ఫ్యాషన్‌ నా పాషన్‌ | Valentina Mishra makes Visakhapatnam proud | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌ నా పాషన్‌

Published Wed, Sep 13 2023 1:17 AM | Last Updated on Wed, Sep 13 2023 1:17 AM

Valentina Mishra makes Visakhapatnam proud - Sakshi

వాలెంటీనా మిశ్రా

‘మనలోని రకరకాల భయాలే అపజయాలకు కారణాలు అంటారు’ వాలెంటీనా మిశ్రా. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వాసి అయిన వాలెంటీనా  జాతీయ, అంతర్జాతీయ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనే కిడ్స్, మిస్, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ కి పద్దెనిమిదేళ్లుగా గ్రూమింగ్‌ సెషన్స్‌ నిర్వహిస్తున్నారు.మనలోని ఆత్మవిశ్వాసమే కోరుకున్న శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది అని చెబుతున్న వాలెంటీనా శాస్త్రీయ నృత్యకారిణి కూడా. ఇద్దరు పిల్లలకు తల్లి. మిస్‌ అండ్‌ మిస్టర్‌ గ్రాండ్‌ సీ వరల్డ్‌ బల్గేరియా పోటీలకు వైస్‌ ప్రెసిడెంట్‌గా,15 అంతర్జాతీయ పోటీలకు నేషనల్‌ డైరెక్టర్‌గా, 12 దేశాలలో జరిగిన పోటీలకు 50 కి పైగా పోటీదారులను తీర్చిదిద్దిన వాలెంటీనా మిశ్రా ఫ్యాషన్‌ నా పాషన్‌ అంటూ ఆ రంగంలోకి తన పయనాన్ని ఈ విధంగా వివరించారు. 

‘‘పద్దెనిమిదేళ్ల ఈ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని కలిశాను. ముఖ్యంగా మహిళలను. ఒక మహిళ మాత్రమే మరో మహిళను శక్తిమంతంగా మార్చగలదు అనేది నేను బలంగా నమ్ముతాను. సుస్మితా సేన్, ఐశ్వర్యారాయ్‌ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని గెలు΄పొందిన రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి తనూ మిస్‌ ఇండియా, మిస్‌ యూనివర్స్‌ కావాలనుకుంది.

అలాగే నేనూ అనుకున్నాను. లైట్స్, కెమరా ప్లాష్‌లు, స్టేజ్, చప్పట్ల మోతలు.. ఇవన్నీ అమ్మాయిలకు ఒక అద్భుతంగా ఉంటుంది. నన్ను నేను అలాంటి స్టేజ్‌పైన చూసుకోవాలనుకున్నాను. అదృష్టవశాత్తు చిన్నప్పడు శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నాను. గ్రూప్‌ సాంగ్‌ పోటీల్లోనూ చురుగ్గా ఉండేదాన్ని. స్టేజ్‌ ఫియర్‌ అస్సలు ఉండేది కాదు. ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేశాను. కానీ, నాకు నచ్చిన రంగం ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ 
ఇండస్ట్రీ.

పోటీలు నిర్వహించాను.. 
ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో ఉండటం వల్ల గ్రూమింగ్‌ అవకాశాలు వచ్చాయి. గ్రూమింగ్‌ అంటే ఒక క్యాట్‌వాక్‌ ఒక్కటే కాదు, మాట్లాడటం, బాడీ లాంగ్వేజ్, సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్, వ్యక్తిత్వం, ఐక్వూ్య లెవల్స్‌.. అన్నీ కలిసి ఉంటాయి. సాధారణంగా మోడల్స్‌ 18 నుంచి 25 వరకు ఇండస్ట్రీలో ఉంటారు.ఆ తర్వాత కొత్తవారు వస్తుంటారు. పెళ్లికి ముందు వరకు మెరుస్తారు. ఆ తర్వాత మాయమవుతారు.

నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇవన్నీ చూశాను. చాలా మందిని కలవడం వల్ల కూడా గ్రూమింగ్‌ సెషన్స్‌వైపు దారితీసేలా చేసింది. ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో కొనసాగుతూనే గ్రూమింగ్‌ సెషన్స్‌ ఇవ్వడం మొదలుపెట్టాను. కేరళలో జరిగే మిస్‌ సౌత్‌ ఇండియా, మిస్‌ క్వీన్‌ ఆఫ్‌ ఇండియా ఈ రెండు పోటీలకు గ్రూమర్‌గా నా కెరియర్‌ స్టార్ట్‌ చేశాను. అక్కడ నుంచి దేశ,అంతర్జాతీయ పోటీలకు గ్రూమర్‌గా వర్క్‌ చేస్తున్నాను. నా అనుభవాన్నంతా కలిపి ‘డీలా వాలెంటీనా’ అని నా సొంత కంపెనీ స్టార్ట్‌ చేశాను. 

పిల్లలతో కాంటెస్ట్‌.. 
ఈ రోజుల్లో పిల్లలకు ఎక్స్‌పోజర్‌ చాలా ఎక్కువైపోయింది. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువస్తుంటారు. చాలా కంప్లైంట్స్‌ చెబుతుంటారు. కానీ, పిల్లలకు గ్రూమింగ్‌ చేస్తున్నప్పుడు వారితో నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇంటర్నేషనల్‌ పేజెంట్స్‌తోనూ కలిసి వర్క్‌ చేశాను. ఇండియన్‌ కిడ్స్, గర్ల్, బాయ్స్‌ని టీమ్స్‌గా ఎంపిక చేసి, 25 దేశాల్లో వారి ప్రతిభను పరిచయం చేశాను.

దేశవ్యాప్తంగా వచ్చిన ఎంట్రీల నుంచి కొంతమందిని ఎంపిక చేసుకొని, ముందు ఇంటర్వ్యూ చేసి, షార్ట్‌ లిస్ట్‌ చేసుకుంటాం. ఎవరైనా కాన్ఫిడెంట్‌ కాస్త లో ఉంది అనిపించినా వారిని ప్రిపేర్‌ చేస్తుంటాను. ప్రతి ఒక్కరిలో కొన్ని నెగిటివ్‌ పాయింట్స్‌ ఉంటాయి. వాటిలో సన్నగా లేదా లావుగా ఉన్నాను అనో, రంగు తక్కువ ఉన్నాననో.. ఇలాంటి భయాలను గుర్తించి, వారి ఆలోచనలను పాజిటివ్‌గా మారుస్తుంటాను.

పెళ్లి తర్వాత...
నేను ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాను. నన్ను నేనే కాదు ఎదుటివారినిప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటాను. గతం వదిలేయాలి, భవిష్యత్తులో కాకుండా ప్రస్తుతంలో జీవించాలి.. అనుకుంటాను. నాకు 21 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత ఫ్యాషన్‌ ఇండస్ట్రీ గురించి ఆలోచన అవసరమా.. అనే క్వశ్చన్‌ మార్క్‌ వస్తుంది. కానీ, మా అమ్మనాన్నలు, మా వారు నన్నుప్రోత్సహించారు.

మా వారు రవికూమార్‌ నేవీ ఆఫీసర్‌. ఇద్దరు పిల్లలు. అబ్బాయి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో ఉన్నాడు, మా అమ్మాయి 12వ తరగతి చదువుతంది. తను కూడా కిడ్స్‌ గ్రూప్‌లో పదేళ్ల వయసు టీమ్‌లో సౌత్‌ ఆప్రికాలో జరిగిన బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్లొంది. ఒక వ్యక్తిత్వం సంతరించుకున్నాక ఏమీ చేయలేం అంటారు. కానీ, ఏ దశలోనైనా మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఏ కష్టం లేకుండా రాత్రికి రాత్రి విజయాలు రావు. ఈ పద్దెనిమిదేళ్ల టైమ్‌లో నా ఎక్సీపీరియన్స్, హార్డ్‌ వర్క్‌తోనే సక్సెస్‌ అయ్యాను.

నాకోసం కొంత సమయం.. 
పిల్లలు, పెద్దలు, ఆడ–మగ ఎవ్వరైనా.. ఫిజిక్‌ను కాపాడుకోవాలంటే అది ఫ్యాషన్‌ ఇండస్ట్రీయే కానక్కర్లేదు. గ్రూమర్‌గా రాణించనక్కర్లేదు. సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పెంచుకుంటూ హార్డ్‌ వర్క చేస్తేనే విజయం సొంతం అవుతుంది. ఇంటి పని చేసే గృహిణి అయినా, ఉద్యోగి అయినా తమకోసం తాము ఓ అరగంట కేటాయించుకోవాలి.  ప్రతి ఒక్కరూ తమ కోసం ఏదైనా ఆరుబయట ఆడే ఆటలు, వాక్, యోగా, జుంబా, జిమ్‌... ఏదైనా చేయండి. ఒక అరగంట చాలు.

అలాగే పోషకాహారం తీసుకోవడంలో శ్రద్ధ పెట్టాలి. కూరగాయలు, పండ్లు... ఏవైనా రొటీన్‌గా కాకుండా మార్చుకుంటూ తీసుకోవాలి. మన ΄÷ట్ట ఒక బెలూన్‌. ఎంత తింటే అంత పెరుగుతుంటుంది. బరువు పెరిగాక బాడీని వెనక ఫిట్‌నెస్‌కి తీసుకురావలని కష్టపడేకన్నా ముందే సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది’’ అని వివరించారు ఈ బ్యూటీ అండ్‌ గ్రూమర్‌.– నిర్మలారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement