్రేయ వెల్లడి హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈఎస్ఐ పథకం వర్తింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఇప్పటికే అసంఘటిత రంగంలోని 2 కోట్ల మంది కార్మికులు ఈఎస్ఐ సేవలు పొందుతున్నారని, తాజా నిర్ణయం వల్ల వాటి సంఖ్య 40 కోట్లకు చేరు కుంటుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో శనివారం ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఎసిక్(ఇఎస్ఐసీ) ఆఫీసర్స్ ఫెడరేషన్ సిల్వర్ జూబ్లీ సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఔట్‌పేషెంట్స్ సేవలు మాత్రమే అందుతున్నాయని, త్వరలో వాటిని 6 నుంచి 10 పడకల ఆస్పత్రులుగా మారుస్తామన్నారు. ఈఎస్ఐ కార్పొరేషన్లో ఎస్ఎస్వో నుంచి ఏడీ, డీడీ, జారుుంట్ డెరైక్టర్ల వరకు ప్రమోషన్లు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఎసిక్ ఆఫీసర్స్ అంకితభావంతో పనిచేయాలని దత్తాత్రేయ సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ఈఎస్ఐ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నామన్నారు. 2019 నాటికి ఈఎస్ఐ సేవలు మరింత విసృ్తతం కానున్నాయని వివరించారు. రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నారుుని నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. బీజేపీ శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈఎస్ఐ కార్డుదారులు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని, ఈ పద్ధతి మారాలని, కార్మికులందరికీ నాణ్యమైన వైద్యం ఉచితంగా అందాలని అన్నారు. సదస్సులో మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, ఆలిండియా ఈఎస్ఐసీ ఆఫీసర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ప్రణయ్సిన్హా, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యంత సులభంగా ఈఎస్ఐ సేవలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత రెండేళ్లలో అత్యంత సులభమైన రీతిలో సేవలు అందిస్తున్నట్లు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. సులభ వాణిజ్యం, ఉత్పాదకత, ఉద్యోగితను ప్రోత్సహించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ చర్యలు చేపట్టిందని పేర్కొంది. ఈఎస్ఐ సేవలను సులభతరం చేసేందుకు ఆన్లైన్లోనే ఉద్యోగుల రిజిస్ట్రేషన్లు, వివరాల్లో సవరణలు, కంట్రిబ్యూషన్ స్వీకరణ, చెల్లింపులు, క్లెయిములు వంటివి చేపట్టినట్లు తెలిపింది.