
విజయవాడ డివిజన్ నుంచి వెళుతున్న ‘త్రివేణి’ గూడ్స్ రైలు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కార్గో రవాణాలో విజయవాడ రైల్వే డివిజన్ మరో ఘనత సాధించింది. తక్కువ సమయంలో ఎక్కువ సరుకు రవాణా చేసేలా ఇటీవల మూడు గూడ్స్ రైళ్లను కలిపి ఒకే రైలుగా ‘త్రిశూల్’ పేరుతో విజయవంతంగా నడిపిన విజయవాడ డివిజన్ అధికారులు త్రివేణి మిషన్ పేరిట ఆదివారం నాలుగు అతి పొడవైన గూడ్స్ రైళ్లను నడిపి మరో ఘనత సాధించారు. రెండేసి గూడ్స్ రైళ్లను జతచేసి 118 వ్యాగన్లు ఉన్న ఓ భారీ రైలుగా మలిచారు. ఆ విధంగా ఎనిమిది రైళ్లను నాలుగు భారీ రైళ్లుగా చేసి మూడు గమ్యస్థానాలకు కార్గో రవాణా చేశారు.
వాటిలో ఒక రైలును విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా తాల్చేర్ వరకు 900 కిలోమీటర్లు నడిపారు. మరో గూడ్స్ రైలును కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులవారిపల్లి మీదుగా కేశోరామ్ సిమెంట్ కంపెనీకి 645 కిలోమీటర్లు కార్గో రవాణా చేశారు. బీసీఎన్ రేక్స్ గల రెండు భారీ గూడ్స్ రైళ్లను విజయవాడ నుంచి కొండపల్లి వరకు నడిపారు. తద్వారా కార్గో రవాణా సామర్థ్యాన్ని అమాంతంగా పెంచుకుని విజయవాడ రైల్వే డివిజన్ దేశంలోనే గుర్తింపు పొందింది. రోలింగ్ స్టాక్ నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచింది.
తద్వారా కార్గో రవాణా వేగం పెరగడంతోపాటు తక్కువ సమయంలో లోడింగ్/అన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తిచేశారు. ఖాళీ అయిన వ్యాగన్లు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరతాయి. సిబ్బంది అవసరం తగ్గడంతోపాటు రైలు మార్గంలో రద్దీ తగ్గడంతో రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. భారీ రైళ్లను సమర్థంగా నిర్వహించినందుకు విజయవాడ రైల్వే డివిజన్ ఉన్నతాధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment