టెక్నాలజీకి పక్షవాతం | error technology | Sakshi
Sakshi News home page

టెక్నాలజీకి పక్షవాతం

Published Sun, Jul 13 2014 3:40 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

టెక్నాలజీకి పక్షవాతం - Sakshi

టెక్నాలజీకి పక్షవాతం

- రుయాలో నిపుణులు లేక మూలనపడ్డ అధునాతన వైద్య పరికరాలు
- మూతపడే స్థాయికి కార్డియాలజీ వార్డు ముందుకు కదలని అంబులెన్స్
- ఇంక్యుబేటర్స్ పనిచేయక శిశువుల నరకయాతన  రుయాలో రోగుల అవస్థలు వర్ణనాతీతం

తిరుపతి అర్బన్: రుయాలోని విలువైన, అధునాతన వైద్యపరికరాలు పాడయ్యాయి. వీటిని మూలపడేసి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. క్యాజువాల్టీ, కార్డియాలజీ, పీడియాట్రిక్(చిన్న పిల్లల), రేడియాలజీల్లో లక్షల విలువ చేసే వైద్య పరికరాలు మూలనపడ్డాయి. మరమ్మతులకు నిధులు లేక కొన్ని, పరికరాల నిర్వహణకు సరైన సిబ్బంది లేక మరికొన్ని రోగుల సేవకు దూరమయ్యాయి. గతంలో టీటీడీ నుంచి కూడా రుయా అభివృద్ధి, వివిధ విభాగాల నిర్వహణకు 40 శాతం నిధులు వచ్చేవి. కానీ ఏం జరిగిందో, ఏమో రుయాకు టీటీడీ నిధులు పూర్తిగా ఆగిపోయాయి.
 
800 ఎంఎం ఎక్స్‌రే అంతేనా?

క్యాజువాల్టీలోని ఎక్స్‌రే మిషన్ చెడిపోయి మూడేళ్లకు పైగా కావస్తోంది. రోగులకు, క్షతగాత్రులకు ఎక్స్‌రే తీయాలంటే దూరంగా పాత భవనంలో ఉన్న మిషిన్ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. అందువల్ల క్షతగాత్రులను స్ట్రెచర్లపై తీసుకెళ్లేటప్పుడు వారికి ఎదురవుతున్న శారీరక ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ మిషిన్ మరమ్మతులకు సుమారు రూ.లక్షకు పైగా కావాల్సి ఉంటుంది. అయితే నిధుల లేమి కారణంగా దాన్ని పట్టించుకోవడం లేదు. అంతేగాక 800 ఎంఎం సామర్థ్యం కలిగిన ఈ మిషిన్ చెడిపోవడంతో తక్కువ సామర్థ్యం ఉన్న 500 ఎంఎం ఎక్స్‌రే మిషినే శరణ్యమయింది. రోగులకు నాణ్యమైన సేవలు అందడం లేదు.
 
వెక్కిరిస్తున్న వెంటిలేటర్లు

రుయాలోని ప్రధాన వైద్య విభాగాల కోసం మొత్తం 12 వెంటిలేటర్లను సుమారు రూ.60 లక్షలు వెచ్చించి నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేశారు. వాటిలో ఇప్పుడు 2 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన పదింటిని బాగు చేయాలంటే రూ.20 లక్షలైనా పడుతుంది. అంతేగాక ఈ వెంటిలేటర్ల నిర్వహణ కోసం విధిగా ఇద్దరు టెక్నీషియన్లు ఉండాలి. కానీ రుయాలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. వెంటిలేటర్లపై సాంకేతిక పరిజ్ఞానం లేక మూలనపడేశారు. వెంటిలేటర్లలో చాలా వాటికి వారంటీ కూడా అయిపోయింది.
 
చస్తే కూడా స్ట్రోక్ యూనిట్లు పనిచేయవు
కార్డియాలజీ, న్యూరాలజీ వార్డుల్లోని పక్షవాతం రోగులకు ఉపయోగించే స్ట్రోక్ యూనిట్ వైద్య పరికరాలు మూలనపడ్డాయి. కార్డియాలజీకి వచ్చే రోగులను మెడిసిన్ విభాగాధిపతి ఆధ్వర్యంలో పర్యవేక్షణకు ఉంచుతున్నారు. సుమారు రూ.20 లక్షలు విలువ చేసే ఈ మిషన్లు రెండూ మూలనపడ్డాయి. వీటి మరమ్మతులకు కూడా రూ.లక్షల్లో అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు.
 
ఇంక్యుబేటర్స్ పనిచేస్తే ఒట్టు

రోజులు నిండకుండా పుట్టిన శిశువులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే చిన్నారులు, కామెర్ల లక్షణాలున్న బిడ్డల కోసం చిన్న పిల్లల ఆస్పత్రిలో వినియోగించే రూ.లక్షలాది విలువ చేసే ఇంక్యుబేటర్లు పాడైపోయి మూలనపడేశారు. ప్రస్తుతం రుయా చిన్న పిల్లల ఆస్పత్రికి వస్తున్న రోగులకు సరిపడా ఇంక్యుబేటర్లు లేక శిశువులు, వారి తల్లిదండ్రులు నరకయాతన పడుతున్నారు.

నిరుపయోగంగా ఆల్ట్రా సౌండ్ స్కానింగ్
క్యాజువాల్టీ విభాగంలో ఏర్పాటు చేసిన ఆల్ట్రా సౌండ్ వైద్య యంత్రానికి నిపుణులైన వైద్యులు, సిబ్బంది లేక రెండేళ్లుగా వినియోగించడం లేదు. ఈ యంత్రంతో వివిధ శరీర నొప్పులు, ఫిజియోథెరపీ అవసరమైన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు. అయితే ఈ యంత్రానికి నిర్వహణా సిబ్బంది లేక వినియోగంలోకి తేవడం లేదు.
 
వేడి పుట్టిస్తున్న ఏసీ మిషన్లు
కార్డియాలజీ విభాగంలోని వార్డులకు అమర్చిన ఏసీ మిషన్లు దుస్థితికి చేరుకుని తుప్పు పట్టిపోయాయి. ప్రస్తుతం రుయాలోని కార్డియాలజీ వార్డు దాదాపు మూతపడే దశకు చేరుకుంది. అయితే స్విమ్స్ నుంచి వచ్చే కార్డియాలజీ ప్రొఫెసర్‌తో ఓపీ మాత్రం నిర్వహిస్తూ, ఇతర ప్రాంతాలకు రోగులను రెఫర్ చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఏసీ మిషన్లు పనిచేయకపోవడంతో చివరకు వార్డునే మూతవేసే పరిస్థితికి తెచ్చారు.
 
అంబులెన్స్ అంతే!

ఇతర ప్రాంతాల నుంచి రుయాకు, రుయాలోని రోగులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సౌకర్యంగా ఉన్న అంబులెన్స్‌లు మూలనపడ్డాయి. సుమారు రూ.7లక్ష ల వ్యయంతో కొనుగోలు చేసిన అంబులెన్స్ ఇలా దుస్థితికి చేరుకోవడంతో పేద రోగులకు ప్రైవేటు అంబులెన్స్‌లే శరణ్యంగా మారాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement