అవినీతి ‘లెజెండ్‌’! | Kancharla Sriharibabu Corruption In ESI Scam | Sakshi
Sakshi News home page

అవినీతి ‘లెజెండ్‌’!

Published Wed, Jan 1 2020 2:10 AM | Last Updated on Wed, Jan 1 2020 2:10 AM

Kancharla Sriharibabu Corruption In ESI Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌)లో వెలుగు చూసిన స్కాంలో మరిన్ని అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ స్కాంలో ఏసీబీ అరెస్టు చేసిన 21 మంది నిందితుల్లో ఒకరైన ఓమ్నీ ఫార్మా ఎండీ కంచర్ల శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జీ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తు న్నాయి. డొల్ల కంపెనీలు, అక్రమంగా పొందిన టెండర్లు, నకిలీ ఇండెంట్ల ద్వారా శ్రీహరిబాబు రూ.వందల కోట్లు సంపాదించిన వైనాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గుర్తించారు. డొల్ల కంపెనీ మాజీ డైరెక్టర్, మాజీ జేడీ పద్మల సాయంతో ఏకంగా రూ. 54 కోట్లను తన ఖాతాకు మళ్లించుకున్న వైనాన్ని బట్టబయలు చేశారు. ఇటీవల బెయిల్‌ పొందిన శ్రీహరిని మరోసారి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎలా జరిగింది..?: శ్రీహరిబాబు రెండు దశాబ్దాలుగా మెడికల్‌ ఫీల్డ్‌లోనే ఉన్నాడు. ఐఎంఎస్‌లో డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జేడీ పద్మలను లంచాలతో తన దారికి తెచ్చుకున్న తరువాత లెజెండ్‌ పేరుతో షెల్‌ కంపెనీ ప్రారంభించాడు.

దానికి కృపాసాగర్‌రెడ్డి అనే తన బినా మీని యజమానిగా చూపించాడు. ఈ కంపెనీ ద్వారా తెల్ల రక్తకణాల సంఖ్యను లెక్కగట్టేందుకు ఉప యోగించే  ‘క్యూవెట్స్‌’ (పరీక్ష కిట్లు) కొనుగోలు చేయించాడు. జిల్లాల నుంచి ఎలాంటి ఇండెంట్లు రాకున్నా శ్రీహరిబాబు క్యూవెట్ల కోసం నకిలీ ఇండెంట్లు సృష్టించాడు. వాస్తవానికి వాటిని సరఫరా చేయడానికి లెజెండ్‌ కంపెనీకి ఎలాంటి అర్హత, అనుమతులు లేకున్నా శ్రీహరిబాబు నకిలీ అర్హత పత్రాలు సృష్టించాడు. ఒక్కో క్యూవెట్‌ ధర బహిరంగ మార్కెట్లో రూ. 11,800 ఉండగా శ్రీహరి మాత్రం ఒక్కో క్యూవెట్‌ను ఏకంగా రూ. 36,800లకు కోట్‌ చేశాడు. ఈ కోట్‌ను ఆమోదిస్తూ ఐఎంఎస్‌ అప్పటి డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ సంతకాలు చేశారు.

200 శాతం మార్జిన్‌..
బహిరంగ మార్కెట్లో లభించే ఒక్కో క్యూవెట్‌ కిట్‌ ధర రూ. 11,800లోనే 25 శాతం మార్జిన్‌ ఉన్నప్పటికీ దేవికారాణి బృందం మాత్రం శ్రీహరిబాబు 200 శాతానికన్నా అధికంగా కోట్‌ చేసిన రూ. 36,800కే ఒక్కో క్యూవెట్‌ ధరను నిర్ణయించారు. ఆ మేరకు ఆర్డర్‌ చేసిన కిట్లకు సంబంధించి రూ. 54 కోట్లను లెజెండ్‌ కంపెనీకి చెల్లించారు. ఈ డొల్ల కంపెనీ ఎండీ కృపాసాగర్‌రెడ్డి తనకు వచ్చిన రూ. 54 కోట్లను శ్రీహరిబాబు ఖాతాకు బదిలీ చేశాడు. మరోవైపు గ్లూకోజ్‌ పరీక్షకు వినియోగించే క్యూవెట్లలోనూ భారీగా అవినీతి జరిగింది. బహిరంగ మార్కెట్లో రూ. 1,980గా ఉన్న గ్లూకోజ్‌ క్యూవెట్లను రూ. 6,200కు కోట్‌ చేసి మరో రూ. 12.84 కోట్ల నిధులు శ్రీహరిబాబు డ్రా చేసుకున్నాడు.

రూ. 19 కోట్ల ఐటీ చెల్లింపులు...
శ్రీహరిబాబు ఆస్తులు చూసి ఏసీబీ ఉన్నతాధికారులే కళ్లు తేలేస్తున్నారు. 2017–18లో అతని ఖాతాలో ఒకసారి రూ. 54 కోట్లు వచ్చిపడ్డాయి. అతనికి షేర్‌ మార్కెట్లో ఏకంగా రూ. 99 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. అలాగే అతని పేరిట రూ. 24 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, భార్య పేరిట రూ. 7 కోట్ల ఎఫ్‌డీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులన్నింటికీ ఒక్క 2017–18 ఆర్థిక సంవత్సరంలోనే ఆదాయపు పన్నుశాఖ (ఐటీ)కు ఏకంగా రూ. 19 కోట్లను పన్ను రూపంలో చెల్లించడం గమనార్హం. ప్రస్తుతం శ్రీహరిబాబును అరెస్టు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఆయన ఏసీబీ అదుపులోనే ఉన్నారని సమాచారం. ఈ నకిలీ ఇండెంట్ల బాగోతాన్ని అమలు చేసిన ఓమ్నీ ఫార్మా ఉద్యోగి వెంకటేశ్వర్లు, లెజెండ్‌ ఫార్మా ఎండీ కృపాసాగర్‌రెడ్డి కోసం ఏసీబీ గాలిస్తోంది. శ్రీహరిబాబుకు తెలంగాణతోపాటు ఏపీ, ఇతర రాష్ట్రాల్లోనూ ఈఎస్‌ఐలలో మందుల సరఫరా చేసే కాంట్రాక్టులు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీహరిబాబుకు చెందిన ఇళ్లలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement