
సాక్షి, పాతపోస్టాఫీసు (విశాఖపట్టణం): ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి భారత్‌లో ఉగ్ర దాడికి ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ చర్యలతో దేశవ్యాప్తంగా అప్రమత్తం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తీర ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ తాజా హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో కేంద్రం హోంశాఖ హై అలెర్ట్ ప్రకటించింది. ఢిల్లీ నుంచి అందిన ఆదేశాల మేరకు భద్రతా బలగాలు సంయుక్తంగా జల్లెడ పడుతున్నాయి. అందులో భాగంగా విశాఖ తీరం పొడవునా నేవీ, కోస్ట్‌గార్డ్, మెరైన్, సివిల్ పోలీసు దళాలు గస్తీ ముమ్మరం చేశాయి.
సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పాటు అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద బోట్లు సముద్రంలో సంచరించే అవకాశం ఉందన్న సమాచారంతో తీరం పొడవునా డేగ కళ్లతో పరిశీలిస్తున్నారు. నిఘా చర్యలు కట్టదిట్టం చేశారు. అదే విధంగా ఫిషింగ్ హార్బర్లో మెరైన్, కోస్ట్‌గార్డ్ అధికారులు మత్స్యకారులకు రక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. మత్స్యకారులు వేట చేస్తున్న సమయంలో అనుమానాస్పద వ్యక్తులు, బోట్లు కనిపిస్తే వెంటనే కోస్ట్‌గార్డ్, మెరైన్ కంట్రోల్ రూములకు సమాచారం అందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment