సముద్ర వాణిజ్యంలో అగ్రగామిగా | AP Maritime Board ranks 3rd in nationwide commerce | Sakshi
Sakshi News home page

సముద్ర వాణిజ్యంలో అగ్రగామిగా

Published Wed, Apr 6 2022 4:54 AM | Last Updated on Wed, Apr 6 2022 4:55 AM

AP Maritime Board ranks 3rd in nationwide commerce - Sakshi

విశాఖ పోర్టు

ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): తూర్పుతీరంలో సముద్ర వాణిజ్యంలో అన్నివేళల బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోంది. బంగాళఖాతం వెంబడి ఉన్న అనేక నగరాలను దాటుకొని వాణిజ్యం, రక్షణ అంశాల్లో తూర్పు అగ్రగామిగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మేజర్‌ పోర్టుల కేటగిరిలో సైతం విశాఖ ప్రత్యేకత చాటుతోంది. వాణిజ్య పరంగా పోర్టు నుంచి రికార్డు స్థాయిలో సరుకు రవాణా సాగిస్తోంది. దశాబ్దాలుగా వాణిజ్య సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.  

విశాఖ ఓడరేవును లార్డ్‌ విల్లింగ్‌డన్‌ 1933, డిసెంబర్‌19న ప్రారంభించారు. రూ 3.78 కోట్లు వ్యయంతో  ఈ ఓడరేవు నిర్మించారు. ప్రారంభంలో 3 బెర్త్‌లతో ఏడాదికి 1.3 లక్షల టన్నుల సరుకు రవాణా చేసిన ఈ ఓడరేవు ప్రస్తుతం 24 బెర్త్‌లతో 65 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం 974 కిలోమీటర్లు సుదీర్ఘ సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మారిటైం బోర్డు పరిధిలో 13 నాన్‌ మేజర్‌ పోర్టులు ఉన్నాయి. దీంతో పాటు ఏపీలో విశాఖపట్నం పోర్టు ఏకైక మేజర్‌ పోర్టుగా నిలిచింది.  

రక్షణ రంగంలో బలమైన శక్తిగా.. 
రక్షణ పరంగా తూర్పు నావికాదళం విశాఖ కేంద్రంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది. 1968లో ఆవిర్భవించిన తూర్పు నావికాదళం క్రమంగా తూర్పు సముద్ర జలాల్లో అగ్రగామిగా ఎదుగుతోంది. దేశంలో తొలిగా నిర్మించిన అణుజలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ విశాఖలో తయారు చేయడం విశాఖ తీరానికి గర్వకారణంగా నిలుస్తోంది. 1992 నుంచి జరుగుతున్న మలబార్‌ విన్యాసాలకు తూర్పు తీరం అనేక సార్లు ఆతిథ్యమిచ్చింది. తూర్పునావికాదళం విశిష్టతను పెంచేలా ప్రెసిడెంట్‌ ప్లీట్‌ రివ్యూలకు విశాఖను వేదికగా నిలిచింది.

తూర్పున ఏపీకి అగ్రస్థానం..
భారత పోర్ట్స్, షిప్పింగ్స్, వాటర్‌వేవ్స్‌ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం నాన్‌ మేజర్‌ పోర్టుల కేటగిరీలో 2021–22 ఏడాదికి గాను ఓవర్సీస్‌ కార్గో ట్రాఫిక్‌లో ఆంధ్రప్రదేశ్‌ మారిటైం బోర్డు 2వ స్థానంలో నిలిచింది. 70.7శాతం వాటాతో 324.43 మిలియన్‌ టన్నుల లావాదేవీలతో గుజరాత్‌ తొలిస్థానంలో ఉండగా 14.8 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్‌ 2వ స్థానంలో నిలిచింది.  తరువాతి స్థానాల్లో 7.7 శాతం వాటాతో ఒడిశా, 4.2 శాతం వాటాతో మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. అయితే కోస్టల్‌ కార్గో ట్రాఫిక్‌లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. 51.7 శాతం వాటాతో 41.27 మిలియన్‌ టన్నుల లావాదేవీలతో గుజరాత్‌ తొలిస్థానంలో నిలవగా 28.3 శాతం వాటాతో మహారాష్ట్ర 2వ స్థానంలోను 14.4 శాతం వాటాతో ఏపీ మారిటైమ్‌ బోర్డు మూడో స్థానంలో నిలిచాయి. తూర్పున బే ఆఫ్‌ బెంగాల్‌లో కార్గో వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం లభించింది.  

4వ స్థానంలో విశాఖ పోర్టు.. 
2021–22 ఏడాదికి సంబంధించి మేజర్‌ పోర్టుల కేటగిరీలో విశాఖ ఓవర్సీస్‌ కార్గో ట్రాఫిక్‌లో విశాఖ పోర్టు 4వ స్థానంలో నిలిచింది. 20.7శాతం వాటాతో 102.8 మిలియన్‌ టన్నుల లావాదేవీలతో దీనదయాళ్‌ పోర్టు తొలిస్థానంలో ఉండగా 13.5 శాతం వాటాతో పారాదీప్‌ పోర్టు, 13.1 శాతం 3వ స్థానంలో జేఎన్‌పీటి నిలిచాయి. ఈ కేటగిరీలో విశాఖ పోర్టు 8.7 శాతం వాటాతో 4వ స్థానంలో నిలిచింది. కోస్టల్‌ కార్గో ట్రాఫిక్‌లో లావాదేవీల్లో విశాఖపోర్టు మూడో స్థానంలో నిలిచింది. 

24 శాతం వాటాతో 37.0 మిలియన్‌ టన్నుల లావాదేవీలతో పారాదీప్‌ పోర్టు తొలిస్థానంలో నిలవగా 14.3శాతం వాటాతో ముంబాయి పోర్టు 2వ స్థానంలోను, 12.5 శాతం వాటాతో విశాఖపోర్టు మూడు స్థానంలోని నిలిచాయి. మేజర్‌ పోర్ట్‌ల కేటగిరీలో తూర్పున సముద్ర వాణిజ్యంలో పారాదీప్‌ తరువాతి స్థానంలో విశాఖ నిలిచింది.

ఏపీ మారిటైం బోర్డు బలోపేతం 
సముద్ర వాణిజ్యాన్ని పెంపొందించే దిశగా ఏపీ మారిటైం బోర్డును బలోపేతం చేస్తున్నాం. విశాఖ మేజర్‌ పోర్టుతో పాటు 13 నాన్‌ మేజర్‌ పోర్టులో ఏపీ తీరంలో ఉన్నాయి. వీటి ద్వారా  ఏటా ఎగుమతులు, దిగుమతుల సామర్థ్యం ఏటా పెరుగుతోంది. త్వరలోనే రామయ్యపట్నం, మచిలీపట్నం, భావనపాడు ఓడరేవులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రకాశం జిల్లా రామయ్యపట్నం పోర్టుకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాం. చేపల నిల్వ, విక్రయాలకు అనువుగా ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా దేశం ఆశ్చర్యపోయే రీతిలో మారీటైం బోర్డును బలోపేతం చేయనున్నాం.  
– కనకాల వెంకటరెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement