నిలిచిపోయిన 104 వాహనాలు
పాడేరు : ఏజెన్సీలోని 104 వైద్యసిబ్బంది ఆకస్మికంగా సమ్మె చేపట్టడంతో మంగళవారం నుంచి గ్రామాల్లో ఈ సంచార వైద్య ఆరోగ్య సేవలు స్తంభించాయి. సిబ్బంది సమ్మెకు దిగడంతో ఏజెన్సీ 11 మండలాల పరిధిలోని ఏడు 104 సంచార వాహనాలు నిలిచిపోయాయి. 104 వాహనాల్లో పని చేస్తున్న వైద్యసిబ్బంది, వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, డ్రైవర్స్, సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఏజెన్సీలోని సుమారు 50 మంది 104 సిబ్బంది విధులను బహిష్కరించారు. గత శనివారం బొబ్బిలి సమీపంలో 104 వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాద ఘటనలో 104 వాహనం నడుపుతున్న డ్రైవర్‌తోపాటు ఇందులో ఉన్న స్టాఫ్ నర్సు మృతి చెందారు. ఈ వాహనానికి సంబంధించిన రికార్డులు లేకపోవడంతో ప్రమాదానికి గురై మృతి చెందిన సిబ్బందికి నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఇది వరకే 104 వాహనాలకు సరైన రికార్డులను నిర్వహించకపోవడంపై ఇందులో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఇప్పుడీ ప్రమాదం చోటు చేసుకోవడంతో 104 సిబ్బందిలో ఆందోళనకు దారితీసింది. దీంతో అత్యవసరంగా 104 సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇంటి ముంగిటకే నాణ్యమైన వైద్యం అందించాలని 2008లో అప్పటి వైఎస్ ప్రభుత్వం ఈ 104 సర్వీస్‌లను ప్రారంభించింది. డీఎస్సీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ జిల్లా కలెక్టర్ మరియు వైద్య ఆరోగ్యశాఖ ఆధీనంలో సిబ్బందిని నియమించి ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాలు, కనీస వేతన చట్టాలు అమలు చేస్తూ జీవో నంబర్ 3 ప్రకారం జీతాలు చెల్లించేవారు. 2016లో టీడీపీ ప్రభుత్వం ఈ 104 సేవలను చంద్రన్న సంచార చికిత్సగా మార్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు సర్వీస్ ప్రొవైడర్‌గా బాధ్యతలను అప్పగించి 277 వాహనాలు, ఇందులో పని చేస్తున్న సిబ్బందిని టేకోవర్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
నాటి నుంచి 104 నిర్వహణ అలక్ష్యానికి గురైంది. వాహనాలకు సరైన రికార్డులు లేవని, ప్రతి నెలా చేయవలసిన సాధారణ తనిఖీలు, రిపేర్లు నిర్వహించడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని 104 డ్రైవర్లు తెలిపారు. ప్రమాదాలు లేదా ఏదైనా వాహనాలకు సంబంధించి అవాంతరాలు ఎదురైనప్పుడు డ్రైవర్ల తప్పిదం లేకపోయినా సంస్థ నిర్వాకం, ప్రభుత్వ అలక్ష్యం వల్ల తామే మూల్యం చెల్లించాల్సి వస్తోందని వారు వాపోయారు. 104 సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, కనీస వేతన చట్టాలను అమలు చేస్తూ జీవో 151 ప్రకారం వేతనాలు చెల్లించాలని, వాహనాలకు సక్రమంగా రికార్డులు నిర్వహించాలని, వాహనాల కండిషన్ మెరుగుపర్చాలని సమ్మె చేపట్టిన పాడేరులోని 104 సిబ్బంది సతీష్ కన్నా, రామకృష్ణ, క్రాంతి, రవిచంద్ర, ఎస్.బాలరాజు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment