ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కడ్‌కు స్వాగతం పలుకుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): బ్లూ ఎకానమీలో మారీటైమ్ డొమైన్ కీలకంగా వ్యవహరిస్తోందనీ.. 2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా.. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని సాముద్రిక ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథి ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ మహా సముద్రాలంతటా దేశాల మధ్య సహకారం, అభివృద్ధికి వేదికగా మిలాన్ మారిందన్నారు.
దేశ చరిత్రలో కీలకంగా వ్యవహరిస్తూ సముద్ర భద్రతలో, భారతదేశ సముద్ర చరిత్రలో కీలకమైన పాత్రను పోషించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్లో మిలాన్‌తో పాటు ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, వివిధ దేశాలతో భాగస్వామ్యాలు, సహకారంతో సాగర జలాల్లో తలెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో మన దేశం పెద్దన్న పాత్ర పోషిస్తోందన్నారు. సముద్ర వాణిజ్యంలో భద్రత సవాళ్లను కలిసికట్టుగా అధిగవిుంచాలని పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఎంతో అవసరమని, ఇందుకోసం భద్రత, సుస్థిరతను నిర్ధారించడానికి దేశాలు కలిసివచ్చి.. సహకార వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని ఉప రాష్ట్రపతి ధన్కర్ చెప్పారు.
సదస్సులో నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, వివిధ దేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరయ్యారు. అంతకు ముందు మిలాన్–2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు ఐఎన్‌ఎస్ డేగాలో నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మేయర్ హరివెంకటకుమారి, తూర్పు నావికాదళాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే గణబాబు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, అడిషనల్ డీజీ(గ్రేహౌండ్స్) ఆర్కే మీనా తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment